ప్రశ్న : సద్గురు! మరణించిన తరువాత ఎవరన్నా తమ దేహాన్ని మెడికల్ కళాశాలకి ఇవ్వదలిస్తే, ఆ తరువాత కాలభైరవకర్మ చేయటంలో ఏమైనా ఉపయోగం ఉంటుందా?


ఇప్పటి సమాజంలో వ్యవహారరీత్యా కొన్ని విషయములు మాట్లాడకుండా ఉంటేనే మంచిది. కాని మెడికల్ కళాశాలకి ఒకరి దేహాన్ని గానీ, అవయవాలను గానీ ఇవ్వడంలో చాలా విషయాలు ఉన్నాయి. భౌతిక రూపంతో చాలా గాఢమైన గుర్తింపుని ఏర్పరచుకోవడంవల్లే ఇదంతా జరుగుతున్నది. దీని గురించి నేను వ్యాఖ్యానం చేయటం సబబు కాదు. ఎందుకంటే బ్రతికి ఉండడం జనానికి చాలా ముఖ్యం. మనుషులు బ్రతకాలనుకుంటున్నారు కాబట్టి, వారు బ్రతకడానికి చేయగలిగినదంతా చేస్తున్నారు. అందులో తప్పులేదు. మీరు ఇప్పుడు ఇక్కడ ఎవరికి చెందిన ఏ అవయాలతో కూర్చున్నారో ఎవరికి తెలుసు!

భౌతిక శరీరానికి కాలభైరవకర్మ చేయనక్కర్లేదు. శరీరాన్నితగులబెట్టి దానిని మరలా మట్టితో కలవనివ్వాలి. ఒకటి, రెండు శరీరావయాలు ఇంకా కొంత కాలం పనిచేసేట్టుగా ఉంటే, వాటిని అవి సరిగా పనిచేయని వేరే శరీరంలో అమర్చుకోవచ్చు. కాలభైరవ కర్మ అనేది దేహాన్ని వదిలి వెళ్ళిన పార్శ్వం కోసం. కాలభైరవ కర్మ చేయడానికి  దేహంతో సంబంధమున్న ఎదో ఒక వస్తువు మనకు కావాలి. ఎందుకంటే ఈ శరీరానికి స్మృతి (జ్ఞాపకశక్తి) ఉంటుంది. అందుకే, మేము రెండు పార్శ్వాలను అనుసంధానం చేయడానికి ఉపయోగపడే గుర్తుగా చనిపోయిన మనిషి బట్టలు, ఫొటో వాడతాము.

మరణించిన తరువాత ఆ దేహానికి ఏమీ చేయం. ఎందుకంటే అలా చేయడంలో అర్థo లేదు. మనం శరీరానికే కాల భైరవకర్మ చేయాలి అనుకుంటే, మనిషి ఇంకా జీవించి ఉన్నప్పుడే చేసేవాళ్ళం కదా! మరణించిన తరువాత ఇంకొక శరీరం కోసం వెతుకుతూ ఓ చిన్న జ్ఞాపకంలా అక్కడే తిరగాడుతున్న మృతజీవి కోసమే కాలభైరవ కర్మ. దేహంలో ఉన్నప్పుడు ఆ జీవి  వినదు గనుక, చనిపోయిన తర్వాతైనా దానికి కొంత విజ్ఞత  కలుగ చేయడానికి ఇప్పుడు కాలభైరవకర్మ అనేది చేస్తున్నాం. వారికి విచక్షణా ఙ్ఞానం ఇంక ఉండదు, తమ బుద్ధిని కోల్పోయినవారికి మనం చాలా చేయవచ్చు. విచక్షణా ఙ్ఞానం పోయినప్పుడు, అంటే అక్కడ  వడపోసే జల్లెడ అనేది లేనప్పుడు, అది ఓ తెరచిన పెద్ద రంధ్రం అవుతుంది - అందులో మీకు ఏది కావాలంటే అది వేయవచ్చు. మీకు విచక్షణా ఙ్ఞానం ఉన్నప్పుడు, అంటే అక్కడ ఓ జల్లెడ ఉన్నప్పుడు మీకు ఇష్టం లేనిది ఏదైనా సరే ఆ జల్లెడ వడపోస్తుంది. అంటే దాదాపు ఈ సృష్టి మొత్తాన్ని వడపోస్తుంది! అలాంటప్పుడు ఖచ్చితంగా శివుడు కూడా బయటే ఉండిపోతాడు!

ఒక రకంగా చెప్పాలంటే, మొత్తం ధ్యాన ప్రక్రియ మరణానికి అనుకరణ లాంటిదే.  దేహం ఒక సమస్య కాకుండా, విచక్షణా ఙ్ఞానం కూడా లేకుండా ఉండడమే మరణం

ఒక రకంగా చెప్పాలంటే, మొత్తం ధ్యాన ప్రక్రియ మరణానికి అనుకరణ లాంటిదే.  దేహం ఒక సమస్య కాకుండా, విచక్షణా ఙ్ఞానం కూడా లేకుండా ఉండడమే మరణం. విచక్షణా ఙ్ఞానం అనేది మీ గత అనుభవాలు, మీ మీద పడిన ముద్రలపై ఆధారపడి ఉంటుంది. ఈ విచక్షణా ఙ్ఞానం అనేది ఒకరికి మరొకరికంటే సునిశితంగా ఉండవచ్చు. కాని దానితో మీరు దాని అసలు స్వభావం ప్రకారం విభజింప వీలుకాని దాన్ని విభజిస్తున్నారు. విచక్షణను వాడడం అంటే ఒకదాన్ని అది  ఉన్న విధంగా కాకుండా, ఫ్రస్తుతం మీకు కనిపించే విధంగా చూసే స్థితికి పతనమవ్వడం.

మీకు మృతజీవికీ, మృత దేహానికీ మధ్య తేడా అర్థమయ్యిందనుకుంటున్నాను. మెడికల్ కళాశాల వారికి మృతదేహంపై ఆసక్తి ఉంటుంది కానీ, మృతజీవి పై కాదు. మరణించిన వారికి వాళ్ళు ఏమి చేయలేరు. కాలభైరవకర్మ అనేది మృతజీవికే గానీ, మృతదేహానికి కాదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు