అందరికీ నమస్కారం. క్రిస్మస్ ఇంకా కొత్త సంవత్సరం వేడుకలు అమెరికాలో జరుపుకున్న తరువాత, ఇంకా సంస్థకు సంబంధించిన ఎన్నో పన్లు చేసిన తరువాత, మేము కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాము. ప్రపంచంలో ఈశా చేసే పనుల గురించి వచ్చే ఆరు నెలలలో మీకు తెలుస్తాయి. మీరు, దాని ప్రభావాన్ని చూస్తారు. నేను అమెరికా నుంచి అబూదబీ చేరుకుని, కొన్ని ముఖ్యమైన సమావేశాల కోసం అక్కడినుంచి దుబాయ్ వెళ్ళాను. ఇంకా అద్భుతమైన గోల్ఫ్ గేమ్ కూడా ఆడాను అక్కడ. ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, దుబాయ్ లేదా ఎమిరేట్స్ ను పాలిస్తున్నవాళ్లు ఎంతో వివేకవంతులయ్యారు. వాళ్ళ సంస్కృతిని సాంప్రదాయాలను గౌరవిస్తూనే వాళ్ళ దేశాన్ని విశ్వవ్యాప్తంగా ఉండేలాగా చెయ్యాలనుకుంటున్నారు. వారి సాంప్రదాయాలు ఏమైనప్పటికీ, వారి నమ్మకాలూ, వారి గుర్తింపులూ ఏవైనప్పటికీ, అక్కడకి ఇప్పుడు అందరూ ఆహ్వానితులే. ఇది ఎంతో ముందుచూపుతో చేస్తున్న పని. ఇది, ఒక దేశంగా ఎంతో వివేకం కలిగి ప్రవర్తించడం. ఇంత గొప్ప ముందుచూపుని ఇప్పుడు మీరు ఎమిరేట్స్ లో చూడొచ్చు. నేను కొందరు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశం అయ్యాను. షేక్ నాయన్ - ఈయన అతిధులను ఎంతో గొప్పగా చూసుకుంటారు. వాళ్ళు ఇదంతా ఒక పద్ధతిగా వారి దేశాన్ని ఎంతో బాగా అందరికీ అందుబాటులోకి తెచ్చి, ప్రజల అభివృద్ధికి పాటుపడటం చూస్తే, చాలా ఆనందం కలిగించింది.

ఎమిరేట్స్ నుంచి నేను ఒక రాత్రికి ముంబై చేరుకున్నాను. ఆ తరువాత సోమనాథ్ కి వెళ్ళాను. నేను ఎప్పటినుంచో ఇది చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే, సోమనాథ్ ఆలయం అసమానమైనది. దీనికి సంబంధించిన ఒక పురాణం ఉంది. అదేమిటంటే, అరేబియాలో సెటానిక్ వెర్షన్ ఈవెంట్ అయినతరువాత వాళ్ళు నమ్ముకున్న రెండు దేవతా విగ్రహాలను సోమనాథ్ కు తరలించారని చెప్తారు. వీటి గురించే, గజనీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వీటిని వినాశనం చెయ్యాలని వచ్చాడు. ఈ కారణంగానే మళ్ళీ-మళ్ళీ పదిహేడు సార్లు ఈ ఆలయాన్ని కూలదోసినప్పటికీ 1950 లో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పట్టుదల వల్ల ఇంకా అప్పటి ప్రధాని రాజేంద్రప్రసాద్ చొరవతో ఇక్కడ మళ్ళీ తిరిగి ఎంతో అద్భుతమైన ఆలయాన్ని సముద్రపు ఒడ్డున కట్టారు. ఇది ఎంతో అద్భుతమైన చోటు. సోమనాథుడు అంటే ఒక రకమైన మత్తు కలిగించేవాడు. ఇది శివుడు కలిగించే మత్తు. మన జీవితాలలో, మనం ఎన్నో పనులు చేస్తూ, మనం చేస్తున్న పనులు మన వ్యక్తిగత అవధులను దాటాలంటే.. అప్పుడు జీవితంలో ఒక రకమైన మత్తు ఉండాలి. మత్తు అంటే సాయంత్రం ఒక గ్లాసు మందు తాగడమో లేదా వారాంతాలలో తాగి పడిపోవడమో కాదు. ప్రతిక్షణం మీ జీవితంలో ఒక రకమైన మత్తు ఉండాలి. లేదంటే జీవితానికి అవసరమైన సరళత మీకు ఉండదు. మీ వ్యక్తిగత ఆశయాలు, ఇష్టాయిష్టాలకు మించి అద్భుతంగా, సమర్ధవంతంగా, ఈ ప్రపంచంలో మీరు చెయ్యగలిగినదంతా మీరు చెయ్యాలనుకుంటే, మీకు ఒక రకమైన మత్తు అవసరం. సోమనాథుడు, అంటే ఇదే. ఆయన ఇటువంటి స్థితిలోనే ఉంటూ అవధులు లేకుండా ఈ ప్రపంచంలో కావలసిన వాటిలో నిమగ్నమవ్వగలరు, కాబట్టీ సోమనాథ్ ఆలయం ప్రతివారూ దర్శించదగ్గ స్థలం. ఇది సాంప్రదాయపరంగా, చారిత్రికపరంగా ఎంతో భారతదేశానికి ప్రాముఖ్యత కలిగినది, అన్నిటికీ మించి యోగ సాంప్రదాయంలో సోమ సూత్రం ఎలా మత్తులో ఉండాలనే విషయం గురించి చెప్తుంది. మత్తు అంటే, మనం బయటినుంచి ఏదో పదార్థం తీసుకోవడం వల్ల కాదు, కానీ మిమ్మల్ని మీరు ఎంతో గొప్పగా నిర్వహించుకోవటం వల్ల వచ్చే పారవశ్యం వలన. నేను అటువంటి చోటికి వచ్చాను.

అక్కడినుంచి నేను బెంగళూరుకి దాదాపు 30 సంవత్సరాల తరువాత వచ్చాను. 30 సంవత్సరాలుగా అప్పుడప్పుడూ నేను చిన్న చిన్న ప్రయాణాలు మోటారుబైక్ పై చేస్తున్నప్పటికీ మొదటిసారిగా బెంగళూరు నుంచి ఈశా యోగా కేంద్రానికి మోటార్ బైక్ మీద వచ్చాను. మా అమ్మాయి రాధే కూడా ఎప్పుడూ నాతో అంత దూరం రాలేదు. నేను మొట్టమొదటిసారి తనతోటిగా వచ్చాను. మన మోటార్ సైకిలింగ్ మెడిటేటర్స్ కూడా నాతో పాటుగా వచ్చారు. 62 సంవత్సరాల వయస్సులో 450 కిలోమీటర్లు నడిపించాను. ఇది పర్వాలేదు.. కదూ?

నేను వచ్చిన వెంటనే ఆశ్రమంలో మాటు పొంగల్, అంటే సంక్రాంతి సంబరాలు. ఇది పశువులకోసం చేసేది. ఈ పశువులు మన జీవితంలో, ఇంకా వ్యవసాయంలో ఒక భాగం. ఈ ఆవులు, ఎద్దులూ మనకోసం పని చేస్తాయి. అవి లేకపోతే మనం భూమిలో పండించలేం. ఈ రోజున, మనకి ఎన్నో యంత్రాలు ఉన్నాయి కానీ పశువులే భూమిని సారవంతం చేస్తాయి. ఈశాలో మేము దాదాపుగా 16 రకాల దేశవాళీ ఆవులనూ, ఎద్దులనూ పెట్టాము. ఇవి, మా ఈశా కుటుంబంలో భాగం. కొన్నిటిని ఎంతో అందంగా పెయింటింగ్ కూడా వేశారు మా ఈశా బ్రహ్మచారులు. ఈ పశువుల మీద అందమైన చిత్రలేఖనం చేశారు, అవి ఎంతో ఆనందంగా ఉండడం కూడా నేను చూశాను. ఎందుకంటే, అందరి ధ్యాస వాటి మీదే ఉంది, ఆహారం కూడా పెడుతున్నారు. మా ఈశా హోమ్ స్కూల్ సంస్కృతి పిల్లలు ఎంతో అద్భుతమైన హాస్య ప్రదర్శనలూ, నృత్య ప్రదర్శనలూ ఇచ్చారు. మొత్తం మీద, మాటు పొంగల్ అద్భుతంగా జరిగింది. ఈ రోజుల్లో, ఇంత గొప్పగా ఎక్కడైనా జరుగుతుందని నేను అనుకోవడం లేదు. మేము వచ్చే వారం కోసం ఎదురుచూస్తున్నాం, అది ఇంతకంటే బిజీ గా ఉంది. అన్నిటికీ మించి విజ్జి మహాసమాధి పొంది 22 సంవత్సరాలు అయ్యింది. ఇంకా, నేను పుట్టిన తరువాత ఇది నాకు 760వ పౌర్ణమి. 21 జనవరి ఎంతో ముఖ్యమైన రోజు. ఆ రోజున అక్కడ మాతో పాటూ ఉండండి. ఈ రోజునే స్త్రీలకు “ఈశాంగ” సాధన కూడా ముగుస్తుంది. దేవి మళ్ళీ పునరుత్తేజితమయ్యే సమయాన్నె, దేవీ కాంత కాలం అని అంటాం. అంటే, ఈ రోజున ఆమె శక్తి ఎంతగానో ఉత్తేజితమై, ప్రజలమీద తను చూపించే ప్రభావాన్ని మెరుగుపరుస్తుంది. అందుకని ఆలయాన్ని గత 11 రోజులుగా మూసేసి ఉంచాము. మళ్ళీ 21వ తేదీన దీనిని తెరుస్తాము. మీరు నిజంగా దేవి విస్పోటన శక్తిని చూడాలనుకుంటే, ఈ రోజున మీరు అక్కడ ఉండాలి... లేకపోతే ఆ తరువాత వచ్చినా పర్వాలేదనుకోండి. రాబోయే సంవత్సరాల్లో దేవీ శక్తి ప్రభావం ప్రజలమీద మరింత బలంగా ఉంటుంది. ఈ 11 రోజులూ ఈ ఆలయాన్ని మూసేయడం అనేది, ఎవరైతే దేవిపై వారి హృదయాలను లగ్నం చేశారో వారికి ఎంతో అనుకూలంగా ప్రభావితం చూపిస్తుంది. అందరికీ నా ఆశీస్సులు..

ప్రేమాశిస్సులతో,

సద్గురు