ప్రశ్న:గంజాయి జ్ఞాన సాధనకు మార్గమా? శివుడు కూడా గంజాయి పీల్చేవాడని చెప్పుకొంటూ ఉంటారు కదా?

సద్గురు:మీరు నా కళ్ళు జాగ్రత్తగా పరిశీలించండి. నేను ఎప్పుడూ మత్తులోనే ఉన్నట్టు మీకు అనిపిస్తుంది. హిమాలయాలలోనూ ఇతర ప్రదేశాలలోనూ కొంత మంది నన్ను వాళ్ళతో పాటు గంజాయి పీల్చేందుకు రమ్మని ఆహ్వానించటం ఎన్నో సార్లు జరిగింది. నన్ను చూసి వాళ్ళు నాకు ఆ అలవాటు ఉందనుకొనేవాళ్ళు. నేను ఏ పదార్థాన్ని ఎప్పుడు ముట్టుకోలేదు. మీరు కొంతకాలం పాటు నాతో నేను చెప్పిన పద్ధతిలో ఉండగలిగితే, నేను మిమ్మల్ని కూడా అలాంటి మత్తులోకి తీసుకెళ్లగలను. అలాంటి మత్తు కలిగించే ద్రవ్యమేదో అది బయట లేదు, మన లోపలే ఉంది. మీరు స్వయంగా ఆరంభమయ్యే 'సెల్ఫ్ స్టార్ట్' పద్ధతిలో ఉన్నారా లేక నెట్టినప్పుడు ఆరంభమయ్యే 'పుష్ స్టార్ట్' పద్ధతిలో ఉన్నారా అన్నదే ప్రశ్న, అంతే!

మనం ఏ రసాయనిక పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశపెట్టుకొన్నా అవి మన లోపల ఉండే ఒకానొక అనుభవానికి ప్రేరణనివ్వగలవు. ఆ ప్రేరణను కూడా మీరు మీలోపలి నించే ఇచ్చుకోగలిగితే, అప్పుడిక మీరు హాయిగా కూర్చోవచ్చు. బయటినుంచి ఏ ఉత్ప్రేరక పదార్థాన్ని పుచ్చుకోనక్కర్లేదు!

శివుడికి చాలా పేర్లున్నాయి. వాటన్నిటిలో ఒక ముఖ్యమైన పేరు 'సోము'డని. 'సోమ' అన్న మాటకు అర్థమే మత్తు అని. శివుడికి బాహ్యమైన రసాయనిక మాదక ద్రవ్యాలు సేవించవలసినంత మనో దౌర్బల్యం ఏమీ లేదు. ఆయన మత్తులో ఉండే మాట వాస్తవం. అందులో సందేహం లేదు. కానీ ఆయన మాదక ద్రవ్యాలేవీ వాడడు. స్వయంగా ఆయనే ఒక మాదకద్రవ్యం!

మీరు మత్తులో లేకపోతే, మీకు అసలైన ముక్తి అనే సర్వోత్కృష్టమైన శూన్యతలోకి దూకేటంత వెర్రితనం కలగదు. బాగా మత్తులో ఉన్న వారే ఈ శరీరానికీ, ఈ మనసుకూ ఉన్న పరిమితులు పట్టించుకోవటం మానేయగలరు. సోముడు లేక సోమసుందరుడు అనేవి శివుడికున్న పేర్లలో ముఖ్యమైనవి. ఎప్పుడూ మత్తులో ఉన్నా ఎప్పుడూ సతర్కంగా, చైతన్యవంతంగా, చురుకుగా ఉండే వాడు అని. ఆయన మత్తుకు కారణం గంజాయి లాంటి అత్యల్పమైన మాదక ద్రవ్యం కాదు. ఆయన శక్తి ఎప్పుడూ శిఖరాగ్ర స్థాయిలోనే ఉంటుంది. జీవశక్తి విస్తృతికి అది పరాకాష్ట. తీక్ష్ణతలోనూ, సామర్థ్యంలోనూ, మత్తులోనూ శివుడిది ఎప్పుడూ సర్వోన్నత స్థానమే.

ఒకసారి ఇలా జరిగింది. ఆది శంకరులు అలా నడిచి వెళ్తున్నారు. ఆయన నడక చాలా వేగం కదా! ఆయన ముప్ఫయి రెండు సంవత్సరాల వయసుకే తనువు చాలించారు. కానీ పన్నెండు-ముప్ఫయి రెండు సంవత్సరాల వయసు మధ్యన, ఇరవై సంవత్సరాల సమయంలో ఆయన యావద్భారతదేశంలోనూ - పడమటి నుంచి తూర్పు దాకా, ఉత్తరం నుంచి దక్షిణ సముద్రం దాకా అనేక పర్యాయాలు పర్యటించారు. కేరళ నుంచి బద్రీనాథ్ దాకా వెళ్ళి అక్కడినుంచి మళ్ళీ తిరిగి వచ్చారు. దేశం అన్నీ మూలలకూ వెళ్ళి వచ్చారు. అంత కొద్ది కాలంలో అంత దూరం ప్రయాణం చేశారంటే ఆయనకు ఎంతో వేగంగా నడిచే అలవాటు ఉండి ఉండాలి. పైగా ఆ స్వల్ప జీవిత కాలంలోనే ఆయన ఎన్నో గ్రంథాలు కూడా రచించారు.

సరే, ఆయన ఒక రోజు వేగంగా నడుస్తూ వెళుతున్నారు. ఆయన వెనక ఆయన శిష్యులు అంతే వేగంగా అనుసరిస్తున్నారు. ఆయన ఒక గ్రామానికి చేరారు. ఆ ఊరి బయట, కొందరు గ్రామస్తులు కల్లు తాగుతూ కనిపించారు. అదేదో నాటు కల్లే అయి ఉండాలి. నాటుసారానో, తాటి కల్లో - అలాంటిది. ఆరోజుల్లో, పాతిక ముప్ఫయి సంవత్సరాల క్రితం దాకా కూడా - భారత దేశంలో కల్లు దుకాణాలు ఎప్పుడూ ఊరి బయటే ఉండేవి. వాటిని ఎప్పుడూ ఊరి మధ్యలోకి రానిచ్చే వారు కాదు. ఇప్పుడైతే మద్యం ఊరి మధ్యలో కూడా అమ్ముతున్నారు. మీ ఇంటిపక్కనా, మీ పిల్లల స్కూలు ముందూ కూడా మద్యం దొరుకుతుంది. ఆ రోజుల్లో ఊరి బయటే అమ్మే వాళ్ళు.

ఆది శంకరులు ఈ మత్తులో తూగుతున్న గ్రామీణులను చూశారు. కల్లు తాగేవాళ్లు ఎప్పుడూ తామేదో గొప్ప ఆనంద స్థితిలో ఉన్నామనీ, మిగిలిన వాళ్ళెవరికీ అంత మహదానందం లభించటం లేదనీ భావిస్తూ ఉంటారు కదా! వాళ్ళు ఆయనను చూసి ఏదో వాగారు. మాట మాట్లాడకుండా ఆది శంకరులు ఆ దుకాణం లోకి ప్రవేశించి, ఒక ముంతెడు కల్లు తాగి బయటకు నడిచారు.

ఆయన వెనక ఆయన శిష్యులు అనుసరిస్తున్నారు. జరిగింది చూసి వాళ్ళలో వాళ్ళు ఒక చర్చ మొదలెట్టారు. 'మన గురువు గారే కల్లు తాగినప్పుడు మనమెందుకు తాగకూడదు?' అని. ఇదంతా ఆది శంకరులు గమనిస్తూనే ఉన్నారు. గురు శిష్య బృందం తరవాతి గ్రామం చేరారు. అక్కడ ఒక కమ్మరి పని చేసుకొంటున్నాడు. ఆది శంకరులు ఆ ఇంట్లోకి వెళ్లారు. అక్కడ ఒక పాత్రలో కరిగించిన ఇనుము ద్రవ రూపంలో ఉంది. ఆయన పాత్రను ఎత్తి, ఆ ద్రవాన్ని గటగటా తాగేసి, నడుచుకొంటూ ముందుకు సాగారు. ఇప్పుడిక, ఆయనను ఎవ్వరూ అనుసరించ లేరు కదా? కనక, శివుడు గంజాయి తాగేవాడని మీరనుకొంటూ ఉన్నా, మీరు మాత్రం ఆయనను అనుసరించటానికి ప్రయత్నిచకండి!

నావరకూ నాకు, స్పష్టమైన రీతిలో జీవించటమే ముఖ్య విషయం. గంజాయి మత్తులో తూగటం జీవితం కాదు. జబ్బు పడినప్పుడో, చావు బతుకుల్లో ఉన్నప్పుడో బుద్ధి సరిగా పనిచేయక మసకబారి, మొద్దుబారచ్చు. కానీ, సజీవంగా ఉన్నంత సేపూ చురుకైన స్పష్టతే చాలా ముఖ్యం. అలాంటి చురుకైన, స్పష్టత ఉంటే, అసలు అదే ఒక పెద్ద మత్తు. కొండ కొనల మీది నుంచి దూకటం, ఎగురుతున్న విమానంలో నుంచి కిందికి గెంతటం లాంటి అతి ప్రమాదకరమైన పనులు చేసే వాళ్ళని మీరు చూసే ఉంటారు. అవన్నీ వాళ్ళు చేయగలగటానికి కారణం వాళ్ళలో ఉండే విశేష అప్రమత్తత (super- alertness), అత్యంత జాగరూకత. ఈ అత్యంత జాగరూకత కూడా ఒక రకమైన మత్తే!

బాహ్యప్రపంచంతో రకరకాలైన సాము గరిడీలు చేసి ఈ సాహసికులు తమ శరీరాలలో స్రవించే ఎడ్రినలిన్ రసాయనం స్థాయి పెంచుకొంటున్నారు. కానీ, మీరు ఇక్కడ పూర్తి సజీవంగా కూర్చొని, అత్యంత జాగరూకతతో ఇంకా చైతన్యవంతమైన మత్తులో మునిగిపోగలిగితే, అప్పుడు మీలోనూ శివుడి అంశ చేరిందనే నేనంటాను. మీరు మీ పాటికి అత్యంత జాగరూకతతో ఊరికే ఇక్కడ కూర్చోగలిగితే, అదే మీకు కలగవలసిన మత్తు. గంజాయి పీలిస్తే వచ్చే మత్తు మత్తు కాదు. గంజాయి మొక్కలను ఆవులకు వదిలేయండి. మనుషులు చేయటానికి అంతకంటే ఉత్తమమైన పనులు చాలా ఉన్నాయి.

మత్తు పదార్థాలూ, మాదక ద్రవ్యాలు ఏవి పుచ్చుకొన్నా- మద్యం గానీ, గంజాయిగానీ మరేదైనా కానీ- అది ఒక రకంగా మానవ శక్తి సామర్థ్యాలను తగ్గించసుకోవటం అవుతుంది. ఒక మనిషిగా మీకున్న శక్తిని అవి మరింత పెంచగలిగినవైతే, మనుషులందరూ వాటిని సేవించాలి అని నేనే సలహా ఇచ్చేవాడిని. కానీ ఆ మాదక ద్రవ్యాలు మీ శక్తిని పెంచవు. ఈ విషయంలో శాస్త్రీయ పరిశోధనలు ఉన్నాయి. మీరు వరసగా రెండు మూడు నెలలు మాదక ద్రవ్యాలు పీలిస్తే, మీ మేధాశక్తి ఎనిమిది పాయింట్లు పడిపోతుంది అని ఇవి నిరూపిస్తున్నాయి. పైగా ఈ నష్టం తాత్కాలికం కాదు, దాన్ని పూర్తిగా తిరిగి సంపాదించుకోవటం అసాధ్యం.

అసలు దీనికి ప్రత్యేక పరిశోధనలు కూడా అక్కర్లేదు. గంజాయి పీల్చే అలవాటున్న వాళ్ళని, మీరు ఊరికే గమనించినా మీకు తెలుస్తుంది. ఆ మత్తులో ఉన్నప్పుడు ప్రశాంతంగానే ఉంటారు. కానీ రెండు రోజులపాటు వాళ్ళకు పడవలసిన మోతాదు పడకపోతే, పిచ్చెక్కిన వాళ్లలాగా ప్రవర్తిస్తారు. బుర్ర మొద్దు బారిన స్థితిలో మీరు ప్రశాంతంగా ఉండచ్చు. కానీ ఆ ప్రశాంతి వల్ల ఏమీ ఉపయోగం లేదు. బాహ్యమైన మాదక ద్రవ్యాలు మీరు సేవిస్తే, మీరు కుంచించుకు పోతారు. ఆంతరికమైన మాదక ద్రవ్యాలు మీకు ఎదుగుదలనిస్తాయి. ఈ రెండిటికీ పెద్ద వ్యత్యాసం అక్కడ!

ఇప్పుడు అమెరికాలో చాలా రాష్ట్రాలలో గంజాయి వాడకం న్యాయ సమ్మతమే, నేరం కాదు. ఎన్నో పెద్ద కంపెనీలు ఎన్నో రకాల గంజాయి ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చాయి. 2018 లో అమెరికాలో అమ్ముడైన గంజాయి ఉత్పత్తుల విలువ 10 బిలియన్ డాలర్లు (రూ. 70000 కోట్లు!

కొన్ని కోట్ల సంవత్సరాల క్రమ పరిణామం తరవాత, మనిషి మేధాశక్తి ప్రస్తుతం ఉన్న స్థాయిని చేరగలిగింది. కానీ మీకు ఈ శక్తిని ఎలా వినియోగించుకోవాలో తెలియటం లేదు. గంజాయి కొట్టేసి మెదడు మొద్దుబార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నిశ్చయంగా ఇది తిరోగమనం. వెనకడుగు. ఇందులో ఎలాంటి ఆధ్యాత్మికతా లేదు.

ఇలాగే దక్షిణ అమెరికాలో 'అయాహవస్కా' అనే మరొక మాదక ద్రవ్యం వాడేవాళ్లు, దానికేదో ఆధ్యాత్మిక శక్తి ఉన్నదని. దాన్ని పుచ్చుకొంటే, మీరు అంతకుముందు తీసుకున్న ఆహారం అంతా వాంతి చేసేసుకొంటారు. అదే ఆధ్యాత్మికత అని మీరు అనుకొనేట్టయితే, మీ ఇష్టం. మీకు మా శుభాకాంక్షలు!

మా చిన్నతనంలో ఒక విరేచనాల మందు వచ్చేది. దాని పేరు 'కుంతి కుమారి బేది తైలం'. మామూలు ఆముదంలో 'జపలం' అనే పొడి కలిపి చేసేవాళ్ళు. ఎవరైనా అతితెలివి చూపిస్తూ, వెర్రి వేషాలు వేస్తుంటే, 'వీడికి కుంతి కుమారి బేది తైలం ఇవ్వాల్సిందే!' అనే వాళ్ళు. 'అడ్డమైన గడ్డీ తినేసరికి అది వీడి నెత్తికెక్కింది, మంచి విరేచనాల మందు ఇస్తే కానీ అదంతా తుడిచి పెట్టుకు పోదు. అంతకు మించీ ఏమీ లేదు' అని వాళ్ళ భావం అన్న మాట. ఏదో చెత్త మీ బుర్రలో ప్రవేశించింది, మాదక ద్రవ్యాలు పీల్చి అది పోగొట్టుకొందామని మీరు అనుకొంటున్నారు. తప్పు! మీకు కావలసింది 'కుంతీకుమారి బేది తైలం"!

ప్రేమాశిస్సులతో,

సద్గురు