పాము – కుండలిని రహస్యం

kundalini-pamu-rahasyam

మన సంప్రదాయంలో పాముని ఒక దేవతగా గుర్తిస్తారు. ఎటువంటి గుళ్ళలో అయినా సరే, పాముల విగ్రహాలు ఉంటాయి. ఇంతకి ఈ పాముకి, ఆధ్యాత్మిక ప్రక్రియకి ఉన్న సంబంధమేమిటి, ఎందుకు ఈ చిహ్నాన్ని వాడతారు అన్న ప్రశ్నకు సద్గురు సమాధానం చెబుతున్నారు.

“కుండలిని” అన్న మాటకి “శక్తి” అని అర్థం. అది మనిషిలో అంతర్లీనంగా ఉంటూ బయటకి కనిపించకుండా ఉండే శక్తి. యోగ సంప్రదాయంలో ఈ కుండలిని ఎప్పుడూ చుట్టచుట్టుకుని ఉన్న నాగుపాముకు ప్రతీకగా సూచిస్తారు.

చుట్టచుట్టుకుని ఉన్న నాగుపాముకి చాలా ఉన్నత స్థాయిలో నిశ్శబ్దం యొక్క శక్తి తెలుసు. పాము కదలకుండా పడుకున్నప్పుడు అది ఎంత నిశ్చలంగా ఉంటుందంటే, అది మీదారిలో ఉన్నా దాన్ని మీరు గుర్తించలేరు. అది కదిలినప్పుడే మీరు దాన్ని గమనించగలరు. కానీ ఈ చుట్టలు చుట్టుకున్న పాములు, లోపల నిద్రాణంగా ఉన్నా కూడా చలనశీలతని కలిగి ఉంటాయి. కుండలిని చుట్టలుచుట్టుకున్న నాగుపాముగా ఎందుకు సూచిస్తారంటే, ప్రతి వ్యక్తిలోనూ అనంతమైన శక్తి నిద్రాణంగా ఉంది, అది ప్రత్యక్షంగా కనిపించదు, అది కదిలితేనే తప్ప అసలు ఉన్నట్టు కూడా మనం ఊహించలేనట్టు ఉంటుంది.

మీ శక్తులన్నీ నిశ్చలంగా ఉంటే, పాములు మీ వైపు ఆకర్షింపబడతాయి

మీరు పరిపూర్ణమైన భౌతిక జీవితం జీవించాలంటే, మీకు మీ శరీరానికున్న శక్తిలో ఒక లేశము సరిపోతుంది. మీకు ఈ భౌతిక సరిహద్దులు దాటాలనుకుంటేనే మీకు అఖండమైన శక్తి అవసరం పడుతుంది. అది మిమ్మల్ని ప్రస్తుత వాస్తవంలోంచి బయటకు తీసుకుపోతుంది. అది విమాన ప్రయాణానికీ, రాకెట్ ప్రయోగానికీ మధ్య ఉన్న తేడా లాంటిది. వాతావరణం పరిధిలోనే ప్రయాణించడం ఒక ఎత్తు, వాతావరణ సరిహద్దుని ఛేదించుకుని, గురుత్వాకర్షణ పరిధిని దాటి వెళ్ళడం ఒక ఎత్తు. ఆ విధంగానే, శరీరం పరిమితులని దాటి వెళ్ళాలంటే, మరో ప్రమాణానికి చెందిన శక్తి ఆవశ్యకం అవుతుంది.

భారతదేశంలో పాము చిహ్నం లేని గుడి ఉండదు. దానికి కారణం ఈ సంస్కృతి పాముల్ని పూజిస్తుందని కాదు. ప్రస్ఫుటం కాకుండా మీలో దాగున్న శక్తిని మేల్కొలుపుతుందని చెప్పడానికి సంకేతమే ఆ పవిత్ర స్థలం. పాములు చాలా విశేష దృష్టిగలవి. (దానికి ఒక కారణం అవి వినలేవు. కేవలం ప్రకంపనలను మాత్రమే గ్రహించచగలవు.) పాములు ధ్యాన నిమగ్నమైన వ్యక్తివైపు ఆకర్షించబడతాయి. మన సంప్రదాయంలో, యోగులెక్కడైనా ఒకచోట కూర్చుని ధ్యానం చేస్తే,  అతనికి దగ్గరలోనే ఒక పాము ఉంటుంది. మీ శక్తులన్నీ నిశ్చలంగా ఉంటే, పాములు మీ వైపు ఆకర్షింపబడతాయి.

కుండలినిని మీరు ప్రజ్వలించగలిగితే, అది జీవితానికి ఉన్నతమైన ప్రమాణాలను చూడగల అవకాశాలకు ద్వారం తెరుస్తుంది.

పాముకీ, మనిషికీ భౌతికంగా ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ, శక్తి వ్యవస్థకి సంబంధించినంత వరకు ఇద్దరికీ సామ్యం ఉంది. మీకు అడవిలో ఒక నాగుపాము ఎదురైతే, అది మీ చేతుల్లోకి ఏ ప్రతిఘటనా లేకుండా రావడం గమనిస్తారు. ఎందుకంటే దాని శక్తులూ, మీ శక్తులూ ఒకదానితో ఒకటి సరిపోలి ఉంటాయి కనుక. ఒక వేళ మీ శరీర రసాయనకత ఏ మాత్రమైనా భయాన్ని సంకేతిస్తేనే, అది దాన్ని ప్రమాద హెచ్చరికగా గుర్తిస్తుంది గనుక కాటేస్తుంది. లేకపోతే అది దాని విషాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడదు. అదే దాని సంపద. ఆధునిక వైద్యం నాగుపాము విషంలో ఉన్న ఔషధ తత్త్వాన్ని బహువిధాల గుర్తించింది.

కుండలినిని మీరు ప్రజ్వలించగలిగితే, అది జీవితానికి ఉన్నతమైన ప్రమాణాలను చూడగల అవకాశాలకు ద్వారం తెరుస్తుంది. సంప్రదాయ సిద్ధమైన ఆదియోగి శివుని విగ్రహాలు, ఆయనతొ పాటు పాముని చూపిస్తాయి. అది ఆయన దృష్టి అత్యంత ఉన్నత స్థాయిలో ఉండడాన్ని సూచిస్తుంది. శక్తి తీవ్రత ఒక స్థాయికీ, పరిమాణానికీ చేరుకుంటేనే, సత్యాన్ని ఏ దోషం లేకుండా గ్రహిస్తారు. అలా లేనపుడు, మనకున్న కర్మ సంబంధమైన వాసనలు (అవి కొన్ని కోట్ల సంవత్సరాల క్రిందట ఏక కణ జీవులుగా ప్రారంభమైన నాటినుండీ మనకు సంక్రమించినవి) మనం వాస్తవాన్ని పరిశీలించడంలో, అవగాహన చేసుకోవడంలో అడ్డుగా నిలబడతాయి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు
Free Grunge Textures – www.freestock.ca @ flickr అనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *