ప్రశ్న: ఎవరో బుద్ధుడిని ‘ఎందుకూ కొరగాని వేలాది మందితో మీరు ఎందుకు సమయం గడుపుతున్నారు? మీరొక ఆధ్యాత్మిక గురువు, సరైన దృష్టి ఉన్న వారితో మీరు సమయం గడపాలి కానీ, ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏమిటి?’ అని అడిగారు.

సద్గురు: ఆయన ‘వారందరూ బోధిసత్వులే. వారికి కూడా బుద్ధుడు కాగల సామర్ధ్యం ఉంది. వారొక అర్ధం లేని జీవితం గడుపుతున్నట్లు గోచరిస్తుంది కానీ, వారికి బుద్ధుడు కాగల సంభావ్యత ఉన్నది. బీజాన్ని సంరక్షించుకున్నట్లైతే, ఇక సరైన సారవంతమైన భూమి దొరకడమే ఆలస్యం. నా ప్రయత్నం అంతా వీరిలో ఉన్న ఆ సంభావ్యతా బీజానికి సారవంతమైన భూమి లభ్యమయ్యేలా చూడడమే. విత్తన్నాన్ని చూస్తే, అది ఒక  ప్రాణంలేని గులకరాయిలా కనిపిస్తుంది, కానీ అదే అందమైన పుష్పంగా వికసించగలదు. ఆధ్యాత్మికత అంటే ఈ బీజం దాని మూలాలను కనుక్కోవడమే. ఈ ప్రపంచంలో ఆధ్యాత్మికత అంటే ఎక్కువగా సాంఘిక అవగాహన ఆధారంగానే ఉన్నది, అందులో అస్థిత్వం చాలా చిన్న పాత్రను పోషిస్తుంది.

చాలా మందికి ఆధ్యాత్మికత అంటే తమ భగవంతుడి మీద విశ్వాసం ఉంచడం, పూజలు చేయడం, తమ సంప్రదాయాలను పాటించడం. కానీ మనం అందరమూ గుర్తించాల్సిన విషయం ఏమంటే ఈ రకమైన ఆధ్యాత్మిక ధోరణిలో పడడం వల్ల మనల్ని మనం పరిమితం చేసుకుంటున్నాం. మనం కేవలం ‘బ్రతుకుతున్నాం’, అంతేకాని ఎటువంటి ఉత్కృష్టతకు మనం అవకాశం ఇవ్వడం లేదు. జీవితం మీద ఉన్న ఇలాంటి సామజిక భావనల నుంచి బయటపడినప్పుడే మీకు ఆధ్యాత్మిక మార్గం గోచరిస్తుంది.

జీవించడం అంటే అది కాదు, తమ అంతరంగంలోని పిలుపును నొక్కి పెడుతున్నవారు ఒకరకంగా నిస్సార జీవితాన్ని గడుపుతున్నారు.

ఆధ్యాత్మికత అంటే ఒక సిద్ధాంతం కాదు, ఒక నమ్మకాలతో కూడిన వ్యవస్థ కాదు, మీరు ‘చేయగలిగిన’ పని కూడా కాదు. మీరు అలా అయిపోవాలి అంతే! అసలు అదే మీ సహజ స్వరూపం. కాని ఆధ్యాత్మికంగా ఉండడానికి మీకు భౌతికం కావలి. అందుకే జీవితం ఎంతో ముఖ్యమైంది. ఈ ఒక్క జీవిలోనే, జీవితంలోని నిర్బంధనలను దాటి వెళ్ళగల విచక్షణతను ఇస్తుంది. మరే ఇతర జీవికీ ఇలాంటి మేధోపరమైన విచక్షణ లేదు. ఇదో పెద్ద కానుక. మీరు దానిని ఇంకా ఉపయోగించి ఉండకపోవచ్చు. కానీ దాని సంభావ్యత మాత్రం అపారమైంది. ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే, పరమోన్నతమైనది చేరుకోవాలన్న ఆకాంక్ష అంటే, ఇప్పుడు మీరు చూడలేని దాని కోసం వెళ్ళడమే.

స్ధిరంగా ఉన్న భూమిని వదిలి ఆకాశాన్ని అందుకోవాలనే ఆకాంక్ష కొత్తదేమీ కాదు. అది మానవ హృదయంలో ఎపుడూ ఉప్పొంగుతూనే ఉంది. చాలా మంది దానిని నొక్కి పెట్టారు. జీవించడం అంటే అది కాదు, తమ అంతరంగంలోని పిలుపును నొక్కి పెడుతున్నవారు ఒకరకంగా నిస్సార జీవితాన్ని గడుపుతున్నారు. భౌతికత్వం అనేది ఈ అస్థిత్వంలో చాలా చిన్న భాగం కావడం వల్లనే, నిజంగా వారు జీవించలేకపోతున్నారు. జీవితంలో భౌతికత్వం అతి స్వల్పమైనది. మీ మనుగడ ఎంత ముఖ్యమైనదైనా - మీరు, మీరు నివసిస్తున్న గ్రహం, సౌరవ్యవస్థ, నక్షత్రాలు, పాలపుంతలు, అన్నీ ఈ అనంత విశ్వంలో అతి చిన్న నలుసులు మాత్రమే. అస్థిత్వాన్ని ప్రభావితం చేసేది భౌతికానికి అతీతమైనది.

మానవులు ఇంద్రియాల ద్వారానే తమ అనుభూతిని పొందుతారు. కానీ అవి మనుగడకు మాత్రమే పనికి వచ్చే సాధనాలు అని మరిచిపోతారు

మానవులు ఇంద్రియాల ద్వారానే తమ అనుభూతిని పొందుతారు. కానీ అవి మనుగడకు మాత్రమే పనికి వచ్చే సాధనాలు అని మరిచిపోతారు. ఈ ఇంద్రియాలే జీవితానికి పరమార్ధాలు అనుకుంటారు. అదే వారికి భౌతికత గురించి, జీవితం గురించి సరిగ్గా అవగాహన చేసుకోలెకుండా చేస్తుంది. నిజానికి చాలా మంది భౌతికమే జీవితం అన్నట్టు జీవిస్తారు. చాలా కొద్ది మంది మాత్రమే భౌతికత ముఖ్యమే అయినా అదే పరమార్ధం కాదు అని తెలుసుకుంటారు. భౌతికాతీతమైనది ఏదైనా మిమ్మల్ని బాధించినప్పుడు, మిమ్మల్ని కుదిపేసినప్పుడు, అది తీవ్రం అయినప్పుడు మాత్రమే భౌతికత్వం ఎంత అప్రధానమో గుర్తిస్తారు. మనందరికీ జీవితానికి సంబంధించి ఒక సామాజిక స్పృహ ఉంది. కానీ జీవితంలోని అస్తిత్వనికి చెందిన స్పృహను మనం కలిగి ఉండాలి, అపుడే ఆధ్యాత్మికత ఉన్నట్టు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

Pixabay