దీపావళి పండుగ భారత దేశంలో అందరూ అత్యంత ఉత్సాహంగా జరుపుకునే పండుగ. ఈ పండుగకు ఈ పేరెందుకు వచ్చిందో, ఈ పండుగ జరుపుకుకోవడంలోని అసలు అంతర్యం ఏమిటో ఈ వ్యాసం ద్వారా సద్గురు మనకు తెలియజేస్తున్నారు.


సనాతన భారతీయ సంప్రదాయంలో, ఒకప్పుడు ప్రతిరోజూ ఒక పండుగ జరుపుకునేవారు. అంటే సంవత్సరం మొత్తం, 365 రోజులూ పండుగలే. మన మొత్తం జీవితాన్నంతా ఒక వేడుకలా గడిపేయాలన్న ఉద్దేశంతోనే ఈ ఆచారం ఏర్పాటు చేశారు. దురదృష్టవశాత్తూ వీధిలో నడవడం, ఆఫీసుకు వెళ్ళడం లాంటి మామూలు దినచర్యలను మనం ఒక సంబరంలా, వేడుకలా జరుపుకోవటం లేదు. అందుకే సంబరాలు, వేడుకలు చేసుకోవడానికి ఒక సాకుగా ఈ పండుగలు ఉండేవి.

దీపావళి పండుగ ఉద్దేశం కూడా మీ జీవితంలో సంబరాన్ని నింపడమే - దానికి గుర్తుగానే టపాకాయలు పేల్చుతాం. మిమ్మల్ని ఎంతో కొంత ఉత్సాహంతో నింపడానికే అలా చేస్తాం. దీని ఉద్దేశం ఏదో ఆ ఒక్కరోజు సరదాగా గడిపేయాలని కాదు. మన లోపల ప్రతినిత్యం ఇలానే, అంటే ఒక పండుగలానే ఉండాలి. కేవలం అలా ఊరికనే కూర్చున్నా, మన జీవశక్తి, మన హృదయం, మనసు, శరీరం అన్నీ కూడా ఒక సజీవ టపాకాయిలా అన్నివేళలా వెల్లివిరియాలి. అలాకాక మీరు తుస్సుమనే టపాకాయిలాంటి వారైతే, మిమ్మల్ని రగిలిస్తూ ఉంచడానికి రోజూ వెలుపలి నుంచి టపాకాయలు పేల్చాల్సి ఉంటుంది.

వెలుగంటే స్పష్టత. స్పష్టత లేనప్పుడు, మీలోని మిగతా సుగుణాలన్ని కేవలం ప్రతిబంధకాలే అవుతాయి, వరాలు కావు.

దీపాల పండుగే దీపావళి. ఈ దీపావళి రోజున ప్రతీ పల్లె, పట్టణం, నగరం, అన్నీ వేలాది దీపాలతో వెలిగిపోతుంటాయి. కాని, ఈ వేడుక కేవలం బాహ్యంగా దీపాలు వెలిగించడం గురించి కాదు, అంతర్జ్యోతి వెలగాలి. వెలుగంటే స్పష్టత. స్పష్టత లేనప్పుడు, మీలోని మిగతా సుగుణాలన్ని కేవలం ప్రతిబంధకాలే అవుతాయి, వరాలు కావు. స్పష్టతలేని ఆత్మవిశ్వాసం ఘోర విపత్తులకు దారితీస్తుంది. లోకంలో ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే, ఎటువంటి స్పష్టతా లేకుండా ఎంతో విపరీతంగా పని చేసేస్తున్నారు. ఇది మంచిది కాదు.

ఉదాహరణకు ఓ సంఘటన చెపుతాను. కొత్తగా ఉద్యోగంలో చేరిన ఓ పోలీసు మొదటిసారిగా వాహనంలో తన సీనియర్ వెంటరాగా ఓ వీధివెంట వెడుతున్నాడు. కొంతసేపటికి వాళ్లకు వైర్‌లెస్‌లో ఓ వార్త వచ్చింది. 'ఫలానా చోట చాలామంది గుమికూడి ఉన్నారని, అదేదో చూడమని' ఆ సందేశ సారాంశం. దాంతో వీళ్లు ఆ వీధిలోకి వెళ్లారు. నిజమే, ఆ వీధిలో ఓ ప్రక్క చాలామంది ఉన్నారు. ఇంకేముంది, మన కొత్త పోలీసు పరమోత్సాహంతో, తన కారు కిటికీ తలుపులు కిందకు దించి, వాళ్లనుద్దేశించి, "మర్యాదగా అందరూ అక్కడినుంచి వెళ్లిపోండి!" అంటూ గట్టిగా అరిచాడు. ఆ జనమంతా అర్ధంగాక సందిగ్ధంగా అతడి వైపు చూశారు, అంతేగానీ అక్కడనుంచి కదలలేదు. దాంతో కొత్త పోలీసుకు కొంచెం కోపం వచ్చింది. స్వరం కాస్త పెంచి, "చెపుతున్నది మీకే కదా? వెళతారా, వెళ్లరా?" అని కసురుకున్నాడు. అప్పుడు వారంతా వెళ్లిపోయారు. ఉద్యోగం తొలిరోజు చేసిన తొలిపనిలోనే తను జనంపై చూపించిన ప్రభావానికి ఆనందపడుతూ, తన సీనియర్ వైపు తిరిగి, 'మొదటి డ్యూటీ.. బాగా చేశానా?’ అని అడిగాడు. దానికా సీనియర్, 'ఫరవాలేదు, బాగానే చేశావు. కానీ, అది బస్సుస్టాప్!’ అన్నాడు.

జీవితాన్ని మీరెంత స్పష్టంగా చూడగలుగుతున్నారు, అలాగే మీ చుట్టూ ఉన్న వాటిని ఎంత స్పష్టంగా గ్రహించగలుగుతున్నారు అన్న విషయాలే మీరు మీ జీవితాన్ని ఎంత అర్ధవంతంగా నడిపిస్తారనే విషయాన్ని నిర్ణయిస్తాయి.

తగినంత స్పష్టత లేకుండా ఏ పని చేసినా సరే, అది విపత్కర పరిస్థితులకు దారితీస్తుంది. వెలుగు మన దృష్టికి స్పష్టత తెస్తుంది. కేవలం భౌతిక విషయాలకే కాదు, అన్ని విషయాలకూ ఇది వర్తిస్తుంది. జీవితాన్ని మీరెంత స్పష్టంగా చూడగలుగుతున్నారు, అలాగే మీ చుట్టూ ఉన్న వాటిని ఎంత స్పష్టంగా గ్రహించగలుగుతున్నారు అన్న విషయాలే మీరు మీ జీవితాన్ని ఎంత అర్ధవంతంగా నడిపిస్తారనే విషయాన్ని నిర్ణయిస్తాయి. దుష్టశక్తులు అంతం చేయబడి, వెలుగులు విరజిల్లబడిన రోజే దీపావళి. సూర్య కాంతిని తామే అడ్డుకుంటున్నామని గ్రహించకుండా, కారుమబ్బులు ఎలాగైతే అంధకారంలో సంచరిస్తాయో, అలాగే మనిషి కూడా తనలోకి తానే కారుమబ్బులను అనుమతించానని గ్రహించకుండా, చీకటిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మనిషి ఎక్కడి నుంచో తనలోకి వెలుగుని తీసుకురావలిసిన అవసరం లేదు. తనలో గూడుకట్టుకొని ఉన్న చీకటి మేఘాలను తను చెదరగొడితే చాలు, వెలుగు దానంతట అదే వస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తు చేయడానికే ఈ దీపాల పండుగ!

ప్రేమాశీస్సులతో,
సద్గురు