కంగనా రనావత్:కృష్ణుడూ, మహమ్మద్, రాముడు, యేసు క్రీస్తు, బుద్ధుడు - ఇలా ఈ భూమి మీదికి వచ్చిన జ్ఞానోదయం పొందిన అందరి విషయంలోనూ, వాళ్ళ జనన మరణాల గురించి కొంత సమాచారం కనిపిస్తుంది. కానీ శివుడి దగ్గరకు వచ్చేసరికి, ఆయన స్వయంభువుగా ఉద్భవించాడని నేను చదివాను. శివుడు ఒక గ్రహాంతర వాసి అని చెప్పే ఒక సిద్ధాంతం కూడా ఉంది. ఆ మాటకొస్తే, అసలు మనిషికి తటస్థపడేవన్నీ- వచ్చే ఆలోచనలూ గానీ, స్ఫురించే ఉపాయాలు గానీ, ఏవయినా సరే - వాళ్ళకు బయట ఎక్కడినుంచో, ఎవరో అందించేవేననే సిద్ధాంతం కూడా ఉంది. మనందరినీ మన లోకానికి చెందని వారెవరో నడుపుతున్నారని అనుకోవాలంటారా?

సద్గురు: మానవుల మేధాశక్తిలో నమ్మకం లేని వాళ్ళు పైకి చూస్తుంటారు, మేధాశక్తి అనేది బయట ఎక్కడి నుంచో ఊడి పడే విషయం అయినట్టు. దురదృష్టవశాత్తూ ఇప్పటి తరాల వాళ్ళు ఎన్నో అతి ముఖ్యమైన విషయాలను దాదాపు మరచిపోయారు. ఉదాహరణకు, యోగశాస్రంలో మన వెన్నెముకను 'మేరు దండం' అంటారు. అంటే, ఈ బ్రహ్మాండానికే ఇరుసు దండం (axis) అని అర్థం. ఈరోజు ఈ విశ్వం అనంతమైనదని ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా ఒప్పుకొంటున్నారు. మన సంస్కృతిలో అయితే మనం ఈ విశ్వాన్ని ఎప్పుడూ అనంతం, ఎప్పటికీ విస్తరిస్తూనే ఉంటుందని చెప్పుకొంటూ వస్తున్నాం.

అనుభూతి కేంద్రం

పై పైన చూస్తే మనిషి వెన్నెముకను బ్రహ్మాండానికే ఇరుసు దండంగా చెప్పుకోవటం హాస్యాస్పదంగా కనిపిస్తుంది. అయితే మరి అలా ఎందుకు చెప్తున్నట్టు? ఈ బ్రహ్మాండం అనేది ఒకటి ఉన్నది అని మీరు అనుకోవటానికి కారణం, మీ స్వానుభవమే. మీకు మీ స్వానుభవాలను గ్రహించగల శక్తి లేకపోతే, బ్రహ్మాండం ఒకటి ఉన్నదని కూడా మీరు తెలుసుకోలేరు. మీ స్వానుభవాలన్నిటినీ మీరు మీ వెన్నెముక ద్వారానే అందుకొంటారు. మీ వెన్నెముకలో తంత్రులన్నీ తెంచేస్తే, మీకు ఏ అనుభవమూ తెలియదు ఇంకా మీకు మీ శరీరం ఉందనే స్పృహ కూడా ఉండదు. మీ వెన్నెముకను మనం విశ్వానికే ఇరుసు దండం (axis) గా భావించటానికి కారణం అదే. ఈ బ్రహ్మాండాన్ని మీరు అనుభవం చేసుకొనేందుకు కావలసిన సామర్థ్యం మీ వెన్నెముకలోనే వేళ్ళు పాతుకొని, అక్కడే కేంద్రీకృతమై ఉంది.

ఈ సత్యం ఆధారంగానే, మనం ఒక విస్తృతమైన మార్గాన్ని ఏర్పరుచుకొన్నాం. ఇలాంటి సత్యాలను మనిషి కేవలం తను నమ్మే విశ్వాసాలు గానే కాక, తన నిత్యజీవితానుభవంగా మార్చుకొనేందుకు కూడా ఉపయోగపడే మార్గం అది. 'యోగా' - అంటే, సర్వ సృష్టితో మమేకమయ్యే ఏకత్వం (inclusiveness) సాధించటం - అన్న మాట ఇక్కడినుంచే వచ్చింది. మీరు సకలజగత్తుతోనూ అలాంటి ఏకత్వ భావం సాధించాలంటే మీరు చేయాల్సిందల్లా వ్యక్తిగా మీకున్నసరిహద్దులనూ రూపు మాపుకోవటమే.

'నువ్వు నన్ను ప్రేమించు, నేను నిన్ను ప్రేమిస్తాను', 'నువ్వు నన్ను హత్తుకో, నేను నిన్ను హత్తుకొంటాను' - ఇలాంటి వాటివల్ల ఏకత్వ భావం సాధించలేం. ఇవన్నీ కొద్దికాలం పాటు మాత్రమే పని చేస్తాయి. రేపు వాళ్ళు మీకు నచ్చని పనేదయినా చేస్తే, ఇవి అంతరించిపోతాయి. యోగా అంటే మీ స్వభావగతమైన ప్రత్యేకతలూ, మీ శరీరగతమైన ప్రత్యేకతలూ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ తుడిపి వేసుకోవటం. అప్పుడిక మీరు ఇక్కడ కూర్చొన్నారంటే, మిమ్మల్ని మీ వ్యక్తి పరమైన ప్రత్యేకతలతో మిమ్మల్ని మీరు గుర్తించే పరిస్థితి ఉండదు.

శి-వ - “లేనిదేదో అది!”

మీ శరీర వ్యవస్థకూ, మానసిక వ్యవస్థకూ, భావోద్రేకపరమైన వ్యవస్థకూ పెద్దవో, చిన్నవో సరిహద్దులు ఉండక మానవు. కానీ మీలో కొన్ని అంశాలకు సరిహద్దులు ఉండవు. సరిహద్దులు లేనివి భౌతికాతీతమైన విషయాలు. మన సంప్రదాయంలో మన దృష్టి అంతా ఈ భౌతికాతీతమైన పార్శ్వం మీదనే ఉంచుతూ వచ్చాం. అందుకే శివ అనే తత్త్వానికి అంత ప్రాధాన్యత. శి-వ అంటే "లేనిదేదో అది". ఇది పూర్తిగా భౌతికాతీతమైన పార్శ్వం.

మనం మాట్లాడుతున్న యోగి విషయం అంటారా - ఆయన మానవ లోకానికి చెందిన వాడా, లేక , మరెక్కడినుంచన్నా వచ్చిన వాడా? ఇదొక పెద్ద కథ. మేము 'ఆది యోగి' మీద ఒక పుస్తకం వేశాం. అందులో ఇలాంటి విషయాలన్నీ ఉంటాయి. కొన్ని విషయాలు ఇప్పుడు చెప్తాను వినండి. మనం మాట్లాడుకొనే శివుడికి తల్లితండ్రులంటూ లేరు. పుట్టిన చోటు అంటూ లేదు. ఆయనను పసివాడుగా ఉన్నప్పుడు చూసిన వాళ్ళు లేరు. పెరుగుతుండగా చూసిన వాళ్ళూ లేరు. ఆయన్ని మనుషులు చూసిన కాలమంతా ఆయన దాదాపు ఒకే వయసులో ఉండేవాడు. ఆయన ఎక్కడ తనువు చాలించాడో మనకు తెలియదు. ఆ రోజులలో కూడా ఆయన ప్రముఖుడైన, ప్రసిద్ధుడైన వ్యక్తే కనక, ఆ వ్యక్తి ఎక్కడ ఎప్పుడు మరణించాడో ఎవరికయినా తెలిసి ఉంటే, వాళ్ళు ఆయన కోసం ఒక స్మృతి చిహ్నమో, ఆలయమో కట్టి ఉండేవాళ్లే కదా? అలాంటిదేమీ జరగలేదు మరి.

ఎక్కడినుంచో వచ్చిన యక్ష స్వరూపుడు

జననం లేదు, మరణం లేదు, తల్లీ తండ్రీ లేరు, తోబుట్టువులు లేరు. అసలు ఆయన ఇక్కడ వాడని నిరూపించేందుకు కూడా ఆధారమంటూ ఏదీ లేదు. అంటే, ఆయన మరెక్కడినుంచో వచ్చి ఉంటాడని మనం ఊహించవచ్చా? అలా అనేందుకూ వీలు లేదు. కానీ మీరు ఆయన గురించిన కథలను వింటే, వాటిలో సాధారణంగా ఆయనను ‘యక్ష స్వరూపుడి’ గా వర్ణిస్తారు. యక్షులు అంటే మానవ జాతికి చెందిన ప్రాణులు కాదు. కానీ వాళ్ళు ఈ భూగోళం మీదే అడవులలోనూ, భూమి మీదే ఉండే కొన్ని ఇతర పర్యావరణాలలోనూ ఉండేవాళ్ళు. ఇది నిజమై ఉండచ్చుననేందుకు చాలా ఆధారాలు కనిపిస్తున్నాయి. కానీ ఆయన మరెక్కడి నుంచో వచ్చాడనేందుకు స్పష్టమైన సాక్ష్యం ఏమీ కనిపించటం లేదు.

ఆధునిక విజ్ఞానం వెనక బడి ఉంది

యోగ విద్యా సంప్రదాయంలో ఆది యోగి 60000-75000 సంవత్సరాల క్రితం మానవరూపంలో ఈ భూమి మీద నడయాడాడని చెప్తారు. నేను మొదట ఈ మాట చెప్పినప్పుడు నాతో ఉన్న నాకంటే ఎక్కువ లోకజ్ఞత కల కొంతమంది బుద్ధి శాలులు - తెలివైన వాళ్ళు, యువతరం వాళ్ళు- ఒక మాట చెప్పారు. 'సద్గురు, మీరు 75000 సంవత్సరాల విషయం ఎత్తితే, లోకులు మీ వాదనను ఖండఖండాలు చేసి పోస్తారు. ఇప్పుడున్న పురాతత్వ శాస్త్ర ఆధారాలు 12600 సంవత్సరాలకంటే వెనక్కు వెళ్లలేవు కనక ఆదియోగి 12600 సంవత్సరాల కంటే పూర్వం వాడు కాలేడు. కావాలంటే మీరు 12600, 13000, మహా అయితే 14000 సంవత్సరాల క్రితం వాడు అనండి, అంతే!' అన్నారు. 'సరే, అయితే15000 సంవత్సరాల క్రితం వాడనుకోండి!' అన్నాను నేను. ఇప్పుడయితే, ఈ దేశంలో కొన్ని భాగాలలో 30000 సంవత్సరాల క్రితమే నాగరికమైన సంస్కృతి ఉన్నదని చూపేందుకు పురాతత్వ శాస్త్రాధారాలు ఉన్నాయి.

నేను 15000 సంవత్సరాల క్రితం అని ఎందుకంటున్నానంటే, అలా అంటే పాశ్చాత్య దేశాల వారికి కూడా అది ఆమోదయోగ్యంగా ఉంటుందని. నేను 75000 సంవత్సరాలు అంటే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ లెక్కల ప్రకారం ప్రపంచ చరిత్ర అనేది ఆరంభమైందే 6000 సంవత్సరాల క్రితం. సృష్టి ఆరు రోజులలోనే, 6000 సంవత్సరాల క్రితం మాత్రమే జరిగింది అంటారు. ఎన్నో శతాబ్దాలుగా వాళ్ళు అలా చెప్తూ వచ్చారు. ఇప్పుడిప్పుడే లభ్యమౌతున్న శాస్త్రాధారాల దృష్ట్యా, వాళ్ళు ఆ అభిప్రాయాన్ని సరిదిద్దుకొంటున్నారు. మరో యాభయి సంవత్సరాలలో, ఆధునిక విజ్ఞానం, మనం వేలాది సంవత్సరాలుగా చెప్తూ వస్తున్న ఎన్నో విషయాలతో ఏకీభవించటం మనమంతా చూస్తాం.

ప్రేమాశీస్సులతో,

సద్గురు