యోగాలో, జీవం మూడు స్ధాయిల్లో జరుగుతోంది అని మనం గుర్తిస్తాము. వాటిని మృగ, మనుష్య, దేవ - అంటే మృగ స్వభావం, మానవ స్వభావం, దివ్యత్వం అంటారు. మృగ స్వభావం బాగా స్థిరమైనది, దైవ స్వభావం కూడా బాగా  స్థిరమైనదే. మానవుని స్వభావమే స్థిరంగా లేదు. ఈ క్షణం మీరు దేవునిలా ఉండవచ్చు, మరు క్షణం మీరొక మృగంలా ఉండవచ్చు. నిజానికి, మీరు రెండింటి మధ్యా ఊగిసలాడుతున్నారు. ఒక్కోసారి మీరు దీనికి దగ్గరగానూ, మరోసారి దానికి దగ్గరగానూ ఉంటారు. అవును కదా? మిమల్ని మీరు గమనించండి, 24 గం. లలో మీరెన్ని సార్లు రెండిటి మధ్యా ఊగిసలాడుతున్నారో. ఒక క్షణం మీరు అద్భుతంగా ఉంటారు, మరు క్షణం ఘోరంగా ఉంటారు, ఉత్తర క్షణం అందంగానూ, మరుక్షణం వికారంగానూ ఉంటారు. ఫలానా లక్షణం, మానవ లక్షణం అని మీరు దేనినీ అనలేరు.

మీరు బంధనాల వల్ల బాధపడుతుంటే, ఫరవాలేదు. కాని మీరు మీ స్వేచ్ఛ వల్ల బాధపడుతున్నారు.

మానవత్వం అనేది స్థిరమైనది కాదు. ఎలా కావాలనుకుంటే అలా ఉండచ్చు. మరే జంతువుకూ ఈ స్వాతంత్ర్యం లేదు. ఇన్నాళ్ళూ ఒక జంతు స్వభావంగా ఉన్నది, ఇప్పుడు నిర్బంధంలేని స్ధితిలోకి పరిణామం చెందింది. అది ఏది కావాలంటే అది కావచ్చు. అదే దానికున్న స్వేచ్ఛ. ఇప్పుడు మానవుడు బాధపడేది కూడా ఈ స్వేచ్ఛ వల్లనే. మనుషులను ఇప్పుడు బాధిస్తున్నది వారి బంధనాలు కాదు, వారి స్వేచ్ఛనే. మీరు బంధనాల వల్ల బాధపడుతుంటే, ఫరవాలేదు. కాని మీరు మీ స్వేచ్ఛ వల్ల బాధపడుతున్నారు. మీ జీవితం జంతు స్వభావంలా నిర్దేశించబడి ఉంటే, మీరు అంతగా బాధపడేవారు కాదు, అవునా? మీరు సహజంగా ఉన్నతమైనదే కోరుకుంటారని, అధమమైనది కాదని, ప్రకృతి మీ తెలివి మీద ఉన్న నమ్మకంతో మీకా స్వేచ్ఛనిచ్చింది. కాని, ప్రస్తుతం మనుషులు మాత్రం ‘అది నిజం కాదు’ అని నిర్ధారణ చేయడానికి పూనుకున్నట్లున్నారు.

అందుకనే, మీకున్న ఈ రకమైన అస్ధిరత వల్లనే ఆధ్యాత్మిక ప్రక్రియ గురించిన మాటలు వినబడుతున్నాయి. మిగతా జీవుల్లాగా మీకు కూడా మూస పోసినట్లుగా జీవితం ఉన్నట్లైతే, మీ ఆధ్యాత్మిక ప్రక్రియ గురించి మాట్లాడేవారం కాదు. మీరు సుముఖంగా ఉంటే ఈ క్షణం మిమ్మల్ని మీరు ఆనందమైన, ఆహ్లాదకరమైన మనిషిగా చేసుకోవచ్చు. అదే విధంగా ఈ క్షణంలో మిమ్మల్ని మీరు ఏదో విషాదంలోనో, మరోదాంట్లానో ముంచుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆధ్యాత్మిక ప్రక్రియ అని పిలిచేది, ఈ నిర్భంధ జీవితాన్నుండి చైతన్యవంతమైన జీవితంలోకి పరిణామం చెందే ప్రక్రియ. మీ జీవితంలోని ప్రతి అంశము, జీవించడం నుంచి, పుట్టడం నుంచి, బ్రతకడం, మరణించడం దాకా, అసలు మీరు పుట్టాలనుకుంటున్న గర్భం ఎంచుకోవడంతో సహా అన్నీ చైతన్య స్ధితిలో ఎంచుకునే విధంగా చేయడమే. జీవన్మరణాలు, ఒక చైతన్య ప్రక్రియగా చేసుకోవడం. దానినే ఆధ్యాత్మిక ప్రక్రియ అంటారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

Flickr