అగస్త్యముని వంటి మహాపురుషుడిని తయారుచేయగాలమా??
ఈ రోజుల్లో, అగస్త్యమునివంటి మరో గొప్ప మహాపురుషుడిని తయారు చెయ్యడం సాధ్యమేనా..? సప్తఋషులు ప్రత్యేకంగా జన్మించినవారు కాదని, వారు తమ ఆకాంక్షతో, పట్టుదలతో, చెదరని దృష్టితో ఆ విధంగా రూపుదిద్దుకున్నారని సద్గురు మనకు చెబుతున్నారు.
ప్రశ్న: మనం అగస్త్యముని వంటి వారిని మరొకరిని సృజించగలమా..??
సద్గురు: మనకు అగస్త్యముని గురించి తెలిసిన ఒక విషయం ఏమిటంటే, మిగతా ఆరుగురికంటే కూడా ఈయన కొంచెం కురచగా, అందవికారంగా ఉండేవారని. అందుకని మీలో ఎవరైతే అగస్త్యముని అవ్వదలచుకుంటున్నారో వారికివి ముఖ్యమైన అర్హతలు. అగస్త్యుడు తమిళనాడుకు చెందిన మనిషి. ఈయన కొంచెం పొట్టిగా, బలిష్టంగా, నల్లగా ఉండేవారు. కానీ ఈ స్వభావాలేవి సమస్య కాదు. అగస్త్యుడే కాదు, సప్తఋషులందరిలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, వారి జీవితాన్నంతా సాధనలోనే గడిపారు. వారినివారు సంసిద్ధం చేసుకున్నారు. 84 ఏళ్ల పాటు సాధన చేశారని చెబుతారు. 84 అనేది ఎంతో ముఖ్యమైన సంఖ్య. ఒక మానవుడు ఎంత చెయ్యగలడో అదంతా వీరు చేశారు. వారు మొత్తం 84 అంశాలను తెలుసుకొని, వాటికై కృషి చేసి, వారిని వారు సంసిద్ధం చేసుకున్నారు.
మిమ్మల్ని మీరు సృజించుకోవడం
మరోమాటలో చెప్పాలంటే, ఈ పురాణం ఎం చెబుతుందంటే, సప్తఋషులు ఎక్కడో ఆకాశంలో నుంచి ఊడిపడలేదు. వారిది ప్రత్యేకమైన జననమేమి కాదు. వారు పుట్టినప్పుడు నక్షత్రాలు ఒకటవ్వడం, ఒక పెద్ద మెరుపు ఎలా మెరిసిందొ వంటి కథలేవి చెప్పలేదు. అంతాకూడా చాలా సాధారణంగానే జరిగింది. వారు భారతదేశంలో ఎక్కడ పుట్టారో కూడా ఎవరికీ తెలియదు. ఎవరో స్త్రీలు, ఎక్కడో అంత ప్రాముఖ్యం లేని ప్రదేశంలో వారికి జన్మనిచ్చి ఉండవచ్చు. వారు స్వర్గం నుంచి ఊడిపడలేదు. వారినివారు ఆవిధంగా తయారు చేసుకున్నారు. వారి కథలో ముఖ్యమైన అంశం ఇదే.
ఆ చెట్టుకి ఇదే ఎంతో అఖండమైన సాధన.. కదూ..? కానీ, అది ఈరోజున ఉన్న విధంగా తననితాను సృజించుకుంది. ఇప్పుడు, మనం ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టుకుని దానిని చూస్తాం. అదేవిధంగా అగస్త్యుడిని, సప్తఋషులను కూడా మనం ఎంతో ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టుకుని చూస్తాం. ఎందుకంటే వీరు మనకు మానవాతీతంగా కనిపిస్తారు కాబట్టి. వారు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు. కానీ, వారిని వారు, ఆవిధంగా తయారు చేసుకున్నారు. ఎటువంటి సహాయ సహకారాలూ లేకపోయినా, వారి ఆకాంక్ష, వారి పట్టుదల, చెదరని వారి దృష్టితో వారు కృషి చేస్తూనే ఉన్నారు. ఆదియోగి వారిని విస్మరించినప్పటికీ, వారు సాధనను ఆపలేదు. వారిలో ఎంతో ముఖ్యమైన అంశం ఇదే. అది 84 సంవత్సరాలా లేదా 84 జీవిత కాలాల సాధనా అన్నది వారు పట్టించుకోలేదు. వారు, అది చెయ్యడానికి సుముఖంగా ఉన్నారు.
అనుగ్రహం ఇంకా అచంచలమైన దృష్టి
ఉదాహరణకు, అగస్త్యముని, ఇక్కడకు దగ్గరలో, ఒక పల్లెటూరిలో, జన్మించాడనుకుందాం. ఒకరోజున, అక్కడినుంచి వెళ్ళిపోయారు. ఆయన హిమాలయాలకు ఆదియోగివద్ద ఉండడానికి వెళ్ళారనుకోండి. ఆ గ్రామస్తులు అగస్త్యుడి గురించి ఏమి మాట్లాడతారనుకుంటున్నారు..? వారి తల్లిదండ్రులని పొగిడి, మీ కొడుకు ఒక గొప్ప సాధువు అవ్వబోతున్నాడని చెప్తారా..? లేదు. వారు, వారి తల్లిదండ్రులను హేళన చేస్తారు. “ఏడీ..? మీ మూర్ఖుడు ఎక్కడ ఉన్నాడు..? “అని అంటారు. ఒకవేళ ఎన్నో సంవత్సరాల తరువాత ఆయన తిరిగి వచ్చినప్పటికీ కూడా, ఆయన హిమాలయాలకు వెళ్లి ఆదియోగిని కలిసి వచ్చాడని వాళ్ళందరూ ఆయనను చూడడానికి ఉత్సాహం చూపిస్తారని అనుకుంటున్నారా..? లేదు. వారు ఆయనని చూసి నవ్వి ఉండి ఉండవచ్చు.
ఆయన ఒక చిన్న గోచీ గుడ్డతో ఒక మృగంలాగా కనిపిస్తూ తిరిగి వచ్చాడు కాబట్టి..!! ఈరోజున మనం ఇదంతా ఎంతో ఆశ్చర్య విభ్రమాలతో చూస్తూ ఉంటాం. కానీ, ఆయన కాలంలో ఇటువంటి వాటికి ఎటువంటి గుర్తింపు గానీ, ప్రశంసలు గానీ లేవు. ఎవ్వరూ ఆయన కోసం చప్పట్లు కొట్టలేదు. ప్రతీవాళ్ళూ కూడా, ఈయన ఒక మూర్ఖుడు, తల్లిదండ్రులను వదిలేసి, బాధ్యత లేకుండా వెళ్ళిపోయాడనుకున్నారు. ఇలాంటివి ఎన్నో ఉన్నప్పటికీ, వారు ఎప్పుడూ చెదరని దృష్టితో ఉన్నారు. ఇది అగస్త్యముని. ఒక విషయం ఏమిటంటే, ఒకసారి మీరు, ఒక దిశని ఎంచుకున్నాక, ఏమి జరిగినా అదేవిధంగా ఉండగలగాలి. ఆయన, అనుగ్రహంలో ఉండాలని ఎంచుకున్నారు. ఆయన ఎంచుకున్న, చేస్తున్న పనినుంచి ఎప్పుడూ ఆయన వెనుదిరగలేదు. అందుకని అగస్త్యముని లాగా ఉండాలంటే, మీరూ ఈ విధంగా మారాలి.