ఒక వ్యక్తి ఆధ్యాత్మిక పథంలో ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నో కొత్త విషయాలు ఎదురవుతాయి. అయినా దారి తప్పకుండా, మనం ఏకైక దృష్టితో ముందుకుసాగే వివేకం కలిగి ఉండాలని సద్గురు మనకు చెప్తున్నారు.

Sadhguruమీరు మీ శరీరం, మనస్సు అనుకునేవి ఒక విధంగా స్మృతుల సమీకరణలు. వీటిని స్మృతి లేదా మీరు సమాచారం అనవచ్చు, వీటి కారణంగానే - ఈ శరీరం ఈ రూపాన్ని తీసుకుంది. ఒకవేళ స్మృతి మరో విధంగా ఉండిఉంటే, అందులో ఇప్పటి కంటే భిన్నమైన సమాచారం ఉండి ఉంటే, మీరు సాధారణంగా తినే ఈ ఆహారంమే  ఒక కుక్కగానో, ఆవుగానో, మేకగానో, మరొకటిగానో    పరిణామం చెందుతుంది. ఆ స్మృతి కారణంగానే ప్రతిదీ తన పాత్రను ఆ పద్ధతిలోనే పోషిస్తుంది - అది గుర్తు పెట్టుకుంటుంది. మీరు స్త్రీ అనో, పురుషుడనో మీరు మరచిపోవచ్చు కాని మీ శరీరం గుర్తు పెట్టుకుంటుంది. అదే విధంగా మీ మేధస్సు కూడా. మీరెన్నో విషయాలు మరచిపోవచ్చు. మీ మెదడు వాటిని గుర్తు పెట్టుకొని తదనుగుణంగా పని చేస్తుంది.

మీకున్న వాటిని కలిపీ, తీసివేసీ, అటూ ఇటూ మార్చీ కూడా పాతవాటికి కొత్త రంగు వేయగలరేమోకాని కొత్తదేమీ జరగదు.

ఈ రెండిటినీ అధిగమించి ఉండడమంటే స్మృతి నుండి దూరంగా ఉండడమే, అంటే గతానికి దూరంగా ఉండడం. మీరు కోరుకున్నంతగా గతంలో మునిగి తేలవచ్చు, కాని దానివల్ల కొత్తదేమీ జరగదు. మీకున్న వాటిని కలిపీ, తీసివేసీ, అటూ ఇటూ మార్చీ కూడా పాతవాటికి కొత్త రంగు వేయగలరేమోకాని కొత్తదేమీ జరగదు. మీకూ, మీ శరీరానికీ మధ్య ఒక దూరాన్ని సృష్టించడం గురించి మనం మాట్లాడుతున్నామంటే మీరు, మీ గతానికి బానిసగా ఉండని స్థితి గురించి మాట్లాడుతున్నా మన్నమాట - అంటే ఏదో కొత్త విషయం సంభవించవచ్చు. ఆ కొత్త సంగతి ఏమిటి?  దానివైపు ఇలా చూడండి! ఈ సృష్టిలో ఎంత భాగాన్ని మీ స్మృతిలో నిక్షిప్తం చేశారు? చాలా స్వల్పం, కదా? అందువల్ల ఏ కొత్త విషయాలు జరుగుతాయో ఎవరూ చెప్పలేరు. ఎన్నయినా జరగవచ్చు. మనం దాన్ని ఏ వైపునుండి చేరుతున్నామన్న దాని మీద, అది ఆధారపడి ఉంటుంది.

మనం కొన్ని పార్శ్వాలను చేరుకున్నప్పుడు మనకు కొన్ని సంగతులు జరుగుతాయి. అందుకే గురువు ఎప్పుడూ, శిష్యులు ఈ కొత్త విషయాల మాయలో పడిపోకుండా ప్రయత్నిస్తుంటాడు. మీరు ఎదో ఒక అనుభూతి కావాలని కోరుకోవద్దని నేను మరీమరీ చెప్తుంటాను. ఎందుకంటే మీరొక అనుభవాన్ని కోరుకున్నప్పుడు, కొన్ని విషయాలు జరగవచ్చు. అవి కొత్తవికావచ్చు, చాలా ఆసక్తికరమైనవి కావచ్చు, వింతగొల్పేవి కావచ్చు, కాని మీరు అందులో శాశ్వతంగా  చిక్కుబడిపోతారు.

మీరు మీతోటలో అటూ ఇటూ పరికిస్తున్నారనుకోండి. ఒక గడ్డిపరక మీద చిన్న పురుగు కనిపించిందనుకోండి. మీరు బాల్యంలో ఉన్నప్పుడు విశ్వంలోనే మీకదొక అద్భుతంగా గోచరిస్తుంది. కాని ఇప్పుడో, మీరు దానివైపు ఒక్కక్షణం కూడా చూడాలనుకోరు. ఇప్పుడు పురుగంటే మీకు పెద్ద విషయమేమీ కాదు. మీ అనుభవంలో అప్పటి వరకు లేనిది, విస్మయం కలిగించేది - అది మీ అనుభవంలోకి  వచ్చినప్పుడు, కాసేపు మీలో ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. కాని తర్వాత అది మిగితావాటిలానే అనిపిస్తుంది. ఈ విధమైనవి, ఈ విశ్వంలో మీకెన్నో కనిపించవచ్చు. మొదట్లో అవి మీలో కుతూహలాన్ని రేకెత్తించవచ్చు, కాసేపవి మిమల్ని విస్మయ పరుస్తాయి, ఆ తర్వాత అన్నీ ఒకటే - మరో పురుగు లాంటివే.

మోక్షమంటే కొత్త ప్రపంచాన్ని కోరుకోవడం కాని, స్వర్గానికి చేరడంకాని కాదు.

మనిషి బుద్ధికి ఉండే కుతూహలం, సహజంగానే కొన్ని వస్తువులపట్ల ఆసక్తి కలిగిస్తుంది. కాని ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే దాన్నుండి ఉపసంహరించుకొని, నడుస్తున్న మార్గం వదలకుండా, ఒక అనుభవాన్ని కోరకుండా, ఉద్వేగాన్ని కోరకుండా, కొత్త ప్రపంచాలను కోరకుండా ఉండే వివేకం కలిగి ఉండడం. కొత్త ప్రపంచాలు ఉచ్చులు. మీరు మరో కొత్త ప్రపంచాన్ని కోరుకోవడానికి ఈ ప్రపంచంలో ఉన్న లోపమేమిటి? మోక్షమంటే కొత్త ప్రపంచాన్ని కోరుకోవడం కాని, స్వర్గానికి చేరడంకాని కాదు. స్వర్గం అంటే కేవలం ప్రతిదీ ఇక్కడికంటే మెరుగ్గా ఉందనుకునే ఒక కొత్త ప్రపంచం మాత్రమే. ఇక్కడికంటే అక్కడ కాస్త మెరుగ్గా ఉన్నా లేదా చాలా మెరుగ్గా ఉన్నా కొంతకాలం తర్వాత దానితో మీకు బోరు కొట్టక మానదు. దూర ప్రదేశాలలో నివసిస్తున్న ప్రజలు అమెరికా అద్భుతంగా ఉంటుందనుకుంటారు.  కాని అమెరికా వాసులకు చాలా బోరుగా ఉంటుంది. లేకపోతే ఇంత పెద్ద వినోద పరిశ్రమ ఎందుకు?

మీ మేధ చాలా క్రియాశీలంగా ఉంటే కొత్తదేదైనా 24 గంటల్లో మీకు పాతదై పోతుంది. మీరు కొంచెం మంద బుధిగా ఉంటే అలా జరగడానికి 24 సంవత్సరాలు పట్టవచ్చు కాని అది పాతబడక తప్పదు. కొత్తదనం అనేదొక ఉచ్చు, పాతదొక భూగర్భపు మురికిగుంట. మురికి గుంట నుండి మీరు కొత్త ఉచ్చులోకి దూకితే దానివల్ల లాభమేమీ లేదు. ఆధ్యాత్మికత అంటే మీరో కొత్త దానికోసం చూడడం కాదు, కొత్తా, పాతా అన్నిటి నుండి మీరు విముక్తి కోరుకోవడం..!

ప్రేమాశిస్సులతో,
సద్గురు