ఈ జీవితం శాశ్వతం కాదు. పుట్టినవారు గిట్టక తప్పదు. అందరికీ తెలుసు ఈ వాస్తవం. అయినా మృత్యువు అంటే చాల మందికి చెప్పలేని భయం. మృత్యుభయం గురించి అడిగిన ప్రశ్నకు సద్గురు ఏమి సమాధానం ఇచ్చారో ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి!


 ప్రశ్న: నాకు మృత్యువంటే భయం, అందువల్ల దేనిమీదా మనసు నిలవటం లేదు. నేనేమి చేయాలి?

ఏ క్షణాన మీరు మృత్యువుని తిరస్కరిస్తారో, అదే క్షణాన మీరు జీవితాన్ని కూడా తిరస్కరించినట్టే. మృత్యువు అనేది ఎప్పుడో భవిష్యత్తులో మీకు జరగబోయే విషయం కాదు. ఎప్పుడు జననం జరిగిందో, అప్పుడే మరణం కూడా సగం జరిగిపోయింది. మిగతా సగం మాత్రమే ఇప్పుడు జరగవలసి ఉంది; ఏదో ఒక రోజు అది పూర్తవుతుంది. జీవన ప్రక్రియ -మరణ ప్రక్రియ వేరు వేరు కాదు; అవి రెండు చాలా లోతుగా కలిసిపోయి ఉన్నాయి. ఈ జీవన్మరణ ప్రక్రియ ప్రతి క్షణం జరుగుతూనే ఉంది. మీ ఉచ్చ్వాసం జీవితం, నిశ్వాసం మృత్యువు. మీరు జన్మించిన తరువాత, మీ జీవితంలో మీరు చేసిన మొట్ట మొదటి పని గాలి పీల్చడం. మీరు చేసే చిట్టచివరి పని, గాలి వదిలేయడం. మీరు ఊపిరి వదిలి మళ్లీ తీసుకోకపొతే, అదే మృత్యువు .... అంతే !

మీరు జన్మించిన తరువాత, మీ జీవితంలో మీరు చేసిన మొట్ట మొదటి పని గాలి పీల్చడం. మీరు చేసే చిట్టచివరి పని, గాలి వదిలేయడం. మీరు ఊపిరి వదిలి మళ్లీ తీసుకోకపొతే, అదే మృత్యువు .... అంతే

జీవితం ఎప్పుడూ అనిశ్చితమే. మృత్యువు మాత్రం నిశ్చయం. దాని గురించి ఏ సందేహం లేదు. మీ జీవితం పట్ల మీకు లక్ష సందేహాలు ఉండవచ్చు, " నేను ధనవంతుడిని అవుతానా, లేదా? నేను విద్యావంతుడిని అవుతానా, కానా? నాకు జ్ఞానోదయం అవుతుందా, లేదా?" అనేవాటి పట్ల మీకు లక్ష సందేహాలు ఉండవచ్చు, మరణంతో ఆ ప్రశ్నలేవి ఉండవు. అలాంటప్పుడు నిశ్చయమైన దానితో కాక, మీరు అనిశ్చితమైన వాటితో ఎందుకు కాలం గడపాలి? ఆధ్యాత్మిక ప్రగతి మొదలయ్యేది కేవలం మీరు మృత్యువు గురించి ఆలోచించినప్పుడే. మీరు భగవంతుడిని గూర్చి ఆలోచిస్తే ఆధ్యాత్మికులు అయిపోరు. మీరు దేవుని ప్రార్ధించేది కేవలం మీరు సంతోషంగా ఉండడానికి లేక మీ వ్యాపారం బాగా నడవడానికి లేక స్వర్గానికి పోవటానికే. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితాన్ని మీరే నరకప్రాయం చేసుకున్నారు!

ఆధ్యాత్మిక ప్రగతి మొదలయ్యేది కేవలం మీరు మృత్యువు గురించి ఆలోచించినప్పుడే. మీరు భగవంతుడిని గురించి ఆలోచిస్తే ఆధ్యాత్మికులు అయిపోరు.

మీకు మృత్యువు గురించిన ఆలోచన ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మాత్రమే మీరు ఆధ్యాత్మికులుగా మారగలరు. మీరు కూడా ఉదయం వికసించి సాయంత్రానికి రాలిపోయే ఒక పూవు లాంటి వారన్న గ్రహింపు మీకు ఎప్పుడు వస్తుందో, అప్పుడు మీరు మీ దారిలో ఎదురయ్యే ఏ పూవుని నిర్లక్ష్యం చేయరు.

మృత్యువు నిశ్చయం అని మీకు తెలిస్తే, అది ప్రతి విషయాన్నీ సరైన కోణంలో చూపుతుంది. మీ వెర్రి కల్పనలు చెదిరి పోతాయి, వాస్తవం నిలుస్తుంది. మీ కల్పనలు మీ ఆలోచనలపై ఆధిపత్యం వహిస్తే, మీరు తెలివితక్కువ పనులు చేస్తారు. వాస్తవ దృక్పధం మీ మనస్సుపై ఆధిపత్యం వహించినప్పుడు మాత్రమే, మీరు తెలివిగా ఈ ప్రపంచంలో నడుచుకుంటారు, మీ మనసు కావలసిన వాటిపై ధ్యాస పెడుతుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

The Journey by H. Koppdelany