మానవ దేహంలో  114 చక్రాలు ఉన్నాయి. నిజానికి ఇంకా ఎక్కువే ఉన్నాయి, కాని ఈ  114 చక్రాలు ప్రధానమైనవి. మీరు వాటిని 114 జంక్షన్ బాక్సులుగానో  లేదా నాడీ సంగమాలుగా చూడవచ్చు. ఇవి ఎప్పుడూ త్రికోణాకారంలో ఏర్పడతాయి. శబ్దార్థపరంగా చక్రం అంటే ఒక వృత్తం. ఒక పరిమాణం నుంచి మరొక పరిమాణానికి కదలికకు చిహ్నంగా, ఈ నాడీ సంగమాలను చక్రాలుగా సంభోదిస్తారు కాని, నిజానికి ఇవి  త్రికోణాలుగా ఏర్పడతాయి.

మొత్తం 114 చక్రాలనూ ఉత్తేజితం చేసినట్లయితే, మీకు శరీర స్పృహ ఉండదు

ఈ 114 చక్రాలలో, రెండు చక్రాలు మన దేహానికి వెలుపల, 112 చక్రాలు మన దేహం లోపల ఉంటాయి. ఈ 112 లో ఏడు చక్రాలు మరింత ప్రధానమైనవి.  చాలా మందికి, వీటిల్లోని మూడు చక్రాలు ఉత్తేజితమై ఉంటాయి, మిగిలినవి నిద్రాణంగానో లేక చాలా కొద్దిపాటిగా ఉత్తేజితమై ఉంటాయి. మీరు భౌతిక జీవితం గడిపేందుకు 114 చక్రాలను ఉత్తేజితం (క్రియాశీలం) చెయ్యవలసిన అవసరం లేదు. కేవలం వాటిల్లో కొన్ని ఉత్తేజితమై ఉన్నా, మీ జీవితాన్నిఎంతో సంపూర్ణంగా జీవించవచ్చు. మొత్తం 114 చక్రాలనూ ఉత్తేజితం చేసినట్లయితే, మీకు శరీర స్పృహ ఉండదు. మీకు దేహానుభూతి ఉండనే ఉండదు. మీకు దేహ స్పృహ క్రమంగా తగ్గిపోయే విధంగా మీలోని శక్తి వ్యవస్థను క్రియాశీలం చెయ్యడం - ఇదే, యోగ సారం. మీరు ఇక్కడ కూర్చుంటే శరీరంలోనే ఉంటారు, కాని ఇకపై మీరు శరీరం కాదు.

దక్షిణ భారతంలో, సదాశివ బ్రహ్మేంద్రుడు అనే యోగి ఉండేవారు. ఆయన ‘నిర్కాయుడు’, అంటే ‘శరీరం లేని యోగి’ అని అర్ధం. ఆయనకు శరీర సృహ లేనే లేదు.ఎవరికైనా శరీరం గురించిన స్పృహ లేనప్పుడు, అలాంటి మనిషికి బట్టలు వేసుకోవడం గురించి అసలు తోచదు. ఆయన దిగంబరంగానే నడిచేవారు. శరీర స్పృహ కూడా లేనివారికి యెల్లలు, ఆస్తుల గురించిన స్పృహ ఏమి ఉంటుంది. ఒకరోజు, ఆయన కావేరీ నదీ తీరాన నడుచుకుంటూ రాజుగారి ఉద్యానవనంలోకి ప్రవేశించారు. రాజుగారు అక్కడ తన రాణులతో విహరిస్తున్నాడు. సదాశివ బ్రహ్మేంద్రుడు నగ్నంగా ఆ ఉద్యానవనంలోకి, ఆ ఆడవాళ్ళ ముందుకి వెళ్ళారు – ఆయనకు ఎవరు స్త్రీ, ఎవరు పురుషుడు అన్న స్పృహ కూడా లేదు. రాజుకు చాలా కోపం వచ్చింది, ‘నా స్త్రీ ల ముందు నగ్నంగా నడిచే ఆ మూర్ఖుడు ఎవరు?’ అంటూ ఆయన తన సైనికులను పంపి, ‘ఈ మూర్ఖుడు ఎవరో కనుక్కోండి!’ అంటూ ఆజ్ఞాపించాడు. సైనికులు ఆయన వెనుక పరిగెత్తుకెళ్ళి పిలిచారు.ఆయన వెనక్కి తిరిగి కూడా చూడలేదు, ఆయన అలా నడుస్తూనే ఉన్నారు. సైనికులు ఆగ్రహించి, కత్తులు దూసి, ఆయన కుడిచేతిని నరికారు. కాని ఆయన అడుగులు వెయ్యటం కూడా ఆపలేదు, నడుస్తూనే ఉన్నారు.

‘నిర్కాయుడు’, అంటే శరీరం లేని యోగి

ఇది చూసి, సైనికులు భయపడ్డారు. ఆయన మామూలు మనిషి కాదని వారు గుర్తించారు. ఆయన చెయ్యి నరికినా ఆయన నడుస్తూనే ఉన్నారు. రాజు, సైనికులు ఆయన వెనకాల పరుగెత్తారు, కాళ్ళమీద పడి, ఆయనను వెనక్కి ఉద్యానవనంలోకి తీసుకువచ్చారు. ఆయన తన శేషజీవితం అంతా, అదే వనంలో గడిపి, అక్కడే తనువు చాలించారు. ఇటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి.

నేను రెండు లేక మూడు రోజులు ఆహారం, నిద్రా లేకుండా ఇక్కడ  ఇలానే కూర్చుని ఉండగలను. మీ శక్తి కనుక ఒక నిర్దిష్టమైన విధంగా ఉంటే, మీకు శారీరక స్పృహ ఉండదు, మీరు తినడం, విసర్జనం చేయటం గురించి కూడా ఆలోచించరు. మీకు సమయం ఉన్నప్పుడే, వీలైతేనే అవన్నీ, ఒకవేళ సమయం లేకపోతే రోజంతా ఆహారం లేకుండా ఉండగలరు. ఎందుకంటే, మీ శక్తే ఒక ఉచ్ఛ స్థాయిలో ఉన్నప్పుడు , మీరు బయటనుండి మాటి మాటికీ ఏదో ఒకటి తీసుకోవాల్సిన అవసరం రాదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు