Sadhguruముఖ్యంగా, కొత్త సంవత్సరం మొదట్లో తరచూ వచ్చే ప్రశ్న, చెడ్డ అలవాట్లను ఎలా వదిలించుకోవాలి అని. మంచి అలవాట్లు, చెడ్డ అలవాట్లు అంటూ ఏమీ ఉండవు - అన్ని అలవాట్లూ చెడ్డవే. అలవాటు అంటే ఎరుక లేకుండా, యాంత్రికంగా చేయడమే. ఉదాహరణకు ఉదయం పళ్ళు తోముకోవడం రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఆ రోజు, ఆ సమయానికి తగ్గట్టుగా ఎంతసేపు తోముకోవాలి, ఎంతబాగా రుద్దుకోవాలో, అలా చేసుకోవచ్చు, అసలు అలాగే చేయడం మంచిది. లేక ఏదో ఒక పద్ధతి ప్రకారం ఇంతసేపు, కనీసం మూడు నిముషాలు తోముకోవాలి అని, ఇంతసేపు పళ్ళను అరగతీయాలి అనుకుంటూ అలా కూడా చేసుకోవచ్చు.

మీరు ఎరుకతో ఉంటే ఆ రోజు మీ శరీరానికి అవసరమైనంతే తింటారు, అవసరమైనంతనే నిద్రిస్తారు. నిజానికి, ఎరుకతో ఉంటే అన్నీ అలాగే అవసరానుగుణంగా చేస్తారు. కాని ఇప్పుడు మీలో చాలామంది మీ దినచర్యలను కూడా, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఏమేమి తినాలి, ఏవి తినకూడదు అన్నీ ఒక ప్రిస్క్రిప్షన్ (పద్ధతి) ప్రకారం చేస్తున్నారు. అన్నీ అలా ప్రిస్క్రిప్షన్ (పద్ధతి) ప్రకారం చేస్తే  అది -  మీ డాక్టర్ నుంచి వచ్చినదైనా, ఒక యజమాని నుంచి వచ్చినదైనా సరే - అది బానిసత్వమే అవుతుంది. మీకు  ఏ సమయానికి  ఏమి చేయాలో తెలియకపోతే, దానికి కారణం మీకు ఎరుక లేదనే అర్ధం.

అలవాట్లను మంచివి, చెడ్డవి అనడం ఎలాంటిదంటే, మంచి ఎరుక, చెడ్డ ఎరుక అనడం లాంటిది. మీరు ఏదైనా అలవాటును మంచి అలవాటు అనుకోవడమంటే, మీరు సున్నితమైన పధ్ధతిలో ఎరుక లేకుండా ఉన్నారనే అర్ధం. అంటే ఓ సున్నితమైన విధానంలో చనిపోయారనే అర్ధం. జీవించి ఉండడానికి, చనిపోవడానికీ ఉన్న మౌలికమైన తేడా స్పృహతో ఉండడం, లేదా పూర్తిగా స్పృహ లేకపోవడమే. కొంచెం స్పృహ లేకపోవడం అంటే పాక్షికంగా  చనిపోవడమే. అందుకే ఏ విధమైన అలవాటూ చేసుకోవద్దు. ఆశ్రమాలలోకి, ఆధ్యాత్మిక ప్రదేశాలలోకి వెళ్ళడం అంటే మీరు అన్నీ ఎరుకతో చేసుకోవడానికి కావలసిన వాతావరణం ఏర్పరచుకోవడమే. మీ రోజువారీ జీవితం సాగడం కోసం మీరు అలవాట్లను చేసుకున్నారు. మీరు ఆధ్యాత్మిక ప్రదేశాలలోకి వచ్చినప్పుడు, మీరు మీ శరీరం, మనస్సు, భావాలు, మీ శక్తి పట్ల సరైన శ్రద్ధ చూపించాలి. మీ జీవితం దేనికోసం పరితపిస్తోందో దానిపై మీరు  శ్రద్ధ వహించాలి. మీకు ఎరుక లేకుండా చేస్తే అది మీకు మీరు చేసుకునే ద్రోహమే.

మీరు ఏదైనా అలవాటును మంచి అలవాటు అనుకోవడమంటే, మీరు సున్నితమైన పధ్ధతిలో ఎరుక లేకుండా ఉన్నారనే అర్ధం

మీ అలవాట్ల నుంచి బయటపడాలంటే, మీ ఎరుక ‘లేమిని’ లేకుండా చేసుకుందామనుకోవద్దు. ఆ ‘లేమి’ అనేది లేనిది, ఎరుకే ఉన్నది. ఎరుకలేమి అంటే ఎరుక లేకుండా ఉండడం. మీరు లేని దానిని పోగొట్టుకోలేరు. ఉదాహరణకు, ఈ గది చీకటిగా ఉందనుకోండి, చీకటిని బయటకు నెట్టడం అంటే పిచ్చిపనే అవుతుంది. చీకటిని పోగొట్టాలంటే, లైటు వేయడయే. లైటు వేస్తే చీకటి అదే పోతుంది. చీకటి అంటే కాంతి లేకపోవడమే. మీరు ఎరుకతో ఉంటే ఎరుక లేమితో వచ్చే అలవాట్లతో పోరాడనక్కరలేదు. అంటే మీరు మీ ఎరుక మీద శ్రద్ధ పెట్టాలి. ఎరుకతో ఉండడమే జీవిత సారం. మీరు బ్రతికే ఉన్నారని మీకు తెలియడానికి కారణం మీరు తగినంత ఎరుకతో ఉన్నారు కాబట్టే.

మీరు మరికాస్త ఎరుకతో ఉండాలంటే మీ శక్తిని మరింత తీవ్రం చేసుకోవాలి. మనం చేసే ప్రయత్నం అదే. మీ భౌతిక శరీరం ప్రోగు చేసుకున్నజడత్వం కోసం, ప్రొద్దున్నే హఠయోగా. మరి మీ మనస్సు కూడా కొన్ని అలవాట్లకు లోనైపోయింది, అందుకే ‘ఇన్నర్ ఇంజనీరింగ్’ విషయాలు, కొన్ని ధ్యాన సాధనలు. మీ శక్తి కూడా కొన్ని తమవైన అలవాట్లకు లోనైపోయింది, అందుకే సాధన. ఎరుకలేని తనాన్ని పోగొట్టి ఎరుకతో ఉండడం. మీరు ఎరుకతో ఉంటే, మొదట్లో అప్పుడప్పుడూ, మీకు తెలియని వాతావరణంలో ఉన్నట్లుగానూ, కష్టంగానూ అనిసిస్తుంది. మీరు అలవాటు ప్రకారం చేస్తుంటే తేలిగ్గా ఉంటుంది, కాని అందులో ఎరుక లేదు, పురోగతీ ఉండదు.

మీరు కోరుకునేది జైలు జీవితమే 

నేను దాదాపు 25 ఏళ్ళ క్రితం, మొదటి సారిగా కోయంబత్తూర్ జైల్ లో ప్రోగ్రాం చేసినప్పుడు, నేని ఇది గమనించాను. ఇలా జైల్లో ఉన్నట్టు  అన్నీ పద్ధతి ప్రకారం జరిగే జీవితాన్నే, తమ జీవితంలో ఎంతో మంది కోరుకుంటున్నారు అనిపించింది. ఇక్కడ మీకు తలుపులు కూడా ఎవరో వేస్తారు, తీస్తారు. మీకు లైట్లు కూడా వేస్తారు, తీస్తారు. భోజనం ఖచ్చితంగా టైమ్ కు వస్తుంది. మరి ఎక్కువ మంది కోరుకుంటున్నది అదే - అంతా పద్ధతి ప్రకారం, టైమ్ కు జరగడం. కాకపోతే జైల్లో అది వారిమీద రుద్దబడుతోంది, దానివల్లే వారు బాధకు లోనౌతున్నారు. మీరు జైల్ లోకి వెళ్ళగానే ఆ వాతావరణంలోనే అంతులేని బాధ ఉంటుంది. నేను ఏ కారాగారంలో అడుగుపెట్టినా ఒక్కసారి కూడా కళ్ళల్లో నీళ్ళు తిరక్కుండా బయటకు రాలేదు, కారణం ఆ వాతావరణంలో ఉన్న అంతులేని వేదన.

తమ జీవితం పద్ధతి ప్రకారం జరగాలనుకున్నవారికి జైలు జీవితం ఉత్తమం.

మనిషిని ఎక్కువ బాధపెట్టేది,  సుఖ సౌఖ్యలో, ఆస్తిపాస్తులో లేకపోవడం కాదు - స్వేచ్ఛ లేకపోవడం. ఉద్యోగానికి వెళ్ళడం, ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం, రోజూ మీకు ఎదురయ్యే ఇంకా ఎన్నోసమస్యలకంటే  జైలు జీవితం చాలా సులువు. ఖైదీగా మీరు ప్రభుత్వ అతిధులు. మీ జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా, పద్ధతిగా జరిగిపోవాలనుకుంటే, అవి జైలు జీవితంలానే ఉంటాయి. జీవితంలో జరిగే ప్రతి చిన్నదీ మిమ్మల్ని కలవరపాటుకు గురిచేస్తుంటే, మీకు జీవితంలో సమతుల్యం లేకుండా చేస్తుంటే, మరి జైలు జీవితమే బాగుంటుంది. అంతా పద్ధతి ప్రకారం జరుగుతుంది, ఒడిదుడుకులేమీ ఉండవు. వచ్చేవారం మీకేమి ఆహారం ఇవ్వబోతున్నారో కూడా ముందుగానే చెబుతారు, ఖచ్చితంగా అలానే పాటిస్తారు, అంతకన్నా తక్కువా పెట్టరు, ఎక్కువా పెట్టరు, అన్నీ ప్లాన్ ప్రకారమే జరిగిపోతాయి.

అన్నీ పద్ధతి ప్రకారం చేయలనుకోకండి

తమ జీవితం పద్ధతి ప్రకారం జరగాలనుకున్నవారికి జైలు జీవితం ఉత్తమం. కాని అక్కడ స్వేచ్ఛ లేక మానవులు ఎంతో బాధకు లోనౌతారు. అలాగే అలవాటు అంటే కూడా, మీకు మీరు ఒక చిన్న కారాగారం ఏర్పరచుకోవాడం లాంటిదే, మీరు ఎప్పుడో ఒకప్పుడు దానివల్ల బాధపడతారు. మొదట్లో సమర్ధవంతంగా పనిచేస్తున్నట్లే కనిపిస్తుంది. కొన్నాళ్ళ తరువాత బంధిఖానా అనిపిస్తుంది. జైలు అనేక విధాలుగా సమర్ధతకు పరాకాష్ట. కాని ఈ జీవితం ఎదురు చూసేది సమర్దత కాదు, ఈ జీవితం పాకులాడేది స్వేచ్ఛగా విస్తరించాలనే. ఆ స్వేచ్ఛను తీసివేస్తే, అంతా పద్ధతిగా నడుస్తున్నా మీ ముఖం విచారంగా తయారవుతుంది.

నాకు అమెరికాలోని ఒక ప్రముఖ మేనేజ్ మెంట్ నిపుణునితో జరిగిన సంభాషణ గుర్తుకువస్తోంది. ఆయన ఖచ్చితమైన పద్ధతులలో జరిగే మేనేజ్ మెంట్ గురించి ప్రోత్సాహకరంగా మాట్లాడేవారు. సమర్ధత పెంచేందుకు అన్నీ, అతి చిన్న విషయం దాకా సరిగా ఉండేట్లు చూసుకోవడం ముఖ్యం అంటారు. అది నాకు జైలులా అనిపించింది. మీకు మరో ఉదాహరణనివ్వడానికి, బాగా పోషణ చేస్తున్నచక్కగా ఉన్న ఉద్యానవనం, చిందరవందరగా ఉండే అరణ్యాన్ని పోలుద్దాం. బాగా చూసుకుంటున్న ఉద్యానవనాన్ని ఓ నెల రోజుల పాటు పట్టించుకోకపోతే, అది నాశనమౌతుంది. కాని అరణ్యాలు తమంత తాముగా వేలయేళ్ళనుండి నిర్వహించుకుంటున్నాయి. అంటే అరణ్యాలే ఎక్కువ సమర్ధవంతమైనవి. ఇలాగే ఇంకాస్త ముందుకు వెళ్ళి ఆలోచిస్తే ఙ్ఞానోదయం కూడా మీరు పోషణ చేయబడుతున్న ఉద్యానవనం దిశనుంచి బయటి సహాయం లేకుండా తనంత తాను రక్షించుకునే, పోషించుకునే అరణ్యంగా రూపాంతరం చెందడం. నీళ్ళూ పోయనక్కరలేదు, ఎరువూ వేయనక్కరలేదు, కత్తిరించక్కరలేదు. అంతా దానిలోనే జరుగుతుంది, ఎందుకంటే చిందరవందరలో ఉండే సమర్ధత మూలంగా అది మనగలుగుతుంది.

మనం ఒకదాన్ని చిందరవందరగా ఉన్నదని ఎందుకు అంటామంటే, అది మన తార్కిక ఆలోచనా విధానంలో ఇమడదు కాబట్టి, అంతేగాని అది సమర్ధవంతమైనది కాదని కాదు. అలవాటు అంటే మీరు మీ తార్కిక బుద్ధికి దాసులైపోయారని, కొంత కాలం తరువాత అది ఆటోమేటిక్ గా ఎరుక లేకుండానే జరిగిపోతుంది. మీ అలవాట్లు పోవాలంటే మీరు ఎరుకతో ఉండాలి. మీరు మరింత ఎరుకతో ఉంటే అలవాటు అంటూ ఏమీ ఉండదు. ఈ క్షణంలో మీకు, మీ చుట్టూవుండే వాటికి ఏది మంచిదో, అదే మీరు చేస్తారు. ఉద్దేశ్యాలు పరివర్తనను తీసుకురావు, ఎరుక మాత్రమే తీసుకు వస్తుంది.

Sadhguru New Year's Darshan

ప్రేమాశిస్సులతో,
సద్గురు