మీరు ఆనందాన్ని ఎలా చవిచూస్తారు అన్నది విషయం కాదు. ఆ క్షణంలో మీరు దాన్ని ఎలా అనుభవించినా, అది నిజమే. జనాలు ఆనందం దొరకేది కాదు అన్నప్పుడు, అది క్షణికమని, దాన్ని మీరు పట్టుకోలేరని, అది పడిపోతూ ఉంటుందని, అది శాశ్వతం కాదని వారి భావన. అందుకే వారు స్వర్గంలోని శాశ్వతానందం గురించి మాట్లాడతారు.

మీరు ఎప్పుడైనా గతం లేదా భవిష్యత్తులను అనుభవించారా? మీరు గతాన్ని గుర్తు చేసుకుంటారు, భవిష్యత్తుని ఊహించుకుంటారు, కానీ మీ జీవితానుభవం మాత్రం ఎప్పడూ ఈ క్షణంలో ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ క్షణంలో ఇక్కడ ఉన్నారు, రేపు మీరు ఈ క్షణంలోనే ఉంటారు, 100 సంవత్సరాల తరువాత మీరు కనుక ఇంకా ఉన్నట్లయితే, మీరు ఈ క్షణంలోనే ఉంటారు, ఒక మిలియన్ సంవత్సరాల తరువాత మీరు ఇంకా ఉన్నట్లయితే, అప్పటికీ మీరు ఈ క్షణంలోనే ఉంటారు.

కాబట్టి ఈ క్షణమే శాశ్వతం. బయటకు వెళ్ళే దారి కోసం చూడకండి. ఉన్నది ఒకటే దారి అదే "లోపలికి వెళ్ళే దారి”. ‘బయటపడటానికి మార్గం’ అంటూ ఏదీ లేదు. ఒకసారి మీరు జీవం పొందాక, బయటకి వెళ్ళే దారి లేదు. లోపలికి వెళ్ళే దారి మాత్రమే ఉంది. అందుకే సంఘర్షణ. జనాలు ఎప్పుడూ బయటకి వెళ్ళడానికి దారి వెతుక్కుంటారు, కానీ ‘బయటకి వెళ్ళడానికి దారి అంటూ ఏదీ లేదు. ఉన్నదల్లా కేవలం ”లోపలికి వెళ్ళే దారి” మాత్రమే.

మీరు ఎప్పుడూ తలుపులు తెరుచుకుని బయటకి వెళితే అదే స్వేచ్ఛ అనుకున్నారు, కానీ మీ లోపలికి తీసుకువెళ్ళే తలుపే స్వేచ్ఛకి దారితీస్తుందని అని మీరు తెలుసుకోలేక పోతున్నారు. అదే సంఘర్షణ, మనుషుల సంఘర్షణంతా అదే. వారు ఎప్పుడూ బయటకి వెళ్ళటానికి మార్గం కోసం ఆలోచిస్తున్నారు. బయటకి వెళ్ళటానికి మార్గం లేదు. మీరు ఆత్మహత్య చేసుకున్నా కూడా, జీవం నుండి బయటకు వెళ్ళే మార్గం లేదు. ఎందుకంటే మీ చుట్టూ మరో శరీరం తయారవుతుంది,  మరొక శరీరం, మరొక శరీరం, మరొక శరీరం..అలా శరీరాలు తయారవుతూ ఉంటాయి.

ఒక్క లోపలికి మాత్రమే దారి ఉంది. మీరు కనుక ఆ దారి కనుక్కోగలిగితే, బయట పడతారు. లోపలి ద్వారం నుండి బయటకు వెళ్ళటం అంటే ఇదే, మీకు అర్ధమవుతుందా? మీరు బయటి ద్వారం నుండి బయటకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే, అది ఎప్పటికీ సాధ్యం కాదు. బయటకి వెళ్ళడం కేవలం లోపలి ద్వారం నుండే సాధ్యమవుతుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.