మనం ఆఫీస్‌లో  ఆనందంగా ఉండటం ఎందుకు ముఖ్యం?  ఇతరులతో కలిసి చేసే పని మనం ఆనందంగా  ఉంటే  ఎలా ఉంటుంది? ఆనందంగా లేకపోతే ఎలా ఉంటుంది? ఆనందంగా లేకపోవడం వల్ల మన ఆఫీసులు ఎలా తయారవుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే  ఈ వ్యాసం చదవండి.


మీ ఆఫీస్‌లో లేదా మీరు పని చేసే ప్రదేశంలో అందరూ ఆనందంగా ఉంటే, మీరు చేసే పనికి సంబంధించిన అన్ని వ్యవహారాలు ఎలా జరుగుతాయి? తప్పకుండా జరిగేదేమిటంటే అందరూ వారి శక్తికొలది పని చేస్తారు. ఏ పనిని అయినా సరే, కనీసం కొంతవరకైనా క్రమబద్దీకరించవలసి ఉంటుంది. మనుషులు ఆనందంగా ఉన్నా, బాధగా ఉన్నా, పనిని మటుకు చేయవలసిన విధంగానే చేయాలి. ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నానని, తలకిందులుగా నడిచి ఆఫీసుకి వెళితే కుదరదు. అవసరానికి అనుగుణంగా, చేయవలసిన పద్ధతిలో, పనికి సంబంధించిన వివిధ అంశాలను నిర్వహించవలసి ఉంటుంది.

పనిని క్రమబద్దీకరించడంలో చాలా అంశాలు ఉంటాయి. మీరు ఎలా క్రమబద్దీకరించినా సరే, 100 లేదా 200 మంది పనిచేసే పరిస్ధితులలో, ఎలాగైనా సరే చాలా లోపాలు ఉంటాయి. ఇతరులు వేలు పెట్టగలిగే స్పష్టత లేని విషయాలు చాలా ఉంటాయి. ఇది ఎప్పుడూ ఇలాగే ఉంటుంది; ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా పూర్తిగా క్రమబద్దీకరించబడిన సంస్ధ అంటూ లేదు. మీరు అలా చేస్తే అక్కడ ఏ పనీ జరగదు. మీరు చేసే పని పురోగతి చెందాలంటే ఎక్కడో ఒక చోట కలిసి ఆ పని చేయవలిసిన అవసరం ఉంటుంది, కానీ ఆ కలిసి పనిచేసే ప్రదేశాలే ప్రజలకు సమస్యాత్మక ప్రదేశాలు అవుతున్నాయి. ప్రజలు ఇప్పుడు ఘర్షణ పడుతున్నారు. ఎందుకంటే వారందరూ ఒకేసారి ఒకే దారిలో వెళ్ళవలసి వస్తుంది.

ఆనందంగా ఉన్న వ్యక్తులు ఇద్దరు కలిసి పనిచేస్తే, పరిస్ధితి ఎలా ఉంటుంది? ఇప్పుడు సమస్యాత్మక ప్రదేశాలుగా ఉన్న ఆ స్పష్టత లేని ప్రదేశాలే, వారు దగ్గరకి వచ్చి కలిసి మెలిసి పనిచేసి అద్భుతాలు సృష్టించే ప్రదేశాలుగా మారతాయి, అవునా, కాదా? ఇప్పుడు ప్రజలు ఒక చోటకు వచ్చి, కలిసిమెలిసి పని చేయవలిసిన ప్రదేశాలే సమస్యాత్మక ప్రదేశాలు అవుతున్నాయి. కలిసి పని చేయవలిసిన అవసరం లేకపోతే, ఎవరి పని ఎవరికి వాళ్ళు ఏ సమస్యా లేకుండా చేసుకుంటారు.

కొన్ని సార్లు మీ పని ఇతరుల పనితో మిళితం అయ్యి, కలిసి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది, సమస్య అంతా అక్కడే, అవునా, కాదా? ఆ పనితోనే సమస్య ఉంటే, అది వేరే విషయం. నేను సమస్యలోని మానవీయ అంశం గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే అదే పెద్ద సమస్య. ఏ ఆఫీసులో అయినా, పనిచేసే చోట అయినా పనికి సంబంధించిన సమస్యలు ఒక ఎత్తు అయితే, మానవీయ సమస్యలు వాటి కంటే ఇంకా పెద్ద ఎత్తు. అందరూ కలిసి సమిష్టిగా పని చేస్తే, నిజమైన సమస్యలను చాలా తేలికగా పరిష్కరించవచ్చు, కానీ ఆనందం అంటే ఏమిటో తెలియని వారందరినీ ఒక్కటి చేయటం చాలా చాలా కష్టమైన పని.

ఆనందంగా ఉన్న రోజున మీరు ఎంత సర్దుకుపోతారో చూసారా? మీరు దీనిని గమనించారా? అప్పుడు మీ వైఖరి ఇతరుల పట్ల ఎంత సానుకూలంగా ఉంటుందో, ఇతరుల కోసం ఏమి చేయటానికైనా మీరు ఎంత సంసిద్ధంగా ఉంటారో గమనించారా? ఇతరుల కోసం మీరు అవసరమైతే కాళ్ళు తుడుచుకునే పట్టా అవడానికి కూడా సంసిద్ధంగా ఉంటారు. ఎందుకంటే మీరు ఎలాగూ అప్పటికే ఆనందంగా ఉన్నారు. కానీ మీరు సంతోషంగా లేని రోజున మీ చుట్టూ ఉన్న ప్రపంచంపై మీరు ఎలాంటి డిమాండ్లు చేస్తారో మీకు తెలుసా?

మీరు పని చేసే ప్రదేశంలో మీరు చాలా పనులు వేరే వాళ్ళతో కలిసిచేయవలసి ఉంటే, దానికి అనుగుణంగా చాలా చోట్ల మీరు చేసే పనిలో మరొకరి ప్రమేయం అవసరమౌతుంది. ఇలా కాక, పని చేయటానికి వేరే మార్గం లేదు.  ఆనందంగా ఉండే వ్యక్తులు ఉంటే, ఇతరులతో కలిసిమెలిసి పని చేయడం ఓ అవకాశం అవుతుంది; అది అనుకున్నవాటిని ముందుకు తీసుకెళ్ళడానికీ, చేయవలిసిన పనులను త్వరగా చేయడానికీ ఓ పెద్ద అవకాశం. అదే బాధగా ఉండే వ్యక్తులు కలిసి ఉంటే, ప్రతిదీ సమస్యే; అసలు వారి అస్థిత్వమే ఒక పెద్ద సమస్య.

మనుషులు ఘోరంగా ప్రవర్తించడానికి కారణం వారు ఆనందంగా లేకపోవడమే. వారు బాధలో ఉన్నప్పుడు చాలా మొండిగా ఉంటారు, సర్దుకొని పోలేరు. కానీ అదే మనుషులు ఆనందంగా ఉన్నప్పుడు, చాలా చాలా అనుకువుగా, సర్దుకుపోయి ఉంటారు. అవునా,కాదా?

ప్రేమాశీస్సులతో,
సద్గురు
"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు