ప్రశ్న: ప్రేమ, పెళ్లి అనేవి చాలా సందర్భాల్లో మనుషుల మధ్య ఎక్కువ ఘర్షణకు ఎందుకు దారితీస్తాయి?

సద్గురు: శారీరికంగా ‘పురుషుడు’, ‘స్త్రీ’ అన్నవి పరస్పరం అభిముఖమైనవి. ప్రకృతి మనల్ని ఈ విధంగా సృష్టించింది. పునరుత్పత్తి ప్రక్రియ సాగడానికీ, తరువాతి తరం ఉద్భవించడానికీ ఇది అవసరం. అటువంటి అవసరం లేకపోయినట్లయితే – ఆకాశం నుండి శిశువులు వర్షించేటట్లయితే – తరువాతి తరాల సృష్టికి స్త్రీ పురుషులు పని చేయవలసిన అవసరం లేదు. పునరుత్పత్తి ప్రక్రియ  అనివార్యమైనది కాకపోయినట్లయితే, ఎవరూ దానికోసం వెళ్లరు. మీ మెదడులోని జీవకణాలతో సహా, మీ శరీరంలోని ప్రతి జీవకణాన్నీ, హార్మోన్లు తమ నియంత్రణలోకి తీసికొని ఆ దిశగా నడిపిస్తాయి. దీన్ని అధిగమించడానికి మనిషికి ఎంతో మేధ కావాలి. లేకపోతే ఇదే జీవితంగా కనిపిస్తుంది – మీరలాగే అనుభూతి చెందేటట్లు చేస్తుంది. మీకు 10, 11 ఏళ్లు వచ్చేవరకు దాని గురించిన ఆలోచనే ఉండదు. అప్పటివరకు, ఇతరులు చేసే పనులు మీకు వింతగా ఉంటాయి. కాని అకస్మాత్తుగా ఈ కొత్త రసాయనం మీ శరీరాన్ని ఆక్రమించడం మొదలు పెట్టిన తరువాత, ఇదంతా మీకో వాస్తవమవుతుంది. తన లక్ష్యాలైన పునరుత్పత్తి, సృష్టి కొనసాగింపు, ప్రాణుల నిరంతర అస్తిత్వాల కోసం ప్రకృతి మీకు ఈ మందు పెడుతుంది, రసాయనిక మార్పులు తెస్తుంది. ఒకసారి ఇది జరిగిన తర్వాత స్త్రీ పురుషుల కలయిక అనివార్యం అవుతుంది. మరోవిధంగా చెప్పాలంటే ఒకసారి ఈ అనివార్యత ఏర్పడిన తర్వాత, సహజంగానే దాన్ని ఫలింపచేసుకునే దిశలో బుద్ధి పనిచేస్తుంది.

ఇచ్చి పుచ్చుకోవడమనే లెక్కలు

దురదృష్టవశాత్తు ఒకరినొకరు ఎలా ఉపయోగించుకోవాలా అనే ఉద్దేశంతోనే ప్రాథమికంగా అనుబంధాలు ఏర్పడుతున్నాయి. అన్నీ ఇచ్చిపుచ్చుకునే సంబంధాలే. ప్రతి రోజూ మీరు ఇలా ఇచ్చిపుచ్చుకొనే సంబంధంలో ఉన్నప్పుడు, మీలో ఒకరు ఎప్పుడూ ‘నేను ఎక్కువ ఇస్తున్నాను, అవతలి వ్యక్తి తక్కువగా ఇస్తున్నాడు’ అన్న  అనుభూతి చెందుతారు. సమాజాలు మీకు తెలివిగా ఉండడం నేర్పాయి - మీరు తక్కువ ఇవ్వాలి, ఎక్కువ పుచ్చుకోవాలి అని - స౦త  అయినా,  వివాహం అయినా అంతే- అదే లెక్క. ప్రేమ గురించి ఇంత మాట్లాడడం ఎందుకంటే, తద్వారా మీరు ఈ లెక్కను అధిగమించడం కోసం. మనోభావపరంగా మీరు ఒకరికి అధీనమైనప్పుడు, మీరీ లెక్కను అధిగమిస్తారు. అప్పుడు “నేనేం తీసుకుంటున్నానన్నది ముఖ్యం కాదు. నేనేమిస్తున్నానన్నది ముఖ్యం” అవుతుంది. ఈ స్థాయి భావావేశం ఉంటే సంబంధాలు అద్భుతంగా ఉంటాయి. ఒకసారి ఈ భావోద్వేగ తీవ్రత తగ్గిపోతే ఆ సంబంధం ఇచ్చి పుచ్చుకోవడాల సంబంధంగా మారుతుంది. మీకు మీ వ్యాపారంలో, ఇరుగు పొరుగుతో, మరెంతో మందితో ఇచ్చుపుచ్చుకొనే సంబంధంలో ఉంటారు, ఈ వ్యవహారాలు పరిమితంగా ఉంటాయి – కాని వైవాహిక సంబంధంలో ఇచ్చిపుచ్చుకోవడమనేది నిరంతర సంబంధం, మీరు ఈ వ్యక్తితో శాశ్వతంగా ఒక పంజరంలో బంధించబడి ఉంటారు. అందువల్ల సహజంగానే ఏదో ఒక రీతిలో మిమ్మల్ని మరొకరు ఉపయోగించుకుంటారు. అలా జరిగినప్పుడు ఘర్షణ, ఘర్షణ, ఘర్షణే ఏర్పడుతుంది. కేవలం ఆ ప్రేమ ఉన్న క్షణాల్లో మాత్రమే ఒక స్త్రీ, ఒక పురుషుడు నిజంగా కలిసి ఉంటారు. ఆ ప్రేమ లేకపోతే ఇది చాలా కష్టమవుతుంది. కలిసి జీవించడంలోని శారీరకపరమైన, భావోద్వేగపరమైన, అంశాలన్నీ ఘర్షణాత్మకమవుతాయి. ముఖ్యంగా శరీరం ఇందులో ముఖ్యపాత్ర వహిస్తుంది కాబట్టి ఎవరైనా తమను ఎదుటివ్యక్తి ఉపయోగించుకున్నట్లు భావించవచ్చు. అది కేవలం డబ్బు, లేదా ఇల్లు అయినట్లయితే దానికొక పరిష్కారముంటుంది. “సరే ఇంట్లో ఈ భాగం నువ్వు వాడుకో, ఆ భాగం నేను వాడుకుంటా” అనవచ్చు. “నువ్వు వంట చెయ్యి, నేను సంపాదిస్తా” అనవచ్చు. కాని ఇందులో శరీరం పాత్ర ఉంది కాబట్టి తనను వాడుకుంటున్నారన్న భావన కలగవచ్చు, అందువల్ల ఘర్షణ ఏర్పడుతుంది.

పరిష్కారం

ప్రశ్న: మరి దీనికి పరిష్కారం ఏమిటి?

సద్గురు: ఎప్పుడూ కేవలం ఒక స్త్రీగానో, పురుషుడిగానో ఉండడం మీరు మానేయాలి. మీ స్త్రీత్వాన్ని లేదా పురుషత్వాన్ని ఇరవైనాలుగ్గంటలూ భుజాన వేసుకొని తిరగనక్కరలేదు. కొన్ని పరిస్థితుల్లో, జీవితపు కొన్ని పార్శ్వాల్లో మాత్రమే స్త్రీగానో, పురుషుడిగానో వ్యవహరించ వలసిన అవసరం మీకు ఉంటుంది. తక్కిన సమయంలో మీరు అలా కావలసిన అవసరం లేదు. కాని మీరు ఎల్లప్పుడూ స్త్రీగానో, పురుషుడిగానో ఉండాలని సమాజాలు మీకు నేర్పుతున్నాయి. మీరు బట్టలు ధరించడం నుండి మీరు చేసే ప్రతి పనిలో – మిమ్మల్నొక ప్రత్యేక పద్ధతిలో శిక్షణనిచ్చి, ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం తయారు చేశారు. ఒకసారి మీరు ఇలా తయారయిన తర్వాత, ఇరవైనాలుగు గంటలూ మీరు స్త్రీ అవుతారు లేదా ఇరవైనాలుగు గంటలూ పురుషుడవుతారు – అదే సమస్య. కాని మీరు ఒక జీవిగా ఉండడం తెలుసుకుంటే సమస్య ఉండదు; స్త్రీగానో, పురుషుడిగానో ఉండవలసిన అవసరం మీకు ఏర్పడినప్పుడు మీరు మీ పాత్రను మెరుగ్గా పోషించవచ్చు. అందుకని ఆ సమయం కోసం ఆ పాత్రను భద్రపరచుకోండి. ఊరికే వీథుల వెంట దాన్ని ప్రదర్శించుకొని వృథా చేయకండి. ఒక జీవిగా నడవండి, ఉండండి చాలు. మీరిలా ఉంటే ఘర్షణే ఉండదు. హాయిగా ఉంటుంది. ఇద్దరు మనుషులు కలిసి జీవించగలరు. ‘స్త్రీ, పురుషుడు’ అనేవి రెండు నిర్బంధాలు. రెండు నిర్బంధాలు కలిసి జీవించలేవు. మీ లైంగికతతో మీరెంత ఎక్కువ గుర్తింపు ఏర్పరచుకుంటే, మీరంతగా నిర్బంధాలకు లోనవుతారు. మీరు నిర్బంధాలకు లోనై ఉంటే సహజంగానే చాలామంది మీద మీరు ఆధిక్యతను ప్రదర్శిస్తారు. వారి మీద ఆధిక్యత చూపిన కొద్దీ మీకు సమస్యలు వెల్లువెత్తుతాయి. మీరు మిమ్మల్ని మీ స్త్రీత్వంతోనో, పురుషత్వంతోనో అతిగా గుర్తించుకోకపోతే ఒక మనిషిగా నడిస్తే ఆ స్త్రీత్వం లేదా పురుషుత్వం మీ జీవితంలో చిన్న పాత్రనే పోషిస్తుంది. మీ జీవితం మొత్తం దాని చుట్టూనే నిర్మించుకోవలసిన అవసరం లేదు. మీ స్త్రీత్వం లేదా పురుషత్వంతో అతిగా గుర్తించుకోకపోయినట్లయితే మీ శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించుకొనే అవకాశం వస్తుంది. మీ ఊహకు కూడా అందనంతగా ఎంతో సృజనాత్మకంగా, ఎంతో సమర్థవంతంగా పనిచేయగలుగుతారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు