మాంసపు ముద్దని దివ్య శక్తిగా మలచుకొనేదెలా?

mamsapu-muddani-divyashaktiga-malachukondi-telugu

యోగా పరిభాషలో శరీరమే దైవంగా భావించబడుతుందని సద్గురు చెబుతారు. చేసే ప్రతీ పనీ యాధాలాపంగా కాకుండా, పూర్తి స్పృహతో చేయడం ద్వారాసాదాసీదా అనుకొనే శరీరాన్ని దైవ శక్తిగా మార్చుకోగల ఒక అద్భుత అవకాశాన్ని గురించి ఆయన వివరిస్తున్నారు.

మన ప్రమేయం లేకుండా మనలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని ఎరుకతో చెయ్యడమనేది యోగాలోని ఒక అంశం. శ్వాస, గుండె కొట్టుకోవడం, జీర్ణక్రియ అన్నీ కూడా అసంకల్పితంగానే జరుగుతున్నాయి. ప్రకృతికి మీ మీద అంత నమ్మకం లేదు కాబట్టి, జీవ వ్యవస్థకి కీలకమైనవన్నీ కూడా అలాగే జరిగేట్లు ప్రకృతి ఏర్పాటు చేసింది. ఒకవేళ జీవనాధారమైన అవయవాలను గనుక మీరు ఎరుకతో నియంత్రించవలసి వస్తే, మీకు తోచినట్లు ఏవో వెర్రి పోకడలకు పోయేవారు.?

మనోవైకల్యం ఉన్న వాళ్ళని మీరు చూసే ఉంటారు. వారి కాళ్ళూ చేతులు కూడా వారి అధీనంలో లేకుండా ఇష్టం వచ్చినట్లు కదిలిస్తూ ఉంటారు. ఈ తరం యువతలో ఈ ప్రక్రియ ఎక్కువగా గమనించవచ్చు. వారి అనుమతి లేకుండానే వారి శరీర భాగాలు కదలిపోతూ ఉంటాయి.

ఎప్పుడైతే జాగురూకులై మెలగడం మొదలుపెడతారో అప్పుడు ఈ అసంకల్పిత చర్యలు కూడా మీ ఆధీనంలోకి రావడం మొదలౌతాయి. అంటే, మీలో చైతన్యం పెరుగుతున్న కొద్దీ ప్రకృతికి మీపై నమ్మకం పెరుగుతుందన్నమాట. “ ఈ వ్యక్తి తగినంత చైతన్యం కలవాడే, ఇతనికి మరింత బాధ్యతనివ్వచ్చు” అని ప్రకృతి అనుకుంటుంది. ఒకరు ఈ స్థితికి చేరగలిగితే ఆయా వ్యవస్థలను వారికి అనుగుణంగా జరుపుకొనే స్వేచ్చ కలుగుతుంది.

“నిర్బంధం” నుండి “స్వచ్ఛందం” వైపుకి

అప్రమేయంగా, అసంకల్పితంగా జరిగే చర్యలు నిస్సహాయతను సూచిస్తాయి. మీ శరీరం, ముఖ్యంగా మీ మనస్సు వీలున్నంతవరకు స్వచ్ఛందంగా పని చెయ్యాలి. అప్పుడే జీవితం రూపుదిద్దుకుంటుంది. నిర్బంధ బ్రతుకు నుండి స్వచ్ఛంద జివితానికి ప్రయాణం మొదలౌతుంది.

మీరు స్వచ్ఛంద సేవకులేనా? స్వచ్ఛంద సేవ అంటే ఇదే! చేసే ప్రతీ పనీ ఇష్టపూర్వకంగా, ఎరుకతో చెయ్యడం. ఇలాగే ఉండాలి, ఇలాగే చెయ్యాలి అనే నిర్బంధం ఎక్కడా లేకుండా, ఏది ఎంత అవసరమో దాన్ని అంతే చెయ్యడం. జీవితంలో ప్రతీ అంశాన్ని – అది ప్రాపంచికం కావొచ్చు, అంతరంగం కావొచ్చు, అది ఎంత వరకు అవసరమో, అంతవరకే చేయడం. ఈ విధంగా అవసరమైనంత మేరకు చేస్తేనే ప్రయోజనకరమైన చర్య అవుతుంది.. అలా కానిదేదైనా నిష్ఫలమే !!

వృధా కార్యకలాపాలతో మెదడు అంతా నింపుకొని ఉండటంతో సహజంగా జరుగుతున్న ప్రక్రియలను ఏ మాత్రం గుర్తించలేకపోతున్నారు.

ఉదాహరణకి, నేను ఒక పర్వతం ఎక్కుతున్నా ననుకుందాం. అప్పుడు గుండె ఒక విధంగా కొట్టుకోవాల్సి  ఉంటుంది. విశ్రాంతిగా కూర్చున్నప్పుడు ఇంకోలాగా కొట్టుకోవడం అవసరం. అలా కాకుండా ఏ పనీ చెయ్యకుండా విశ్రాంతిగా కూర్చున్నప్పుడు కూడా పర్వతం ఎక్కుతున్నప్పటిలా గుండె తీవ్రంగానే కొట్టుకుంటే అదంతా వృధా. ఎప్పుడైతే మీరు మెదడులో హృదయస్పందనలో, శరీర కదలికల్లో ఇంకా అన్నిటిల్లోను అనవసరపు కార్యకలాపాలు చేయడం మొదలు పెడతారో అప్పుడు మనిషిగా ఎందుకూ పనికిరాని జన్మగా తయారౌతుంది.

వృధా కార్యకలాపాలతో మెదడు అంతా నింపుకొని ఉండటంతో సహజంగా జరుగుతున్న ప్రక్రియలను ఏ మాత్రం గుర్తించలేకపోతున్నారు. దీంతో చాలా మట్టుకు అప్రయత్నంగానే జరుగుతున్నాయి. లోలోపల జరగుతున్న విషయాలను గ్రహించలేకపోతే అసలు యోగా అనేదే లేదు. మొత్తంగా ఈ యోగా అంతా కూడా మనిషి అంతర్ముఖుడై అక్కడ జరిగే ప్రతీ ప్రక్రియనీ క్షుణ్ణంగా పరిశీలించి గ్రహించినదే తప్ప, ఆకాశం నుండి ఊడిపడిన శాస్త్రమో, మత గ్రంథంలో బోధించినదో కాదు.

అవయవాలకే రారాజు – “అంగరాజు”

యోగ సంప్రదాయంలో మన దేహం కూడా దివ్యత్వం కలిగినదే. శివునిలోని ఒక తత్త్వం బట్టి ఆయనను “అంగరాజ” అని కూడా అంటారు. “అంగం” అంటే అవయవం, శరీరంలో భాగం అని అర్థం. అంగరాజు అంటే అన్ని శరీర భాగాలపై ఆధిపత్యం ఉన్నవాడు అని అర్థం. శరీర అవయవాలపై పట్టు సాధించే “అంగమర్దన”  ప్రక్రియను మీరు సాధన చేస్తూ ఉండి ఉండవచ్చు. శివుడు అలాంటి పట్టు సాధించబట్టే ఆయన శరీరంలో అణువణువూ దివ్యంగా మారి దైవత్వంతో నిండి ఉన్నాయి. పైన చెప్పుకున్నట్లు ఎప్పుడైతే శరీరం నిర్బంధం నుండి బయటపడి, పూర్తిగా చైతన్యంతో(ఎరుకతో) పని చేస్తుందో, ఎప్పుడైతే శరీరం కూడా సంపూర్ణ చైతన్యంతో ఉంటుందో అప్పుడు శరీరమంతా దైవత్వంతో తొణికిసలాడుతూ ఉంటుంది. శివుడిని అంగరాజు అనడంలో ఆంతర్యం కూడా ఇదే! మన అవయవాలు కేవలం రక్తమూ, మాంసముతో నిండిన జడపదార్థాలు గానూ ఉండవచ్చు లేదా అవి అఖండ చైతన్యంతో నిండి దివ్య దేహంగానూ పరిణామం చెందవచ్చు. కేవలం ఒక మాంసపు ముద్దను దైవంగా మలచే శాస్త్రం ఇది.

ఇది దేవతా మూర్తులను తయారుచేసుకొనే శాస్త్రం. ఒక యంత్రం కానీ, రూపం కానీ తయారుచేసి, శక్తిమంతం చేస్తే ఒక శిల కూడ దివ్య శక్తిగా మారుతుంది. ఒక శిలనే దివ్య శక్తిగా మార్చుకోగలిగినప్పుడు శరీరాన్ని దివ్య శక్తిగా మలచలేమా? అది తప్పకుండా చెయ్యొచ్చు.

ప్రేమాశీస్సులతో,
సద్గురుఅనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *