ప్రాణప్రతిష్ఠకూ, ఇతర ప్రతిష్ఠలకూ మధ్య ఉన్న తేడా గురించి సద్గురు ఏమి చెప్పారో మనం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకుందాం....


ప్రతిష్ఠాపనల్లో ఎక్కువగా వాడుకలో ఉన్న పద్ధతులు - మంత్రాలతో, క్రతువులతో ఇంకా ఇతర విధానాల ప్రక్రియలతో ప్రతిష్ఠ చేయటం. మీరు ఒక రూపాన్ని మంత్రాలతో ప్రతిష్ఠ చేసినట్లైతే ,దానికి ఎప్పటికప్పుడు నిరంతర నిర్వహణ అవసరం ఉంటుంది. భారతదేశంలో సంప్రదాయపరంగా "మన ఇళ్ళలో రాతి విగ్రహాలను పెట్టుకోకూడదు" అని చెప్తారు. ఎందుకంటే ప్రతీ రోజూ వాటికి సరైన పూజలు ఇంకా క్రతువులు నిర్వహించవల్సి ఉంటుంది. ఒక దేవుడిని మంత్రాలతో ప్రతిష్ఠిన్చినప్పుడు దానికి రోజూవారి అవసరమైనవి చేయకపోతే అది ఒక క్షీణించే శక్తిగా మారి ఆ ప్రాంగణంలో ఉండేవారికి ఎంతో హాని చేస్తుంది. దురదృష్టవశాత్తూ చాలా గుడులు సరైన నిర్వహణ లేకుండా ఇలానే అయిపోయాయి. వీటిని సజీవంగా ఎలా ఉంచాలో జనాలకు తెలియదు.

ఒకసారి అది స్థాపితమైన తరువాత అది ఇక అనంతమైనది, దానికి ఇక ఎటువంటి నిర్వహణ అవసరం లేదు.

ప్రాణప్రతిష్ఠ అటువంటిది కాదు. ఒక రూపాన్ని మంత్రాలతోనో లేక క్రతువులతోనో కాకుండా ప్రాణ శక్తితో ప్రతిష్ఠ చేస్తారు. ఒకసారి అది స్థాపితమైన తరువాత అది ఇక అనంతమైనది, దానికి ఇక ఎటువంటి నిర్వహణ అవసరం లేదు. అందుకనే ధ్యానలింగంలో ఎంటువంటి క్రతువులు, ఆచారాలు లేవు. దానికి వాటి అవసరం లేదు. దేవాలయాలలో చేసే క్రతువులు మీకోసం చేసేవి కాదు, అవి ఆ దేవతను సజీవంగా, శక్తివంతంగా ఉంచటానికే చేస్తారు. లేకపోతే అది మెల్లిగా క్షీణిస్తుంది. ధ్యానలింగానికి అటువంటి నిర్వహణ ఏదీ అవసరం లేదు ఎందుకంటే అది ప్రాణ ప్రతిష్ఠ ద్వారా ప్రతిష్టించబడింది. అది ఎప్పటికీ అలానే ఉంటుంది. లింగంలోని రాతి భాగాన్ని మీరు తీసివేసినా కూడా అది అలానే ఉంటుంది. ఈ ప్రపంచమంతా లయమైపోయినా ఈ రూపం అలానే నిలిచి ఉంటుంది. మీరు దాన్ని నాశనం చేయలేరు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు