భారతీయ సంస్కృతి ఈ ప్రపంచంలోని అతి కొద్ది ప్రాచీన సంస్కృతుల్లో ఒకటి. భౌగోళిక పరిమాణం పరంగా చూస్తే, ఈ ప్రపంచంలో ఇటువంటి సంస్కృతి బహుశా ఇది ఒక్కటే అయ్యుంటుంది. వేలాది సంవత్సరాలుగా ఈ గడ్డ మీది ఉన్న మనుషులు అంతిమ శ్రేయస్సు లేదా ముక్తి కోసమే పరితపిస్తూ ఉండేవారు. భౌతికపరమైన శ్రేయస్సును కేవలం జీవితంలోని ఓ చిన్న అంశంగా మాత్రమే ఇక్కడి ప్రజానీకం పరిగణిస్తూ వచ్చింది. ఇంతకు ముందు ఈ భారతావనిలో జన్మించిన వారికి జీవితమంటే వ్యాపారమో, భార్యో, భర్తో, కుటుంబమో, కానేకాదు. వారి జీవితమంతా కేవలం ముక్తి గురించే. ఈ సంస్కృతిలో జీవితంలోని ప్రతి అంశమూ ముక్తి సాధనకు అనువుగా మలచబడింది. ఈ సమాజ వ్యవస్థ మొత్తం ఇదే విధంగా రూపుదిద్దబడింది.

ఇంతకు ముందు ఈ భారతావనిలో జన్మించిన వారికి జీవితమంటే వ్యాపారమో, భార్యో, భర్తో, కుటుంబమో, కానేకాదు. వారి జీవితమంతా కేవలం ముక్తి గురించే

అందువల్ల ఇక్కడ వారు సహజంగానే తాము రూపొందించిన ప్రతి పరికరాన్ని, జీవితంలోని ప్రతి పరిస్థితిని, మోక్ష సాధనకు అనువుగా మలచుకోవాలనుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం మీ వివాహం జరిగితే, ఈ వివాహ క్రతువు నడిపించే సందర్భంగా పురోహితుడు ఇలా అంటారు "ఇక్కడ మీరు, మీ జీవిత సహచరుల కలయిక ముఖ్యం కాదు. ఈ క్రతువు కేవలం మీకు వివాహం జరగడానికి సంబంధించినది మాత్రమే కాదు. మీరు ఉభయులూ కలిసి ఈ వివాహ బంధాన్ని మీ అంతిమ లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగించుకోండి. మీలోని కొన్ని పరిమితులు, నిర్బంధతల కారణంగానే మీరు ఈ వివాహం చేసుకుంటున్నారు. ప్రస్తుతం మీరు మీ పరిమితులను, నిర్బంధతలను అధిగమించే స్థితిలో లేరు. కాబట్టి, వాటిని ఈ వివాహం ద్వారా మీ అంతిమ శ్రేయోసాధనకు, తద్వారా అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి సాధనాలుగా మలచుకోండి" అని. ఈ దేశంలో ప్రతీదీ ఈ విధంగానే ఉంటుంది.

ఇదే ఉద్దేశ్యంతో మరెన్నో శక్తివంతమైన సాధనాలు ఈ సంస్కృతిలో సృజింపబడ్డాయి. ఇలానే జ్యోతిర్లింగాలు కూడా చాలా శక్తవంతమైన సాధనాలుగా సృష్టించబడ్డాయి. వీటిలో కొన్ని ఇప్పటికీ కూడా సజీవంగా, బ్రహ్మాండమైన శక్తితో విరాజిల్లుతున్నాయి. అవి మానవులకు ఎంతో ప్రయోజనకరమైనవి. ఒక వ్యక్తి తనంతట తాను ధ్యానంలో నిమగ్నుడవగలిగితే అప్పుడు అతనికి వెలుపలి సాయం అనేది అంత అవసరం ఉండకపోవచ్చు. కానీ, ఆ స్థితికి ఇంకా చేరని వారికి మాత్రం ఈ సాధకాలు చాలా అవసరమవుతాయి. ఇటువంటి శక్తి రూపాల సన్నిధిలో చాలా శక్తివంతమైన అనుభూతి కలుగుతుంది.

జ్యోతిర్లింగాలు పరమ శక్తవంతమైనవి. ఎందుకంటే వాటిని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ప్రతిష్ఠీకరించి నెలకొల్పారు

జ్యోతిర్లింగాలు పరమ శక్తవంతమైనవి. ఎందుకంటే వాటిని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ప్రతిష్ఠీకరించి నెలకొల్పారు. ఈ ప్రపంచంలో కేవలం 12 జ్యోతిర్లింగాలే ఉన్నాయి. భౌగోళికంగా, ఖగోళపరంగా ఎంతో విశిష్ఠత ఉన్న కేంద్రబిందువుల్లో వాటిని ప్రతిష్ఠించారు. ఈ ఉనికిలో ఉన్న కొన్ని శక్తులకు అనుగుణంగా ఈ కేంద్రాలున్నాయి. చాలా కాలం క్రిందట, ఎంతో మహత్తరమైన జ్ఞానం గల మహానుభావులు గ్రహ, నక్షత్ర గమనాల ఆధారంగా ఈ ప్రాంతాలను గణించి ఈ కేంద్ర బిందువులను నిర్ధారణ చేశారు. మానవ శక్తియుక్తులనే కాకుండా, ప్రాకృతిక శక్తులను కూడా ఉపయోగించుకొని వీటిని నెలకొల్పారు. ఈ కారణంగానే జ్యోతిర్లింగాలను ఇప్పుడున్న ప్రాంతాల్లో ఏర్పచారు.

మూర్తులను శక్తిమంతం చేసే శాస్త్రం నిర్దేశించిన నియమ నిబంధనలు, పద్ధతుల ప్రకారం ఈ జ్యోతిర్లింగ క్షేత్రాల ప్రతిష్ఠాపన జరిగింది. చాలా అసాధారణ, అద్భుతమైన రీతిలో మానవ జీవనాన్ని పరిపుష్టం చేయడానికి జీవ శక్తులను వినియోగించే శాస్త్రమిది. మట్టిని ఆహారంగా మార్చే ప్రక్రియను వ్యవసాయ అంటాం. ఆహారాన్ని మాంసం, ఎముకలుగా రూపాంతరం చెందించే విధానాన్ని జీర్ణప్రక్రియ అంటాం. ఈ మాంసాన్ని అంటే ఈ మాంసయుతమైన శరీరాన్ని మట్టిగా మార్చే ప్రక్రియను దహనం అంటాం. అలాగే శరీరాన్ని, ఓ రాతిని లేదా ఖాళీ స్థలాన్ని ఓ దివ్యశక్తిగా మార్చే ప్రక్రియని ప్రతిష్ఠీకరించడం లేదా ప్రతిష్ఠాపన అంటాం. ఇది పరమాద్భుతమైన శాస్త్రం. దురదృష్టవశాత్తూ, ఇప్పుడు ప్రతిష్ఠాపన అంటే అసలేమిటో మనం మరచిపోయాం. అందువల్ల ఈ పేరుతో అర్థంపర్థం లేని పరిహాసాత్మకమైన కార్యకలాపాలు ఎన్నో సాగిపోతున్నాయి.  దీనిని వ్యాపారంగా మార్చుకుని సొమ్ము చేసుకొంటున్నారు.

శరీరాన్ని, ఓ రాతిని లేదా ఖాళీ స్థలాన్ని ఓ దివ్యశక్తిగా మార్చే ప్రక్రియని ప్రతిష్ఠీకరించడం లేదా ప్రతిష్ఠాపన అంటాం

నేను సాధారణంగా గుళ్ళకు వెళ్ళను. కాని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రానికి వెళ్ళడం జరిగింది. ఈ దేవాలయాన్ని అనేక సార్లు ధ్వంసం చేశారు. మనదేశం మీద దండెత్తిన వాళ్ళు ఈ దేవాలయాన్ని కూలగొట్టారు. ఈ కారణంగా ఇప్పటికి రెండు, మూడు మార్లు దీనిని తిరిగి నిర్మించి పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ఏదేమైనా, ఇప్పటికి కూడా మీరు అక్కడికి వెళ్ళి ఆ జ్యోతిర్లింగ సన్నిధిలో కూచున్నారంటే... వేలాది సంవత్సరాలుగా అక్కడ ఉన్న ఆ చిన్న స్వరూపం, ఆ చిన్న రాతిముక్క మిమ్మలని ఒక అద్భుతమైన అనుభూతిలో ముంచేస్తుంది. ఆ మహాశక్తి స్వరూపం కేవలం నిన్ననే ప్రతిష్ఠించిబడిన దానిలా మహాశక్తి తరంగాలను వెదజల్లుతూ ఉంటుంది.

జీవితంలో వీటి మహత్తును పరిపూర్ణంగా అనుభంలోకి తెచ్చుకోగలిగిన వారికి జ్యోతిర్లింగాలు మహాశక్తివంతమైన సాధనాలు. మీ శారీరక, మానసిక వ్యవస్థను పరిపూర్ణంగా పునఃవ్యవస్థీకరించుకోగలిగే నేర్పు మీకు తెలిస్తే, ఈ జ్యోతిర్లింగాల సన్నిధిలో మీ వ్యవస్థను సమూలంగా మార్చుకోగలుగుతారు. ఈ భూమి మీద ప్రతిష్ఠించిన ప్రతి లింగానికీ, దానికి సంబంధించిన ప్రత్యేకమైన సాధన ఒకటి ఉంటుంది. అయితే, ఈ సాధన ప్రక్రియ అనేది మాత్రం ఈ రోజుల్లో పూర్తిగా మాయమైపోయింది. అందువల్ల దేవాలయాలు ఇప్పడు చాలా కాలం కిందట చనిపోయిన వారి స్మృత్యర్థం నిర్మించిన స్మారక చిహ్నాలుగా మిగిలిపోయాయి. జ్యోతిర్లింగాల్లో కొన్ని ఇప్పుడు సజీవంగా లేవు, కాని మిగిలిన వాటిలో చాలా లింగాలు ఇప్పటికీ మహాశక్తివంతమైన సాధకాలే!

ప్రేమాశీస్సులతో,
సద్గురు