గురు పూర్ణిమ దగ్గరపడుతున్న తరుణమిది. గురువులకు అత్యంత గౌరవమిచ్చి పూజించిన మన చారిత్రిక సంస్కృతి ఇప్పుడు దురదృష్టవశాత్తూ దాదాపు కనుమరుగైంది. ఇది వరకు గురుపూర్ణిమను దేశమంతా జరుపుకుంటూ, ఆ రోజును వారి కృపాదృష్టిని పొందటానికి అనువైనదిగా భావించేవారు. ఈ సంస్కృతిని తిరిగి తీసుకురావటానికి, సద్గురు వివిధ సందర్భాలలో చెప్పిన మన గురువుల జీవిత కధలను ఒక క్రమంలో సేకరించి ఇక్కడ పొందుపరుస్తున్నాం. ఈ కధలలో శిష్యగణంలో పరివర్తన తీసుకురావటానికి గురువులు అవలంబించిన వివిధ పద్ధతులను వివరించారు సద్గురు.

ఈ ఆర్టికల్లో సద్గురు మనకు ఒక అద్భుత గురువైన, వికలాంగుడైన అష్టావక్రుడి కధ చెబుతూ అతడి శిష్యుడు ఇంకా జ్ఞ్యానియైన జనక మహారాజుకి ఆత్మజ్ఞ్యానం లభించిన క్రమం ఎలాంటిదో వివరిస్తున్నారు.ఆత్మజ్ఞ్యానం సంపాదించిన అతి తక్కువమంది మహారాజులలో జనకుడొకరు.

సద్గురు: కొన్ని వేల సంవత్సరాల క్రితం, అష్టావక్రుడనే ఒక గొప్ప గురువు ఉండేవాడు. ఈ భూగ్రహం మీదున్న అత్యంత గొప్ప ఋషుల్లో ఒకరాయన. ఆధ్యాత్మిక రంగంలో అత్యంత ప్రభావశీలుడాయన. అష్టావక్రుడంటే “శరీరంలో ఎనిమిది రకాల అవకరాలున్నవ్యక్తి అని అర్ధం”. ఇది అతడికి అతడి తండ్రిగారు పెట్టిన శాప ఫలితం.

శాపగ్రస్తుడైన బిడ్డ


అష్టావక్రుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ఆయన తండ్రి ఋషి కహోలుడు అతడికి ఎంతో జ్ఞ్యానబోధ చేశాడు. పిండ స్థితిలోనే అష్టావక్రుడు తన తల్లి గర్భం నుండే జ్ఞ్యానాన్ని సంపాదించాడు. పుట్టక ముందే రకరకాల విద్యల్లో ఆరితేరి ఆత్మజ్ఞ్యానం సంపాదించి తానెవరో తెలుసుకున్నాడు.

ఒక రోజున కొన్ని పద్ధతులు బోధిస్తున్న కహోలుడు ఒక తప్పు చేసాడు. అది గర్భం నించి వింటున్న అష్టావక్రుడు, అది తప్పని సంకేతం చేస్తూ “హం” అని శబ్దం చేశాడు. అది విన్న కహోలుడికి పట్టరాని కోపం వచ్చి ఇంగితం మరచి ఆ పిండాన్ని అష్ట వక్రాలున్న వాడిగా పుట్టమని శపించాడు. అందుకే అష్టావక్రుడు వంకర పాదాలతో, చేతులతో,మోకాళ్ళతో,ఛాతితో,మెడతో పుడతాడు.

జనక మహారాజు ఎదురుచూపు


ఇలా పుట్టి పెరుగుతున్న అష్టావక్రుడు చిన్నవయసులో తన తండ్రితో పాటు ఒకసారి జనక మహారాజు ఆహ్వానం మేరకు ఒక చర్చాగోష్టిలో పాల్గొనటానికి వెళ్ళాడు. జనకుడు ఎంతో గొప్ప వ్యక్తిత్వం గలవాడు. మహారాజైనా అతడొక వైరాగ్య కామకుడు. ఆత్మజ్ఞ్యానం సంపాదించాలనే కోరికతో ఉండేవాడు. అతనికి ఆత్మవిద్య పట్ల ఎంత కాంక్ష అంటే, ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞ్యానులందరినీ వెతికి అతడి సభలో కొలువు చేసేవాడు. వారిని ఆహ్వానించి, గౌరవించి, బాగోగులు చూసి వారిని ఆధ్యాత్మికత బోధించమనేవాడు.

ప్రతిరోజూ త్వరగా నిత్యకృత్యాలు పూర్తి చేసుకుని, మిగిలిన సమయాన్నంతా ఆ గురువులు చెప్పే ఆధ్యాత్మిక అంశాలను వింటూ గడిపేవాడు. వారితో సంవాదం చేస్తూ చర్చలు చేస్తూ జ్ఞ్యానోదయానికి మార్గాలు అన్వేషించేవాడు. ఆధ్యాత్మిక గ్రంధాలను అవపోశన పట్టిన వివిధ పండితులను కూర్చోపెట్టి వాటి గురించి రోజులూ వారాల తరబడి వాదాలు ప్రతివాదాలు చర్చలు చేయిస్తూ ఆనందించేవాడు. వాదాలు ముగిసిన తరువాత గెలిచిన పండితుడిని బహుమతులతో, ధనంతో సత్కరించి అతడి సభలో ఒక ఉచిత స్థానం లేదా పదవి కల్పించేవాడు. అలా నియమించబడినవారు ఎంతో జ్ఞ్యానులై ఉండేవారు. అలా ఎంతో మందిని తన సభలో చేర్చుకున్నా కూడా ఎవ్వరూ అతడికి జ్ఞ్యానోదయం కలిగించలేకపోయేవారు.

ఒకసారి ఇలాంటి ఒక చర్చకే కహోలుడు పిలవబడగా, అతడితో అష్టావక్రుడు కూడా వచ్చాడు. చర్చ మొదలై ఎందరో వాదోపవాదాలు చేసుకుంటున్నారు. ఎన్నో మేధోవంతమైన ప్రశ్నలు వెయ్యబడుతున్నాయి. ఎన్నో గ్రంధాల గురించిన ఉపమానాలు చెప్పబడుతున్నాయి. వీటన్నిటి మధ్యలో ఉన్నట్టుండి అష్టావక్రుడు నిలబడి “ఇవన్నీ ఉత్తి మాటలే. మీలో ఎవరికీ తనగురించి తనకి తెలీదు. అందరూ ఎదో మాట్లాడుతున్నారు కానీ, ఇక్కడున్న నా తండ్రితో సహా ఎవ్వరికీ తానేంటో తెలీదు” అన్నాడు.

అప్పుడు జనకుడు, వక్రమైన శరీరంగల అష్టావక్రుడి వంక చూసి “మీరు చెప్పిన మాటలను నిరూపించండి. లేదా వక్రంగా ఉన్న మీ ఈ శరీరానికి కూడా మీరు దూరమౌతారు”అన్నాడు.

అప్పుడు అష్టావక్రుడు, “నిరూపించగలను” అన్నాడు.

“అయితే చెప్పండి ఏం చెప్తారో” అన్నాడు జనకుడు.

రాజా! మీకు ఈ విద్య ఏంటో తెలియాలంటే, మీరు నేను చెప్పినది తు.చ తప్పకుండా పాటించాలి. అలా చెయ్యగలిగితే, నన్ను అనుసరించగలిగితే, నువ్వెవరో నీకు తెలిసేలా చేస్తాను” అన్నాడు.

జనకుడు చాలా సంతోషించి అతడి ముక్కుసూటితనానికి మెచ్చి “మీరు ఏదైనా చెప్పండి. నేను చేస్తాను” అన్నాడు. జనకుడు ఆ మాట ఊరికే అనలేదు. ఖచ్చితంగా చేసే ఉద్దేశంతోనే అన్నాడు. ఎందుకంటే అతనికి ఆత్మవిద్యే లక్ష్యం.

అప్పుడు అష్టావక్రుడు “నేను అడవిలో ఉంటాను. అక్కడికి రా. ఎం చెయ్యాలో చూద్దువుగాని” అని అంటూ లేచి బయలుదేరి వెళ్ళిపోయాడు.

అక్కడే ఆగు!


కొన్ని రోజుల తరువాత జనకుడు అష్టావక్రున్ని వెతుక్కుంటూ అడవికి వెళ్ళాడు. రాజు ఎక్కడికి వెళ్ళినా వెనక మందీ మార్బలం, సైన్యం రావటం సహజమే కదా!.రాజు అతని పరివారం, సైన్యం, మంత్రుల సహితంగా అడవుల వెంటబడి అష్టావక్రుణ్ణి వెతుకుతున్నారు. రోజులు గడిచాయి. వెళుతున్న కొద్దీ అడవి చిట్టడవిగా మారుతోందే కానీ లాభం లేకపోయింది. కొన్ని రోజులకి అలసిపోయిన పరివారం రాజుగారినించి విడిపోయింది. రాజు వంటరి వాడయ్యాడు. ఆకలి దప్పులతో రాజు అడవి చుట్టూ తిరుగుతూ ఉండగా ఒక చెట్టుకింద కూర్చున్న అష్టావక్రుడు కనిపించాడు.

అష్టావక్రుణ్ణి చూడగానే జనకుడు గుర్రం దిగటం మొదలు పెట్టాడు. గుర్రం సగం దిగీ దిగుతుండగా అష్టావక్రుడు “ఆగు. అలాగే ఆగు. అక్కడే!!!” అన్నాడు. రాజు ఒక కాలు(దిగబోతున్న సమయం) గాలిలో ఉంది. ఈ మాట వినగానే ఇబ్బందికరమైన ఆ భంగిమలోనే ఉండిపోయాడు జనకుడు.

అలాగే ఇబ్బందికరమైన స్థితిలో ఉండిపోయిన జనకుడు, కొంత సేపు అలా ఉండిపోయాడని కొందరు, కొన్నేళ్ళు అలా ఉండిపోయాడని కొందరు అంటారు. ఇక్కడ సమయం ముఖ్యం కాదు. చాలా సేపు ఆయన ఆజ్ఞ్య పాటించి అలా ఉండిపోయాడనేది విషయం. “మీరేం చెప్పినా చేస్తాను” అన్న మాటని పాటించాడు జనకుడు. అలా అదే స్థితిలో ఉండిపోయిన జనకుడికి అదే స్థితిలో జ్ఞ్యానోదయం అయింది. జనకుడు ఆత్మజ్ఞ్యాని అయ్యాడు.

జ్ఞ్యానోదయం అయిన వెంటనే గుర్రం దిగి అష్టావక్రుడి కాళ్ళ మీద పడ్డాడు జనకుడు. “ఈ రాజ్యం, మందీ మార్బలం, సిరులూ నాకొద్దు. మీ పాదాల దగ్గర చోటివ్వండి చాలు. మిగతావేవీ నాకు ముఖ్యం కాదు. ఈ అడవిలోని మీ ఆశ్రమంలో ఇంత చోటివ్వండి” అన్నాడు.

దానికి అష్టావక్రుడు “రాజా! నువ్వు ఇప్పుడు ఆత్మజ్ఞ్యానివి. ఇప్పుడిక నీకు ఇష్టాలు అయిష్టాలు ఉండవు. నీకంటూ అవసరాలు ఉండవిక. కానీ నీ ప్రజలకు ఒక జ్ఞ్యానోదయం కలిగిన మహారాజు అవసరం ఉంది. నువ్వు వారికి రాజుగా ఉండి వారిని చూసుకోవాలి” అన్నాడు. దానితో అయిష్టంగానే జనకుడు తిరిగి రాజ్యానికెళ్ళి, విజ్ఞ్యతతో రాజ్యాన్ని పరిపాలించాడు.

జనకుడు తన ప్రజలకు ఒక వరం లాంటివాడు. ఎందుకంటే అతడు ఆత్మజ్ఞ్యాని. అయినా గురువు ఆజ్ఞ్య ప్రకారo పరిపాలన చేశాడు. మన భారతదేశంలోని ఋషులూ మునులూ, పూర్వాశ్రమంలో పెద్ద పేద రాజులూ చక్రవర్తులే. వారు స్వచ్ఛoదంగా, అన్నీ వదిలేసి నిరుపేదల్లా జీవనం కొనసాగించేవారు. ఇలాంటి ఎందరో రాజులున్నారు. గౌతమ బుద్ధుడు, మహావీరుడు, బాహుబలి ఇలా జ్ఞ్యానులైనవారు ఎందరో ఉన్నా జనకుడు మాత్రం చాలా అరుదైన ఆత్మజ్ఞ్యాని. పరిపాలన నుండి ఎప్పుడు విరామం దొరికినా అష్టావక్రుడి ఆశ్రమానికి వచ్చేసేవాడట.

సన్యాసులూ-కోతులు

అష్టావక్రుడు తన ఆశ్రమంలో కొందరు సన్యాసులకు విద్య బోధించేవాడు. ఆ సన్యాసులకు జనకుడంటే ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే అతడు వచ్చినప్పుడల్లా అష్టావక్రుడు జనకుడితో ఎక్కువ సమయం గడుపుతూ ఉండటం, వారిద్దరిమధ్యా ఉన్న అవగాహనా వారికి నచ్చేది కాదు. జనకుడిని చూసినప్పుడు అష్టావక్రుడి ముఖంలో కనిపించే ఆనందం, వీరికి బోధించేటప్పుడు కనిపించేది కాదు. అందుకే ఆ సన్యాసులకు జనకుడంటే ఈర్ష్యగా ఉండేది.

సన్యాసులు వారిలో వారు - గురువుగారు ఆమ్ముడుపోతున్నట్టు ఉన్నారని, ఆయనకు ఆశ పుడుతోందనీ అనుకునేవారు. “అతడు ఒక రాజు. అతడికి రాజ్యం, రాణులు, పిల్లలు, కీర్తి, అన్నీ ఉన్నా ఇక్కడికే వస్తాడు. ఎలాంటి బట్టలు వేసుకున్నాడో, ఎలాంటి నగలు పెట్టుకున్నాడో ఎలా రాజు లాగా నడుస్తున్నడో చూడు. అసలు ఇతనిలో ఆధ్యాత్మికత ఇంతైనా ఉందా?గురువుగారు ఏమి చూసి ఇతడికి ఇంత విలువ ఇస్తున్నారు? ఆతను అప్పుడప్పుడే వస్తాడు. మనం ఇక్కడే ఉండి గురువుగారికి సేవ చేస్తూ విద్యని అధ్యయనం చేస్తున్నాం. అయినా ఆయన మనని లక్ష్య పెట్టారు. అతనిలో ఏమిటో అంత గొప్ప?” అని మాట్లాడుకునే వారు.

అష్టావక్రుడు సన్యాసులలో పెరుగుతున్న ఈ భావాలను గ్రహించాడు. దీనికి నివృత్తి ఆలోచించాడు. ఒకరోజు మామూలుగా శిష్యులకు విద్యను బోధిస్తున్నాడాయన. ఆ సమయంలో జనకుడు కూడా అక్కడే ఉన్నాడు. ఉపన్యాసం కొనసాగుతున్న సమయంలో ఒక భటుడు పరుగు పరుగున వచ్చి జనక మహారాజుకి నమస్కరించి “మహారాజా మన రాజప్రాసాదానికి నిప్పంటుకుంది. రాజ్యమంతా తగలబడుతోంది. అంతా అస్తవ్యస్తంగా ఉంది” అన్నాడు.

జనకుడు వెంటనే లేచి ఆ భటుడిని కోప్పడుతూ, “వెళ్ళిపో ఇక్కడినించి. ఈ సత్సంగాన్ని చెడగొట్టటానికి నీకెంత ధైర్యం? పైగా నా గురువుకి కాకుండా నాకు నమస్కరిస్తావా? వెళ్ళిపో ఇక్కడినించి ” అని అరిచాడు. ఆ భటుడు భయంతో అక్కడినించి వెళ్ళిపోగానే జనకుడు తిరిగి కూర్చుని అష్టావక్రుడి వైపు చూస్తూ నమస్కరించాడు. అష్టావక్రుడు తన ఉపన్యాసం కొనసాగించాడు.

కొన్ని రోజుల తరువాత అష్టావక్రుడు ఇంకొక పధకం వేసాడు. జనకుడితోపాటు అందరికీ ఒక పాఠం బోధిస్తున్నాడు. పాఠం మధ్యలో ఒక సేవకుడు అరుస్తూ వచ్చి “గురూగారూ ఆశ్రమం నిండా కోతులు. అవి సన్యాసులందరి బట్టలూ లాక్కుని పీకి పాకాన పెడుతున్నాయి. చింపేస్తున్నాయ్” అన్నాడు. అది విన్న సన్యాసులందరూ లేచి బట్టలు కాపాడుకోవటానికి బట్టలు ఆరేసే చోటుకి పరిగెత్తారు. అక్కడికెళ్ళి చూసే సరికి కోతులూ లేవు, బట్టలకీ ఏమీ కాలేదు. జరిగిన విషయం వారికి అర్ధమైంది. దానితో వారు తల వంచుకుని గురువుగారి దగ్గరకి వచ్చారు.

మీరు మీ లోపల ఎలా ఉన్నారు అనేదే ముఖ్యమైన విషయం.

అప్పుడు పాఠంలో భాగంగా అష్టావక్రుడు ఇలా అన్నాడు. “ఇక్కడ చూడండి. ఇతడు ఒక రాజు. కొన్ని రోజుల క్రితం ఇతడి రాజ్యం అగ్నికి ఆహుతైపోయింది. అతడి రాజ్యం, ధనం, మందిరం, అనీ దగ్ధమైపోయాయి. అటువంటి సమయంలో కూడా అతడికి సత్సంగం చెడినందుకే కోపం వచ్చింది. అదొక్కటే అతడికి ముఖ్యం.”

“మీరు సన్యాసులు. మీకేవీ లేవు. రాజ్యాలు, మందిరాలూ, భార్యా, పిల్లలూ ఏవీ లేవు. అయినా మీ బట్టలని కోతులు చింపుతున్నాయని తెలియగానే మీరు లేచి ఆదుర్దాగా పరిగెత్తారు. మీరు వేసుకునేవి ఇతరులెవరూ కూడా ఇల్లు తుడవటానికి కూడా వాడని అంగవస్త్రాలు. అలాంటి విలువలేని బట్టల కోసం మీరు నా మాటైనా వినకుండా పరిగెత్తారు. మీలో సన్యాసం ఏది?.ఇతడే నిజమైన సన్యాసి. అతడు రాజే అయినా నిజమైన సన్యాసి. మీరు సన్యాసులు; ఇతరులు వాడి వదిలిన వాటిని వాడి జీవితం గడుపుకుంటారు. అయినా మీలో సన్యాసం లేదు. మీరున్నదెక్కడ? అతడున్నదెక్కడ?” అన్నాడు.

మనిషిలోని అంతర్గత పురోగతికీ బాహ్యంగా అతడుచేసే పనులకీ ఏమాత్రం సంబంధం లేదు. మనిషి అంతర్గతంగా లోలోపల ఏమి చేస్తున్నాడనేదే ముఖ్యం. పరిస్థితులకూ, అవసరానికీ, కర్తవ్యానికీ అనుగుణంగా మీరు చేసేవే బయటి పనులు, సమాజపరంగా అవసరమే అయినా, మీరు మీ లోపల ఎలా ఉన్నారు అనేదే ముఖ్యమైన విషయం.

సంపాదకుడి సూచన: ఈశా యోగ కేంద్రంలో జరిగే గురు పౌర్ణమి వేడుకల్లో పాలుపంచుకోండి. రిజిస్టర్ చేసుకోండి.