సద్గురు: నా పసితనం నుండీ, నా మనసులో ఒక కొండ శిఖర చిత్రం  ఎప్పుడూ ఉండేది. కళ్ళు మూసినా తెరిచినా అదే కనిపిస్తూ ఉండేది. పదహారేళ్ళ వరకూ నేను అందరి కళ్ళలోనూ అలాగే శిఖరం కనిపిస్తుంది అనుకునేవాణ్ణి. ఆ వయసులోనే మొదటి సారిగా నేను నా స్నేహితులతో ఈ విషయం చెప్పాను. అందరూ నాకు పిచ్చి అనుకున్నారు. అప్పుడే నేను నా కళ్ళలో నాకు కనిపించే ఆ శిఖరం గురించి వెతకటం మొదలు పెట్టాను.

నాకు పర్వతాలంటే ఇష్టం కాదు. నేను వాటి బానిసని. అవి లేకుండా నేను జీవించటం అసాధ్యం.

పడమర కనుమల్లో ఉన్న కర్ణాటక, కేరళల్లో నేను నెలల తరబడి ట్రెక్కింగులు చేశాను. ఆ తరవాత నేను కార్వార్ నించీ కన్యాకుమారి దాకా పదకొండు సార్లు నా మోటర్ సైకిల్ పై ప్రయాణం చేస్తూ కనిపించిన శిఖరాలాన్నీ చూశాను. నా కళ్ళలోనే చూసిన శిఖరం ఎక్కడా కనిపించక, పందొమ్మిదేళ్ళ వయసులో హిమాలయాలకి రావటం మొదలుపెట్టాను. నేను ఈ పర్వతాలను చూసిన వెంటనే నేను వెతుకున్నది ఇవి కాదని తెలిసింది. ఎందుకంటే నాకు కనిపించే పర్వతాలు పూర్తిగా వేరే రకమైనవి.

ఆ తరవాత ఎన్నో సంవత్సరాలకు గానీ నాకు దక్షిణ భారతదేశంలో ఉన్న ఆ పర్వతం కనిపించలేదు. ఇవాళ అక్కడే ఈశాయోగా కేంద్రం ఉంది. కాబట్టీ, నాకు పర్వతాలంటే ఇష్టం కాదు. నేను వాటి బానిసని. అవి లేకుండా నేను జీవించటం అసాధ్యం.

రస్కిన్ బాండ్: ఐతే మనిద్దరం కొండలకి బానిసలమే. నేను వాటి నించి దూరంగా వెళితే, ఒక వారం దాటే లోపే అవి నన్ను తిరిగి పిలుస్తూ ఉంటాయ్. నాకు తిరిగి వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఎందుకంటే పర్వతాలపై ప్రేమ రక్తంలో ఉంటుంది అది ఎప్పటికీ పోదు. 

Sadhguru with Ruskin Bond at the Dehradun Literature Festival

 

నా ఇంట్లో ఉన్న మునిమనవలకి, నాకంటే ఎంతో ముందే సద్గురు అంటే ఎవరో తెలుసు. వాళ్ళిద్దరికీ అంతగా ఆధ్యాత్మిక చింతన లేదు. మరి వాళ్ళు ఎందుకు మీ వైపు ఆకర్షితులయ్యారు? ఇది నేను వాళ్ళని అడిగితే వాళ్ళు అన్న మాట, “ఆయన మోటర్ సైకిల్ భలే నడుపుతారు” అని. కాబట్టీ, మీరు మీ మోటర్ సైకిల్ రోజుల గురించి కాస్త చెప్పండి. 

సద్గురు: కొంతకాలం క్రితం నాతో ఎవరో అన్నారు, జెక్ మోటర్ సైకిల్ “జావా” మళ్ళీ మన దేశంలోకి రాబోతోందని. ఒకానొక కాలంలో నేను ఆ “జావా” ని ఎవ్వరూ వాడనంత ఎక్కువగా వాడాను. ప్రతి సంవత్సరం కనీసం 55 నించీ 60 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేవాడిని. దాదాపుగా ఏడేళ్ళ పాటు నేను మోటర్ సైకిల్ మీదే బ్రతికాను. 

ఇక్కడా అక్కడా అంటూ ఒక నివాసం లేకుండా భారతదేశమంతా కలియదిరిగాను. నాకు ఆ కొండలు, వాటి పల్లాలంటే చాలా ఇష్టం. నా వరకూ నాకు - నా ఆలోచనల్లో అన్నీ చిత్రాల్లోనే నడుస్తాయ్, నా ఆలోచనల్లో మాటలు ఉండవు. నాలో అంత నాటుదనం ఉంది. అందుకే నాకు ఆ ప్రకృతి, అందులో ప్రతీ అణువు చూడటం చాలా ఇష్టం. 

కొన్నేళ్ళ క్రితం, నేను హిమాలయాలలోని ఈ ప్రాంతానికి వచ్చాను. అప్పుడు నేను డ్రైవ్ చేస్తూ వెళ్ళాను. నాకు ఎవరో అతి వేగంతో నడవగలిగే ఒక కారు ఇచ్చారు. దానితో నేను 150 నించీ 160 కిలోమీటర్ల దూకుడుతో కారు నడుపుతున్నాను. అక్కడ నాతో ఉన్నవాళ్లు, “సద్గురు, మీరు చనిపోతారు జాగ్రత్త” అని అన్నారు. అప్పుడు నేను వాళ్ళతో, “ఈ దారుల్లో ఉన్న ప్రతి మలుపూ నా మనసులో ముద్ర వేసుకుని ఉంది. నేను కళ్ళుమూసుకుని బండి నడపగలను” అని అన్నాను. 

ఈ ప్రయాణాలు నా జీవితంలో ఎంతో అమూల్యమైనవి ఎందుకంటే నేను గమ్యం, ఉద్దేశం లేకుండా ఆ ప్రయాణాలు చేశాను. నేను చదివినవన్నీ కూడా ఒక ప్రయోజనం అంటూ పెట్టుకోకుండా చదివాను. నేను చదువుకునే రోజుల్లో నా టెక్స్ట్ పుస్తకాలు అమ్మి నవలలు కొనుక్కు చదివేవాడిని. అందుకే పరీక్షల సమయానికి నాకు ఎప్పుడూ చదవటానికి పుస్తకాలు ఉండేవి కావు. ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నప్పుడు నేను ఈ మాటలు చెప్పటం తప్పనుకోండి! 

Ruskin Bond in conversation with Sadhguru at Dehradun Literature Festival

రస్కిన్ బాండ్: నేను ఎదుగుతున్నప్పుడు డెహ్రాడూన్ లో సైకిల్ యుగం నడుస్తోంది. ప్రతి కుర్రాడి దగ్గర, యువకుడి దగ్గర ఒక సైకిల్ ఉండేది. అప్పుడు కార్లు చాలా తక్కువగా కనిపించేవి. మోటర్ సైకిళ్ళు కూడా తక్కువే. మేమంతా సైకిళ్ళు నడిపే వాళ్ళం. నడుపుతున్నప్పుడు నేను ఎక్కువగా పడిపోతూ ఉండేవాడిని. దాంతో నేను నడక మొదలెట్టాను. ఊరంతా నడిచే వాడిని. దాంతో నాకు ఊళ్ళో ప్రతి సందూ గొందూ తెలిసిపోయింది. అందరూ నన్ను “రోడ్ ఇనస్పెక్టర్” అని పిలిచేవారు కూడా. అవి పూర్తిగా సైకిల్ రోజులు. 

ఇప్పుడు సైకిళ్ళు అసలు కనిపించట్లేదు. ఇప్పటి పిల్లలు సాంకేతిక యుగంలో ఎదుగుతున్నారు. ఎన్నో రకాల ఆకర్షణలు వారికి. వాళ్ళు అసలు ఇప్పుడు పుస్తకాలు చదవరు అని అందరూ అంటారు. కానీ, ఇప్పటికీ నాకు ఎందరో పుస్తకాలు చదివేవాళ్ళు, రాసేవాళ్ళు కనిపిస్తూనే ఉన్నారు. 

సద్గురు: సాంకేతిక పరిజ్ఞానం చెడ్డది కాదు. దురదృష్టవశాత్తూ, అది మన జీవితాలని పాడుచేస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు ప్రజలు. సాంకేతిక పరిజ్ఞానం ఒక్కటే కాదు, దేన్నైనా సరే బాధ్యత లేకుండా వాడితే అది మన జీవితాలను పాడు చేస్తుంది. మీ చిన్నతనంలో, నా చిన్నతనంలో పిల్లలుగా మనం శారీరికంగా ఎంతో క్రియాశీలంగా ఉండేవాళ్ళం. ఎంత కావాలంటే అంత తిన్నా కూడా మనం ఎప్పుడూ సన్నగానే ఉండేవాళ్ళం. ఎదిగే పిల్ల కానీ పిల్లాడు కానీ లావయ్యే సమస్యే ఉండేది కాదు. ఎందుకంటే అంత శారీరిక క్రియ ఉండేది వారి జీవితంలో. 

ఇప్పటి పిల్లల జీవితాల్లో, నాకు ఏం అనిపిస్తుందంటే, వారి ఎదుగుదలలో మాయమైన ఆ లంకె ఏమిటంటే, వాళ్ళ జీవితాలకి చుట్టుపక్కలున్న వేరే జీవితాలతో ఏ సంబంధం లేకుండా ఉంది. ఈ ప్రకృతి, జంతువులు, కీటకాలు, లాంటి ఇతర జీవాలతో వారికి ఏ సంబంధం లేదు. ఎప్పుడూ తన గురించి తాను ఆలోచిస్తూ జీవించే జీవితం మనిషికి మంచిది కాదు. 

దురదృష్టవశాత్తూ మత ప్రవచనాల ద్వారా ప్రజల బుర్రల్లో, ‘మనిషి  దైవం యొక్క అంశ అనీ, మిగిలిన జీవాలన్నీ మన సేవకే పుట్టాయనే’ ఉద్దేశాలను పుట్టించారు. మనుషుల బుర్రల్లో తిష్ఠ వేసుకున్న అతి భయంకరమైన ఆలోచన ఇది.

నేను అడవుల్లో ఎంతో సమయం గడిపాను. కొన్ని సార్లు వారాల తరబడి ఎవరి సాయం లేకుండా ఉండేవాడిని. ప్రతి జీవికీ అంటే - చీమలు, పురుగులు, జంతువులు, పక్షులు లాంటి జీవాలకి వాటి సొంత జీవితం అంటూ ఉంటుంది. అవి మన గురించి ఏమనుకుంటాయో నాకు తెలీదు మరి. 

రస్కిన్ బాండ్: బహుశా ఇప్పటి పిల్లలకి మనకి దొరికినంత మైదానాలు, ఖాళీ స్థలాలు దొరకటం లేదేమో!

సద్గురు: ఇతర జీవాల గురించిన జ్ఞానం లేదు, వాటితో సంబంధం లేదు. ప్రకృతితో సంబంధం లేదు. ఉన్నదంతా పై పై సంబంధాలే. స్కూళ్ళు, పిల్లలకి ప్రకృతితో సంబంధాన్ని అలవర్చాలి. ఇది ప్రకృతి గురించిన చైతన్యం కాదు. మానవ జీవితాలు పరిణామం చెందాలంటే, ఇతర జీవాలకు కూడా ఈ భూమి మీద జీవించే హక్కు ఉందని మనం గ్రహించాలి. అవి మనకంటే ముందు నించీ ఇక్కడ జీవిస్తున్నాయి. 

ప్రేమాశిస్సులతో,
సద్గురు