ఈ రోజుల్లో హఠ యోగా వికృత రూపం తీసుకుంది. దీనికి కారణం అందరూ దీనిని ఒక సర్కస్‌లాగా తయారు చేయడమే. పశ్చిమ దేశాల్లో ఇది జరుగుతున్న తీరు చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే అక్కడ యోగా పేరుతో అన్నిరకాల పిచ్చిపనులు చేయబడుతున్నాయి. యోగాసనాలు ఒక వ్యాయామం కాదని,  అవి మీ ప్రాణశక్తిని ఒక నిర్దిష్ట దిశలో ఉత్తేజపరిచే సున్నిత్తమైన ప్రక్రియలని మీరు అర్ధం చేసుకోవాలి. వీటిని చాలా సున్నితంగా వీలైనంత చేతన(awareness)తో చేయడం చాలా ముఖ్యం.

ఆసనాలను ఒక నిర్దిష్ట క్రమపద్దతిలో చేయాలి. ఈ క్రమపద్ధతి మీరో, నేనో కనిపెట్టినది కాదు – ఇది మానవ వ్యవస్థ ఎలా పని చేస్తుందనే దాన్ని గమనించడంవల్ల వచ్చినది. మీ వ్యవస్థలో అస్థిపంజర వ్యవస్థ సౌఖ్యం(skeletal comfort), కండరాల సౌఖ్యం (muscular comfort), అవయవ సౌఖ్యం (organ comfort), ప్రాణశక్తి సౌఖ్యం (energy comfort) అనేవి ఉంటాయి. ఉదాహరణకు మీరు ఒక ఏటవాలుగా ఉన్న కుర్చీలో కూర్చుంటే మీ కండరాలు సౌకర్యంగా ఉంటాయి కానీ, మీ కీళ్ళు, అవయాలు ఇబ్బందికి గురవుతాయి. మీ ఉదరభాగంలోని ముఖ్యమైన అవయవాలు గట్టిగా నట్లు, బోల్టులతో బిగించబడి ఉండవు, అవి కణజాల బంధనంతో వేలాడతీయబడి ఉంటాయి. అందువల్ల ఏటవాలుగా ఉన్న కుర్చీలో కూర్చుంటే వాటికి సౌకర్యంగా ఉండదు.

హఠ యోగాలో ప్రాణశక్తి సౌఖ్యం కూడా పరిగణింపడుతుంది. మీ ప్రాణశక్తిలోని ఒక అంశాన్ని ఉత్తేజపరచకుండా మరొక అంశాన్ని ఉత్తేజపరిస్తే,  మీ ప్రాణశక్తి అస్థవ్యస్థంగా పని చేస్తుంది.  అందువల్ల మీ వ్యవస్థ గందరగోళానికి గురి అవుతుంది. అస్థవ్యస్థ శక్తి అంటే మీరు అస్థవ్యస్థంగా జీవిస్తున్నారని అర్థం. మీరు ఎక్కువ రోజులు జీవించవచ్చు, లాటరీ గెలవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, రోజుకు 24 గంటలు పూజ చేయవచ్చు, కానీ మీ  ప్రాణశక్తి అస్థవ్యస్థంగా పని చేస్తున్నంత వరకు,  మీరు ఎన్నటికీ సంపూర్ణ జీవులు కాలేరు. మీరు ఏమి చేసినా సరే,  మీది ఒక అస్థవ్యస్థ జీవనమే అవుతుంది.

ఆసనాలు క్రమపద్ధతిలో చేయడం ద్వారా మానవ వ్యవస్థను ఒక చివరి నుంచి మరొక చివరి వరకు ఒక క్రమపద్ధతిలో ఉత్తేజపరచవచ్చు. కొన్నిసార్లు  మీ జీవన పరిస్థితులు అకస్మాత్తుగా మారవచ్చు –  అలాంటప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా మీరు పని చేయవలసి రావచ్చు. మీరు మీ వ్యవస్థను ఒక పద్ధతిలో ఉత్తేజపరిస్తే, ఏది జరిగినా మీ వ్యవస్థను కలత పెట్టకుండా మీరు వాటిని ఎదుర్కోగలరు. ఎవరైనా దీన్ని స్పష్టంగా చూడవచ్చు – మీరు సరైన సాంప్రదాయ హఠ యోగాని చేస్తే ఎలాంటి పరిస్థితులు వచ్చినా అవి మిమ్మల్ని చెదరగొట్టలేవు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

సాంప్రదాయ హఠ యోగాని శుద్ధరూపంలో అందించాలి అనేది సద్గురు ఆశయం. అసలైన హఠ యోగాని నేర్పించే యోగా టీచర్లను తయారుచేయటం కోసం 'ఈశా హఠ యోగా స్కూల్‌' వారు 21 వారాల టీచర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని అందిస్తున్నారు. మరిన్ని వివరాలకు 08300097444కి కాల్ చేయండి, లేదా  info@ishahathayoga.com కి ఈమెయిల్ చేయండి.