మనం పాల గురించి మాట్లాడుకుందాం. అలాగే దానికి చేర్చదగ్గ ఆరోగ్యవంతమైన ప్రత్యామ్నయాలను కూడా తెలుసుకుందాం. 

కేవలం మూడు సంవత్సరాల్లోపు పిల్లలకు మాత్రమే పాలని పూర్తిగా జీర్ణం చేసుకునే ఎంజైమ్స్ ఉంటాయి. కొన్ని ప్రాంతాలు మినహా, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పెద్దవారికి పాలు చాలా వరకూ అరగవు. ఈ అరగని పాలు  శ్లేష్మాన్ని ఏర్పరుస్తాయి, సోమరితనాన్ని కలుగజేస్తాయి. నిజమే, పాలని సాంప్రదాయంగా క్యాల్షియం వనరుగా భావిస్తారు. కానీ క్యాల్షియాన్ని అందించే ఇతర మంచి వనరులు కూడా ఉన్నాయి.

ప్రత్యామ్నాయాలు

ముడి ధాన్యాలు, కాయధాన్యాలు మరియు పప్పులు (వేరుశెనగ, బాదం, జీడి, పిస్తా..). ఇవి రోజువారీ క్యాల్షియం అవసరాలను తీర్చడంలో పాలకి అత్యుత్తమమైన ప్రత్యామ్నయాలు.

ఉదాహరణకి:

వేరుశెనగ పప్పు ఓ సంపూర్ణ ఆహారం. భారతదేశంలో, చాలా మంది యోగులు పూర్తి వేరుశెనగ భోజనం చేసేవారు. ఎందుకంటే, అది పచ్చిగా స్వీకరిస్తే సంపూర్ణ ఆహారమవుతుంది. వేరుశెనగని కనీసం 6 గంటల పాటు నీళ్ళలో నానబెట్టాలి. దీనివల్ల పిత్తానికి సంబంధించిన అంశాలు పక్కకు వెళిపోతాయి. మీరు నానబెట్టకుండా వేరుశెనగను తింటే, అది దద్దుర్లను, వికారాన్ని కలిగిస్తుంది.

ఉలవలు ఐరన్, క్యాల్షియంలకు మంచి వనరు, ఇది శాకాహారం ద్వారా అందే మంచి ప్రోటీన్లకు అత్యుత్తమమైన వనరు. క్యాల్షియం, ఐరన్ ఇతర రసాయాన పదార్థాలతో కలిసి ఉండడం వల్ల, శరీరం వీటిని తేలిగ్గా స్వీకరించలేదు. ఉలవల్ని మొలకెత్తించడం ఒక సులువైన పధ్ధతి. ఈ ప్రక్రియ ఐరన్, క్యాల్షియంల లభ్యతని పెంచడం వల్ల ఉలవల పోషక విలువ బాగా పెరుగుతుంది. అంతేకాక, మొలకెత్తిన ఉలవలు చాలా సులభంగా జీర్ణమవుతాయి. ఉలవలు శరీరంలోని ఉష్ణాన్నిపెంచుతాయి. దీనివల్ల వర్షపు, మబ్బు వాతావరణంలో దగ్గు, జలుబులని తేలిగ్గా గట్టెక్కవచ్చు.  అయితే, ఎండ తీవ్రత ఉన్నప్పుడు, ఉలవలు శరీరాన్ని వేడెక్కిస్తోంటే, మొలకెత్తిన పెసరపప్పుని తినడం ద్వారా ఆ ప్రభావాన్ని తగ్గించవచ్చు.

‘నేను ఇది తింటాను, ఇది తినను. నేను ఇలానే తినాలి, నేను అలానే తినాలి’ అంటూ సరిగ్గా తినడం కంటే కూడా ఆనందంగా తినడం చాలా ముఖ్యం. ఆహరం మీపై ప్రభావాలను చూపిస్తుంది, కానీ అది అంత ముఖ్యమైన అంశం కాదు. తినడంలో నిజమైన ఆనందం అంటే, మరో జీవం మీలో భాగమవ్వడానికి, లీనమవ్వడానికి, కలగలసిపోవడానికి, మీరుగా మారడానికి సిద్ధంగా ఉందన్న విషయం పట్ల ఎరుకతో ఉండడమే. మనిషికి తెలిసిన అతిగొప్ప సంతోషం ఇదే - ఎదో ఒక రీతిలో, తనది కానిది తనలో భాగమవ్వడానికి సిద్ధంగా ఉందన్న విషయం”  ~ సద్గురు