ఈ విశ్వం ఉండడానికి కారణం ఏమిటి? ఇది ఒక పద్దతి ప్రకారం జరుగుతోందా లేక అడ్డదిడ్డంగా ఏర్పడిందా? ఇందులో మనమందరం పాత్రదారులమా లేక మనం కూడా ఆటని ఆడగలమా అన్న ప్రశ్నకు సద్గురు సమాధానం ఇస్తున్నారు..

ప్రశ్న: "సద్గురు, నేనొక నటుడను, రచయితను. ఈ విశ్వం ఏర్పడడానికి రూపకల్పన ఏదైనా ఉందా, లేక అడ్డదిడ్డంగా ఏర్పడిందా? ఇందులో మనం పాత్రధారులమా, లేక తోలు బొమ్మలమా? అన్న విషయం తెలుసుకోవాలని ఉంది"

సద్గురు: దీన్నే ఇంకోరకంగా చెప్పాలంటే ..."జీవితంలో నా దశ, దిశ నేనే నిర్ణయించుకోగలనా? లేక ఎవరో, ఎక్కడినుండో నిర్ణయిస్తున్నారా? మీరు ఈ ఆటలో అటూ, ఇటూ విసరబడే బంతా? లేక బంతిని తన్నే ఆటగాడా" అని అడుగుతున్నారు. ఈ భూప్రపంచం మొత్తంలో 'నీ జీవితం అంతా నీ కర్మ ఫలమే' అని చెప్పే ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి. అంటే మీరు చేసే పనుల ప్రతిఫలాన్ని బట్టి మీ జీవితం రూపుదిద్దుకుంటూ ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా జీవనం సాగించే పద్ధతి. అలాంటిది, 'అంతా నా కర్మ!' అంటూ ఎవరో తలరాత వ్రాసినట్లుగా అర్థాన్ని తప్పుదోవ పట్టించడం దురదృష్టకరం.

కర్మ అంటే 'చర్య ' - మీరు చేసే పని. ఇక్కడే కూర్చొనే మీరు రకరకాల పనులు చేస్తున్నారు. రోజుకి 24 గంటలూ శారీరకంగా, మానసికంగా, భావ పరంగా, ప్రాణశక్తి పరంగా ఏదో ఒక చర్య జరుగుతూనే ఉంటుంది. మీకు ఎరుక ఉన్నా లేకున్నా, జాగురూకులై ఉన్నా నిద్రావస్థలో ఉన్నా ఈ నాలుగు విధములైన కర్మలు చేస్తూనే ఉంటారు.

కుండలినిని మీరు ప్రజ్వలించగలిగితే, అది జీవితానికి ఉన్నతమైన ప్రమాణాలను చూడగల అవకాశాలకు ద్వారం తెరుస్తుంది.

ప్రొద్దున నిద్ర లేచినప్పటి నుండి ఇప్పటివరకు మీరు శారీరక కర్మ, మానసిక కర్మ, భావపరమైన కర్మ, ప్రాణశక్తికి సంబంధించిన కర్మ చేసారు. ఇన్నింటిలో ఎంతవరకు మీ ఎరుకలో ఉండి ఉండవచ్చు? చాలామందికి ఒక్క శాతం కన్నా తక్కువే వారి ఎరుకలో ఉంటుంది. మిగతా 99% కి మించి ఎరుక లేకుండా చేసేస్తున్నవే. మరి అలాంటప్పుడు మీ జీవితాన్ని ఎవరో నడుపుతున్నట్లుగా అనిపించడం సహజమే కదా?!

ఒకవేళ, మీరు చేసే పనుల్లో కనీసం 2 నుంచి 5 శాతం వరకు ఎరుకతో చేయగలిగితే - ఒక్కసారిగా మీకో అధికారం అందినట్లుగా అనిపిస్తుంది, మీ చుట్టూ ఉన్నవాళ్ళేమో మిమ్మల్ని దివ్య పురుషులుగా చూడటం మొదలుపెడతారు. ఇదంతా కేవలం మీకై జరుగుతున్న విషయాల్లో, మీ ద్వారా జరుగుతున్న విషయాల్లో ఎరుక కలిగి ఉండటం వల్లనే. ఆ స్థితికి చేరినప్పుడు - 'మీ జీవితం అంతా మీరు చేసిన కర్మఫలమే' అన్న మాటకి అర్థం పూర్తిగా అవగతం అవుతుంది. "నీ కర్మ!" అన్నప్పుడు, 'నీవు అనుభవిస్తున్నదంతా నీవు చేసుకున్న చర్యల ప్రతిఫలమే' అని చెప్పుతున్నాం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు