ఈ ప్రపంచంలో కోట్లాదిమందిలో ఏ ఒక్కరిద్దరికో రంగులను గూర్చిఓ నిర్దిష్టమైన పరిజ్ఞానం, అవగాహనా ఉంటాయి. ఓ చిత్రకారుడు వృక్ష సమూహాన్నిచిత్రీకరించినప్పుడు మహా అయితే తనకి కనిపించిన ఓ 50 ఆకుపచ్చవర్ణాలను పటం మీద సృష్టించగలడు, కానీ ఆతని కంటికందని ఆకుపచ్చ వర్ణాలూ, రంగులూ, ఆ అటవి సంపదలో ఎన్ని దాగున్నాయో! అయినప్పటికీ, ఓ చిత్రకారుడి నేర్పుని నిశితంగా చూసినప్పుడు, ఆతని కుంచె ఆ అడవిలోని వివిధ హరిత ఛాయల్నిపటంపై ఉన్నదున్నట్టుగా వెదజల్లే తీరుకి ఆశ్చర్య పడతారు!

రంగుల గురించి సరైన అవగాహన కావాలంటే, మీ ‘అనాహత’ ఉత్తేజితమై ఉండి తీరాలి.. 

 

తర్కించే మనసెప్పుడూ రంగుల్ని లెక్క చేయదు. అంతే కదా, మీరు తార్కికంగా చూస్తే, దైనిందన జీవితంలో, తెలుపూ, నలుపూ, అక్కడక్కడా, కొద్దిగా తేడా/ వ్యత్యాసం తెలియడానికి కొంత బూడిద రంగు ఇవి సరిపోతాయి కదా?ఇన్నిరంగులు సృష్టించడం ఎందుకు? ఆ సృష్టికర్తకి, మతిభ్రమీస్తే తప్ప ఇలాంటి పనిచేయడు! రంగుల గురించి సరైన అవగాహన కావాలంటే, మీ ‘అనాహత’ ఉత్తేజితమై ఉండి తీరాలి. ఉదాహరణకి, మీరొక శక్తిమంతమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనైనప్పుడో, లేక ఎవరితోనైనా ప్రేమలో పడ్డప్పుడో మీ ‘అనాహత’ ఉత్తేజితమౌతుంది, తద్వారా మీకు, మీ చుట్టూ వర్ణాలు మామూలుకంటే ప్రస్ఫుటంగా, స్పష్టంగా కనిపిస్తాయి. అంతే కాదు, వైజ్ఞానిక శాస్త్రం స్త్రీలకి పురుషులకంటే వర్ణాలు ఇంకా మెరుగ్గా, స్పష్టంగా కనిపిస్తాయని చెపుతోంది.

ఒక్కో రూపానికి నిర్దిష్టమైన ఓ వర్ణముంది.

ఉపరితల స్థాయిలో చూసినప్పుడు రంగు కేవలం కళ్ళకి, చూపుకి, సంబంధించినదిగా గోచరిస్తుంది. కానీ కొంచెం లోతుగా చూసినప్పుడు, ప్రకృతిలో కనిపించే అనేక రంగులకీ, మీ పంచేంద్రియాలకీ, ప్రగాఢమైన సంబంధముంది. అనంత సృష్టికీ ఆదిమూలమైన శక్తే ఈ భూగోళంలో సమస్త జీవరాశిని సృష్టించింది—ఓ కీటకం మొదలుకుని, ఓ పువ్వునుండి.. మీ వరకు, అన్నిటికీ మూలమదే. ఈ సృష్టిలో ఓ అణువు మొదలుకుని విశ్వం వరకు, మౌలికమైన క్రమం  (design) ఒక్కటే , కాకపొతే వాటివాటి రూపాల్ని బట్టి వేర్వేరు స్థాయిలో ఉంటాయి, కొన్ని ఆకృతులు సరళంగా, మరికొన్ని జటిలంగా ఉంటాయి. మౌలికంగా ఈ క్రమం (design) అన్నిటిలోనూ ఒక్కటే కాబట్టి, మీ ఇంద్రియాల నిర్మాణం, రంగుల నిర్మాణం, మీ ఇంద్రియాలు రంగులని గ్రహించే విధానం, ఇవన్నీఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. కొన్ని నిర్దిష్టమైన రంగులు ఇంద్రియాల్లోని నిర్దిష్టమైన అంశాలతో ముడి పడి ఉంటాయి. ఫలితంగా వివిధ వర్ణాలకు మీలో వివిధ కోణాలను చైతన్యవంతం చేసే శక్తి ఉంది. ఒక్కో రూపానికి నిర్దిష్టమైన ఓ వర్ణముంది. సరైన శ్రద్ధ పెడితే, ఒక  రూపం ఎంత సూక్షమైనదైనప్పటికీ అది ఓ  వర్ణంతో జోడించబడ్డదన్న విషయాన్ని మనం అనుభూతి చెందవచ్చు. ఇది తప్పక సాధ్యమౌతుంది. ప్రతీ శబ్దానికీ ఓ ఆకారముంటుంది కాబట్టి, ప్రతీ శబ్దానికీ ఓ రంగు కూడా ఉంటుంది. అందుకే మంత్రం సాధన చేసే వారికి వాటితో జోడించి ఉన్నవివిధ వర్ణాలు కనిపిస్తాయి.

ప్రతీ శబ్దానికీ ఓ ఆకారముంటుంది కాబట్టి, ప్రతీ శబ్దానికీ ఓ రంగు కూడా ఉంటుంది.

భారత దేశపు శాస్త్రీయ సంగీతంలో, ఎన్నోమధురమైన రాగాలుంటాయి. ‘రాగ’ అంటే ‘రంగు’ లేదా ‘వర్ణం’ అని అర్ధం. శబ్దాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని, ఆ శబ్దాలను వాడడం ద్వారా  వర్ణాలనూ, రూపాలనూ సృష్టించారు. ఇది ఓ పదంతోనే మొదలౌతుంది.మన మానసిక అవగాహనలో దీనికో అర్ధం ఉండచ్చు. కానీ, తరచి చూస్తే ఇది కేవలం ఒక శబ్దమే... ఓ శబ్దం, ఓ వర్ణం, దానితో జోడించి ఉన్నఓ ఆకారం.. ఉన్నది ఈ త్రయమే. అందుకే ఈ బ్రహ్మాండానికి ఆదిమూలమైంది ‘ధ్వని’ అనేదే చర్చ అంతా. భౌతిక పదార్ధమేదైనా తీసుకోండి, ఒక స్థాయి వేగం దాటిందంటే, అది వెలుగు అవుతుంది, అంటే అందులో రంగు అంతర్లీనంగా ఉంటుంది. మీరు తదేకంగా దానిపై శ్రద్ధ పెడితే, ఈ అంశాలన్నీ వాటంతట అవే మీకు వెల్లడౌతాయి. ఎవరో అన్నారు, ‘తలుపు తడితే చాలు ఉన్నదంతా వెల్లడౌతుంది’ అని.. మానవ చైతన్యానికి ఈ సృష్టిలోని ప్రతీద్వారాన్నీతెరిచే శక్తుంది,కాకపొతే మీ శ్రద్ధ శ్రేష్టమైనదై దాన్ని తారాస్థాయికి తీసుకు వెళ్లినప్పుడే ఇది సాధ్యమౌతుంది. మీక్కావలసింది జీవితంలోని ప్రతీ అంశంపై శ్రద్ధ...

ఆభాస 
ఎటు చూసినా రంగుల అతిశయమే...
సూర్యోదయాల్లో... సూర్యాస్తమయాల్లో...
ఆకుల్లో... పువ్వుల్లో...
ఇంద్రధనుస్సుల్లో... నీడల్లో.
అంతా ఏ రంగూ లేని ధవళ వర్ణపు హేల!
ఏ రంగూలేని ఆత్మని తాకితే చాలు...
రంగులన్నిటిలో ఏ చాయనైనా అద్దుకోగల    
సమర్థత సంతరించుకుంటుంది.
ఈ రసమయ జగతిలోని ఇన్నికోట్ల రంగులూ  
విరాగియైన విశ్వాత్ముని లీలావిలాసమే!
 
 
ప్రేమాశీస్సులతో,
సద్గురు

 

ఇంగ్లిషులో చదవండి: Sadhguru Spot