చాలా మంది మనుషులు వారు బాధలో ఉన్నప్పుడు మాత్రమే నేర్చుకుంటారు, వారు అప్పుడే తమ లోపలికి  లోతుగా చూస్తారు. ఐతే మనం జీవితాన్ని ఎప్పుడు లోతుగా పరిశీలించాలి -  బాధలోనా లేక ఆనందంలోనా?  ఈ ప్రశ్నలకు సమాధానాలు  తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవండి.


చాలా మంది మనుషులు వారు బాధలో ఉన్నప్పుడు మాత్రమే నేర్చుకుంటారు, వారు అప్పుడే తమ లోపలికి  లోతుగా చూస్తారు. అది తెలివైన లక్షణం కాదు. మనుషులు ఆనందంగా ఉన్నప్పుడే, వారు తమ జీవితాన్ని లోతుగా చూడాలి; కానీ వారు ఆనందంగా ఉన్నప్పుడు తుచ్ఛంగా జీవిస్తారు. వారి జీవితంలో ఏదో ఘోరమైన తప్పు జరిగితే గానీ, వారు లోతుగా చూడరు.

మీరు ఎవరితోనైనా మీరు ఆశ్రమంలో నివసిస్తున్నారని చెపితే, వారు, ‘అయ్యో ఏమైంది?, మీ భర్త పోయారా? మీ పిల్లవాడు పోయాడా? మీ జీవితంలో ఏదైనా చాలా బాధాకరమైన సంఘటన జరిగిందా?’ అని అడుగుతారు. మిమ్మల్ని వారు ఇటువంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతారంటే, వారు బాధలో ఉన్నప్పుడే, వారి జీవితంలో ఏదో ఘోరమైన తప్పు జరిగినప్పుడే, వారు జీవితపు ప్రగాఢ పార్శ్వాలను వెతుకుతారు. మానవ చరిత్ర దురదృష్టవశాత్తూ అలానే ఉంది, కానీ అది అలా కానవసరంలేదు. కేవలం ఎక్కువ మంది మనుషులు ఏదో చేస్తున్నంత మాత్రానా, వారు చేసే పని సరైనది అవ్వలేదు.

కేవలం ఎక్కువ మంది మనుషులు ఏదో చేస్తున్నంత మాత్రానా, వారు చేసే పని సరైనది అవ్వలేదు.

మీరు వెనక్కి తిరిగి చూస్తే, 70లలో అనుకుంటా, 80% మంది మగవారు పొగ త్రాగేవారు. అవునా? అది అప్పుడు సరైన పని. పోగ త్రాగకపోతే, మీరు సరైన మగవారే కాదు, అవునా? ప్రజల మనస్సుల్లో సృష్టించబడిన చిత్రం అది, అవునా, కాదా? మార్ల్‌బొరో మ్యాన్ - అతనే అసలైన మగవాడని మీకు తెలుసు కదా! సిగరెట్ చేతిలో లేని మగాడు మగాడే కాదు. అది మనం సృష్టించి, నమ్మిన చిత్రం. దాని వల్ల యువతరం మనకన్నా ఇంకా ముందు పొగ త్రాగటం మొదలుపెట్టింది, కానీ ఇప్పుడు ధూమపానం ఒక రాక్షస కృత్యమని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

ప్రపంచంలో ఈ ప్రచారం ఎంత పెద్ద ఎత్తున సాగుతోందంటే నేడు పొగ త్రాగేవారి సంఖ్య నాటకీయంగా తగ్గిపోయిందని మీరు గమనించవచ్చు. ఈ ప్రచారం ఇలాగే కనుక కొనసాగితే, ఇంకో 50 ఏళ్లలో ఎవరూ పొగ త్రాగక పోవచ్చునని నేను చెప్పగలను. ముందు ముందు గతంలో మనుషులు పొగ త్రాగేవారని, దాని వలన దగ్గు వచ్చేదని , ఇంకా కాన్సర్ కూడా వచ్చేదని, అయినా కూడా పొగ త్రాగటం మానేవారు కాదని చెబితే బహుశా ఎవరూ నమ్మలేక పోవచ్చు.

గతంలో మనషులు అలాంటి పని ఎందుకు చేసారో వారికి అర్ధమవ్వదు. 'మనం పొగవచ్చే వాహనాలనే తగ్గించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, గతంలో మనుషులు ఎందుకు పొగ త్రాగారో' అని వారనుకుంటారు. రెండు తరాల తరువాత, పొగ త్రాగటం అనే దాన్ని ఎవరూ నమ్మరు.

బాధకి మూల కారణం ఇదే; మీ మనసు, మీ శరీరం, మీ భావోద్వేగం మీలోని మౌలిక జీవశక్తికి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి.

ఇది ఎంతగా ఉండేదంటే, విక్టోరియన్ కాలంలో, ఇంగ్లాండ్, యూరోప్‌లలో క్షయరోగం(టిబి) ఉండటం నిజానికి ఒక ఫాషన్. ఇది మీకు తెలుసా? అది నిజం. టిబి ఉండటం ఒక ఫాషన్. చాలా మంది యువ మేధావులు, కవులు, కళాకారులు చికిత్స పొందడానికి నిరాకరించి చనిపోయారు. ఎందుకంటే, మేధావులంటే వారు ఎప్పుడూ దగ్గుతూనే ఉండాలని ప్రజలు అనుకునేవాళ్ళు. మీరు ఆరోగ్యంగా బలిష్టంగా ఉంటే, మీకు బుర్ర లేదని కేవలం శరీరం మాత్రమే ఉందని అనుకునేవాళ్ళు.

25 ఎళ్ళ వయసులోనే టిబికి మనం పోగొట్టుకున్న వారిలో ప్రసిద్ధ కవి జాన్ కీట్స్ ఒకరు. ఆయన చికిత్స పొందటానికి నిరాకరించారు. ఇది ఇప్పుడు మీరు నమ్మగలరా? ఇది కేవలం ఒకటి లేదా రెండు శతాబ్దాల క్రితం మాట. ఇది మీరు నమ్మలేరు. అది అంతే. మీ మేధస్సు మీకు మీరు ఆపాదించుకున్న సామాజిక గుర్తింపుతో ఎంత లోతుగా చిక్కుకుపోయిందంటే, మీ బుర్ర మీలోని జీవంతో అనుసంధానమై పనిచేయట్లేదు.

మీరు అర్ధం చేసుకోవలసినది ఏమిటంటే, మీ మేధస్సు అనేది జీవితంలో మీకు మీరు ఆపాదించుకున్న సామాజిక గుర్తింపుతో చిక్కుకుపోయి ఉంది. బాధకి మూల కారణం ఇదే; మీ మనసు, మీ శరీరం, మీ భావోద్వేగం మీలోని మౌలిక జీవశక్తికి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. మీలో ఉన్న జీవశక్తి ఎప్పుడూ మహానందంతో ఉండడానికి ఎదురు చూస్తోంది, కానీ మీ మనసు, మీ భావోద్వేగం, కొన్ని సార్లు మీ శరీరం కూడా దానికి వ్యతిరేక దిశలో వెళుతున్నాయి.

ఇది మూర్ఖత్వంగా అనిపిస్తుంది, అవునా? ఈ మూర్ఖత్వం మీరు అర్ధం చేసుకునే దానికన్నా ఇంకా చాలా లోతయినది. మూర్ఖులు వారెంత గాఢమైన మూర్ఖత్వంలో ఉన్నారో అర్ధం చేసుకోలేరు. అది చాలా లోతైన మూర్ఖత్వం. ఎందుకంటే వారు వారి జీవితానికే వ్యతిరేకంగా పని చేస్తున్నారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు