ప్రశ్న: సద్గురూ! మీరు మీ బయటి కార్యక్రమాలను కొంత తగ్గించుకొని,  ఆశ్రమంలో ఆధ్యాత్మిక పనులను తీవ్రం చేస్తామన్నారు. దాని గురించి కొంచం వివరించగలరా?

ఆశ్రమంలో ఇప్పటికే మనం ఇది చాలా రకాలుగా చేస్తున్నాము. ఆశ్రమం బయట పనులు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గటం లేదు అని నేను ఒప్పుకోక తప్పదు. కాని చాలా మంది కొద్ది కొద్దిగా, అంచెలoచెలుగా మార్పు చెందుతున్నారు. ఈ ఆధ్యాత్మిక విషయాల్లో చాలా వాటిని నేను భౌతికంగా ఇక్కడే ఉండి చూడనవసరం లేదు; నేను ఎక్కడున్న అవి జరిగేటట్లు చూడగలను. చాలా మంది బ్రహ్మచారులు కఠోరమైన సాధనలో ఉన్నారు. వారిలో స్పష్టమైన మార్పుకనబడడానికి  కొంత సమయం పడుతుంది, మొత్తానికి కఠోర సాధన జరుగుతున్నది. వారిలో ఎక్కువ మంది ఇలాంటి సాధనలో స్థిరపడితే,  అప్పుడు ఆశ్రమంలో ఎంతో కాలంగా ఉంటూ  శారీరికంగా, మానసికంగా  తగినంత స్థిరత్వం సాధించిన మిగతా వారికి ఇంకొంత సాధనను జతచేయవచ్చు.

2010 సం. అమెరికాలో జరిగిన 90 రోజుల అనాది ప్రోగ్రాంలో లాగా ఎక్కువ మందితో కార్యక్రమo నిర్వహించడానికి కొంత ప్రయత్నం చేశాము. అలాంటి కార్యక్రమాలు, ముఖ్యంగా అంత మందితో, చాలా అరుదుగా జరుగుతాయి. అక్కడ జరిగినది చాలా, చాలా విశేషమైనది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న కొంత మందిలో చాలా మార్పు వచ్చింది. కానీ ఈ రోజుల్లో జనo ప్రతి 2 రోజులకూ ప్రతిదాని గురించి తమ అభిప్రాయములు మార్చుకుంటున్నారు. దీర్ఘకాలపు ప్రయోజానాల గురించి ఆలోచించే వివేకం లేదు. ఆది శoకరాచార్యుల వారు “నిశ్చలతత్వo జీవన్ ముక్తి:” అని అన్నారు. అంటే  దేని మీదైన దీర్ఘకాలం స్థిరంగా మనస్సు లగ్నం చేయగలిగితే,  అది ముక్తికి దారితీస్తుంది అని అర్ధం. ఏదైనా తీసుకోండి! భగవంతుడే కానక్కరలేదు, స్వర్గం కానక్కరలేదు - దేనిమీదైనా సరే! ఒక పువ్వును కానీ లేదా ఒక చీమను కానీ లేక ఇంకా ఏదైనా సరే- స్థిర చిత్తంతో, తదేక ధ్యాసతో  చూడగలిగితే ముక్తి లభిస్తుంది. మీరు ప్రేమగానే ఉండనవసరం లేదు, కోపంతో అయినా  స్థిర చిత్తంతో ఉంటే- మీరు ముక్తిని పొందుతారు. ప్రీతికరమైనదైనా,  కాక పోయినా ఫరవాలేదు, ఏదైనా సరే, మీరు తదేక ధ్యాసతో చూడగలిగితే ముక్తి లబిస్తుంది. ఈ రోజుల్లో శ్రద్ధ లేక పోవడాన్ని ఒక యోగ్యతగా చూస్తున్నారు.

నేను 90 రోజుల అనాదిలో జరిగిన విషయాలను కొంత విస్మయంతో గమనిస్తూ వచ్చాను. అనాదిలో వారికి ఏమి ఇచ్చాము, వారు ఆ సాధన ఎలా చేశారు, ఇచ్చిన సాధనలో ఏ స్థాయికి వారు చేరుకున్నారు. వారిలో చాలామంది తమకు అది పూర్తిగా పనిచేసినా కూడా తమ అభిప్రాయాలను ఏ విధంగా మార్చుకుంటున్నారు... ఈ విషయాలన్నిటినీ కొంత ఆశ్చర్యంతో గమనిస్తూ వచ్చాను.  మీలో మార్పు కనిపించకపోతే దాని గురించి కలత చెందకoడి, దానిని వదిలేయండి. కానీ, మీలో అసాధారణ రీతిలో  మార్పు వచ్చినా కూడా మీరు అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటే, మీకు ఇంకా ఎన్ని వాయిదాలు అవసరమో, మీరు ఇంకా చిన్న చిన్న అడుగులే వేస్తూ ఉంటారో లేదా పెద్ద పెద్ద అడుగులు వేస్తారో మీరే తేల్చుకోవాలి. పాశ్చాత్య దేశాల్లో మీ మనసు మార్చుకోవడం అంటే చాలా గొప్ప విషయం, దేని పట్ల నిబద్దత లేకుండా ఉండడమే స్వేచ్ఛ అని వారనుకుంటారు.

మన దేశంలో కూడా పట్టణాలలో ఇలాంటి సంస్కృతికి త్వరగా అలవాటు పడుతున్నారు, వారు కూడా ఎంతో దూరంలో లేరు. వారికి ఒక దాని వల్ల ఏదో కొంత మంచి జరిగినా కూడా, వారు దానిని వదిలిపెడుతున్నారు. ఇలా అస్థిరంగా ఉండే వారు మార్పు కోసం తాపత్రయ పడకూడదు, ఎందుకంటే ఆ విధంగా మార్పురాదు. సజీవం కాని ఒక తెలివితక్కువ సాధన నేర్పించాలంటే నేను ఒక పేపర్ మీద రాసి ఇస్తే చాలు, కానీ ఏదైనా సజీవ ప్రక్రియను అందించటానికి  ప్రాణాన్నే ఫణంగా పెట్టవలసి వస్తుంది. మీది కాదు నాది. నేను దాన్ని తేలికగా తీసుకొను. పెరగని చోట విత్తనo నాటినా ఉపయోగం ఉండదు, రాతి మీద అమూల్యమైన విత్తనాన్ని వేయడం ఎందుకు? అలాంటి విత్తనం సారవంతంగా ఉండే భూమిలో నాటటం నాకు ఇష్టం. దానికి మీరు నన్ను నిందించగలరా? మంచి నేల కనిపిస్తే, అన్నింటినీ చల్లుతాను, కాని రాతిపై చల్లితే ఉపయోగము ఉండదు కదా!

అందుకనే ‘ఎవరు, ఎలా ఉన్నారు’ అని చూసి, అప్పుడు దశలవారీగా చేద్దాము అనుకుంటున్నాము. మీరు ఆశ్రమంలో ఉన్నా లేకున్నా, నేను మిమ్మల్ని చూసినా చూడకపోయినా కలత చెందవద్దు. కనీసం మీ పేరు నాకు తెలియకపోయినా సరే, మీరు సాధన చేస్తూ మీ వ్యవస్థను సిద్ధంగా ఉంచుకుంటే, సమయం వచ్చినప్పుడు హాజరు అవుతాము. దాని గురించి మాట్లాడనవసరం లేదు, మీ వ్యవస్థను సిద్ధం చేసుకోండి, మిగతాది మేము చూసుకుంటాము.

మిమ్మల్ని మీరు సుముఖంగా ఉండేటట్లు తయారుచేసుకుంటే,  ‘మీ’ నుంచి మిమ్మల్ని మీరు విడుదల చేసుకుంటే, మిమ్మల్నివ్యర్ధం కానివ్వను, అటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. మీలో ఏ తప్పు లేదు, కేవలం మీరు మీ చుట్టూ హద్దులు ఏర్పరుచుకున్నారు. మీ శరీరం,  మీ మనస్సులను ఎక్కువగా ఆరాధించకండి. మిగతాది నేను చూసుకుంటాను. ఇది మీకు నా వాగ్దానం, ఇది నేను వెనక్కి తీసుకోను.

ప్రేమాశీస్సులతో,
సద్గురు