మీరు మీ శరీరాన్ని ఈ సంకెళ్ల నుండి విముక్తం చేసుకోలేకపోవచ్చు, కాని మీ మనస్సును మాత్రం ఖచ్చితంగా విముక్తం చేసుకోగలరు. అది మీ చేతిలోనే ఉంది. అవునా? ఇప్పటికిప్పుడు మీరు సన్యాసం తీసికొని ఒక ఆశ్రమంలో జీవించలేకపోవచ్చు - మీ భార్య లేదా భర్త లేదా పిల్లలు మిమ్మల్నలా వదలకపోవచ్చు. కాని మీరు మానసికంగా స్వతంత్రులు, విముక్తులు కాదలచుకుంటే ఎవరైనా ఆపగలరా? లేరు. ఈ బంధాలకు కారణం మీరే. స్వాతంత్ర్యం అంటే మన పరిస్థితులన్నింటినీ మార్చడం కాదు.

 మీ బాహ్య పరిస్థితిని తక్షణమే మీరు మార్చుకోవలసిన అవసరం లేదేమో. కాని మీరు మీలోపలి స్థితిని మార్చుకోవాలి

విముక్తి కావడానికి మన పరిస్థితులను తలకిందులు చేసుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక పరిస్థితి మరో పరిస్థితి కంటే మేలైనది కాదు, అది కేవలం ఒక ఎంపిక మాత్రమే. కొంతమంది ఒక పరిస్థితిలో జీవించడం ఎంచుకుంటారు, కొంతమంది మరో పరిస్థితిలో జీవించడం ఎంచుకుంటారు. ప్రతి పరిస్థితిలోనూ మంచి చెడ్డలుంటాయి, లాభనష్టాలుంటాయి. మీరు మీ అంతరంగంలో ఎలా ఉన్నారన్నది, అతి ముఖ్యమైన విషయం, అవునా? అందువల్ల మీ బాహ్య పరిస్థితిని తక్షణమే మీరు మార్చుకోవలసిన అవసరం లేదేమో. కాని మీరు మీలోపలి స్థితిని మార్చుకోవాలి. ఎందుకంటే అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది కదా. ఈ మనస్సు దివ్యత్వానికి నిచ్చెన కావచ్చు, బ్రహ్మానందాన్ని కలిగించవచ్చు. చాలాసార్లు ఈ మనస్సు మీకు ఆనందం కలిగించింది, అవునా? అలాగే ఎన్నోసార్లు మీకది దుఃఖం, భయం, నిస్పృహ, ఒత్తిడి కలిగించి ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతోందంటే, మనస్సు అనే ఈ చిన్న పరికరాన్ని మీరు, మీ చేతుల్లోకి తీసుకోలేదు లేదు, అది మీ నియంత్రణలో లేదు. మీరు కారు తీసికొని బయలుదేరితే, పక్క ఊరుకు వెళ్ళవచ్చు  లేదా సూటిగా పోయి ఏదో ఒక చెట్టుకు ఢీ కొట్టవచ్చు. అది మీ ఇష్టం. అంటే దాంతో మీరేం చేయదలచుకుంటారో అది చేయవచ్చు. నియంత్రణ మీ చేతిలో ఉంటే మీరెంత దూరమైనా ప్రయాణించవచ్చు. అలాంటిదే ఇది కూడా.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

Pixabay