చాలా మంది తమకై ఒక సరైన వ్యక్తి ఈ ప్రపంచంలో ఉంటారనే ఆలోచనతో ఉంటారు.  కొంతమందేమో ఇవన్నీ గ్రహచారం వల్ల నిర్ణయించ బడుతుందని భావిస్తారు. ఇంకా కొంతమంది తమ సోల్ మేట్ ను సృష్టికర్త తనే స్వయంగా ఎంపిక చేస్తారని భావిస్తారు.  ఇలాంటి భావనల వల్ల మానవ ప్రేమ ఈ స్థిరమైన భూమిపై కాకుండా ఆ స్వర్గంలో మూలాలు కలిగి వుందని చెప్పకనే చెప్తున్నారు. కానీ అందరూ మర్చిపోయేదేంటంటే ఒక ఆత్మ ఎవరితో కానీ దేనితో కానీ జతకట్టాలనుకోదు. ఒక ఆత్మకు సహచర్యం అవసరం లేదు.  మనం ఆత్మ గురించి మాట్లాడుతున్నామంటే ఒక విషయం గుర్తుంచుకోవాలి,  ఆత్మ సంపూర్ణమైనదిఅనంతమైనది.  పరిమిత అవసరాలు ఉన్నదానికే సహచరుల అవసరం ఉంటుంది. అనంతమైన దానికి భాగస్వామి అవసరమేముంది.

ప్రజలు సహచరులను ఎందుకు కోరుకుంటారు?  అది శారీరక అవసరాలకై ఉండొచ్చు, దాన్నే మనం సెక్స్ అంటాము, దీనిని చాలా అందంగా మలచుకోవచ్చు. అలాగే మానసిక అవసరాలు ఉండొచ్చు, దీనిని  మనం తోడు అంటాము, ఇది కూడా అందంగా మలచుకోవచ్చు. ఇంకా భావాలకు సంబంధించినదైతే, దానిని ప్రేమ అంటాము, ఇది అతి మధురమైన భావన అని ఐతిహాసికంగా ప్రశంసించబడినది.  శారీరక అనుకూలత, సహచర్యం మరియు ప్రేమ జీవితాన్ని తప్పకుండా అద్భుతంగా చేస్తాయి,  కానీ మీరు నిజాయితీగా ఆలోచిస్తే ఈ ప్రక్రియ మీలో ఎంత ఉద్వేగాన్ని రేకెత్తిస్తుందో మీకు తెలుసు.

ఎటువంటి పరిస్థితులు, షరతులతో మానవ సంబంధాలు నడుస్తాయో గుర్తెరగడం వివేకవంతమైన విషయం. వాస్తవానికి దగ్గరగా ఉండటం వల్ల ఉపయోగం ఏమిటంటే, ఒకవేళ మీరు పరిమితులతో కూడిన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు పరిణతితో వాటిని పరిష్కరించుకోగలరు.  కానీ చాలా మంది పరిమితులు సృష్టించుకుంటారు. వారు "సోల్ మేట్", బంధాలు "స్వర్గంలో సృష్టించబడతాయి" వంటి భావ జాలాన్ని తయారు చేసుకుంటారు.  ఇటువంటప్పుడే స్వీయవంచన ఇంకా భ్రమలో జీవించడం అనివార్యమౌతుంది.

పెళ్ళిళ్ళు స్వర్గంలో జరగవు

వివాహం చేసుకోవడంలో ఏదన్నా ఇబ్బంది ఉందా? లేదు, అస్సలు కాదు. పరమ ఉత్కృష్టమైనది వివాహమే అని అనుకోనంత వరకు, వివాహం అనేది చాలా ఆనందకరమైన అనుభూతిగా మార్చుకోవచ్చు. మీరు ఎంతో అద్భుతమైన వ్యక్తిని పెళ్ళి చేసుకున్నా సరే,మీకు మోహ భ్రమలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే అది తప్పని సరిగా తునాతునకలవుతుంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఎప్పటికీ భ్రమలో పెట్టుకోలేరు. మీరు అర్థవంతంగా, ఆనందంగా జీవించాలనుకుంటే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, వివాహం అనేది మీరు ఏర్పరుచుకున్న అరమరిక, స్వర్గలోకానికి సంబంధించింది కాదు.

 

కర్మానుబంధాలు ఒకరినొకరికి చేరువ చేయడమనే దానిలో వస్తవం లేకపోలేదు. అంతమాత్రాన ఇవన్నీ ఆదర్శవంతమైన సంబంధాలు అని అనలేం. ఈ బాంధవ్యాలన్నీ ఎంత వరకు సఫలీకృతం అవుతాయనేది మనం ఎంత పరిపక్వతతో ఎంత సున్నితంగా వాటిని అనుసంధానం చేసుకుంటామనే దానిపై ఆధారపడి ఉంటుంది.

నేను ప్రేమకు వ్యతిరేకం కాను. ప్రేమ మనిషికి ఉన్న ఒక అందమైన లక్షణం. చాలా సంస్కృతులు ప్రేమను అణచివేసాయి, మరికొందరు స్వర్గానికి ఎగుమతి చేసారు. కానీ ప్రేమ ఈ గ్రహానికి చెందింది. ఇది మనిషికి సంబంధించింది,  ఈ విషయాన్ని ఎందుకు నిరాకరించాలి.  ప్రేమించడానికి ఒక పదార్ధం అవసరంలేదు.  అది ఒక లక్షణం. మీరు ప్రేమించే వ్యక్తి మీకు భౌతికంగా అందుబాటులో లేకపోయినా మీరు వారిని ప్రేమించగలరు. మీరు ప్రేమించే వ్యక్తి అసలు ఉనికిలో లేకుండా పోయినప్పటికీ మీరు వారిని ప్రేమస్తూనే ఉంటారు.  దీనర్థం మీ చుట్టూ ఉన్న వారిని మీ అంతరంగంలోని ఈ లక్షణాన్ని వ్యక్తపరిచేందుకు ప్రేరణగా తీసుకుంటున్నారు.  మీ వివేచనా బుద్ధికి ఒక సుస్పష్టమైన అవగాహన తెచ్చుకోగలిగినట్లయితే ప్రేమ ఒక్కటే మీ మార్గం అవుతుంది. ప్రేమ అనేది మీరు చేసే పని కాదు.  అదే మీరు.

ప్రేమ అంటే జీవం తనని తాను కోరుకుంటోందని. ఈ కోరిక సర్వంతో మమేకమై అనంతమవ్వాలని.  ఎప్పుడైతే ప్రేమ సర్వంతో మమేకమౌతుందో అప్పుడే అనంతమౌతుంది.  అప్పుడే మీరు అసలు సత్యం తెలుసుకుంటారు:  ఆత్మకు సహచర్యం ఎప్పుడు అవసరం లేదని. ఆత్మకు ఎప్పుడూ సహచర్యం లేదు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు