“భారతీయ నదుల పునరుద్ధరీకరణ” ముసాయిదా – మూల సూత్రాలు

rivers-of-india-draft-policy

నెలరోజులుగా సాగిన “నదుల సంరక్షణ” అనే ఉద్యమం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం పూర్తి చేసుకొని, ఒక సమగ్ర కార్యాచరణ పథకానికి రూపకల్పన చేస్తూ “భారతీయ నదుల పునరుద్ధరీకరణ” అనే ముసాయిదాని ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరిగింది. ఈ బహుముఖ, బహువిధ ప్రతిపాదన ఏ విధంగా నదులకు దోహదపడుతుందో తెలుసుకోగోరే ఔత్సాహికుల కోసం ఇందులోని ముఖ్యాంశాలని క్రమంగా అందిస్తున్నాము. ఈ ముసాయిదాలోని ప్రాథమిక అంశాలని, ప్రతిపాదించబడిన పరిష్కార ప్రణాళికలోని ముఖ్యాంశాలని పరిచయంచేయడం జరుగుతుంది.

ఈ దేశంలో తరతరాలుగా అనుభవపూర్వకంగా ఆర్జించిన జ్ఞానాన్ని అనుసరించి ఆచార వ్యవహారాలు ఏర్పరచుకున్నారు. ఆ ప్రకారంగానే నదులను సజీవమైనవిగా పరిగణించేవారు.  కానీ ప్రస్తుత కాలంలో నదులతో భక్తిపూర్వకంగా మెలిగే ఆచారానికి చెదలు పట్టింది. ఒడ్డు మీద పూజాదికాలు నిర్వహిస్తూనే మరో పక్క నుండి వ్యర్ధ పదార్థాలను అదే నదిలో కలిపేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలతో అనాదిగా మన పూర్వీకులు నదులతో ఏర్పరచుకొన్న అవినాభావ సంబంధాన్ని తుంగలో తొక్కేస్తున్నాం.

మన నదులు నిర్జీవమౌతున్నాయి.  దాదాపుగా అన్ని నదుల్లో నీటిమట్టం ఏటా తగ్గుతూ రావడం ఆందోళనకరంగా ఉంది. వచ్చే 10-15 సంవత్సరాలలో జీవనదులన్నీ పరిమితకాల నదులుగా మారే ప్రమాదం ఉంది. తక్షణమే తగు చర్యలు తీసుకోకపోయినట్లైతే, 130 కోట్ల ప్రజలకి సరిపడినంత నీరు లేదు అన్న ఒకే ఒక్క కారణంగా దేశవ్యాప్తంగా తీవ్రమైన అంతఃకలహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

మన నదులన్నీ తిరిగి పూర్వ వైభవాన్ని పొంది పూర్తి స్థాయిలో ప్రవహిస్తూనే ఉండాలంటే, నదులు ఎందుకు ఎండిపొతున్నాయి అన్నదానిమీద సమగ్ర అవగాహన పెంచుకోవడం మరియు పరిష్కార మార్గాలకై ప్రతి ఒక్కరూ కలిసి పనిచెయ్యడం చాలా అవసరం. చాలావరకు మన నదులు అడవుల మీద ఆధారపడి ఉన్న కారణంగా నదులని కాపాడుకోవాలంటే అడవులని కాపాడుకోవడం ఒక్కటే మనకున్న మార్గం. సామాన్య ప్రజల్లో దీనిపై ఒక అవగాహన, చైతన్యం కోసమే సద్గురు జగ్గీ వాసుదేవ్ గారు “నదుల రక్షణ ” అనే ప్రచార కార్యక్రమాన్ని దేశమంతటా నడిపించారు. దేశ పౌరులందరూ ఒక్కటై తమ దృఢ సంకల్పాన్ని చాటుతూ మద్దతు తెలిపినప్పుడే 20-25 సంవత్సరాల దీర్ఘకాలిక ప్రణాళికను సమర్ధవంతంగా ఆచరించే వీలు ఏర్పడుతుంది. ఇప్పుడు కనుక మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టకపోయినట్లైతే మున్ముందు దీనికోసం ఎన్నో రెట్లు అధిక వ్యయ ప్రయాసలను ఓర్చుకోవాల్సి వస్తుంది. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి వివిధ రాజకీయ నేపధ్యాలుగల 16 రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏకపక్షమై నదుల రక్షణకై మద్దతు ప్రకటించడం చూస్తే సమస్య ఎంత గంభీర స్థితికి చేరుకుందో మనకు అర్థం అవుతుంది.

నదులకి ఇరువైపులా చెట్లను నాటించాలి అనే మూల సూత్రాన్ని ఆధారం చేసుకొని పరిష్కార పథకాన్ని ప్రతిపాదించడం ఈ ముసాయిదాలోని ముఖ్యమైన విషయం. నదీ పరివాహక ప్రాంతాల్లో రెండు ప్రక్కలా కనీసం 1 కి.మీ విస్తరణలో ఉన్న ప్రభుత్వ భూములన్నీ స్థానిక వృక్ష జాతులతో అటవీ ప్రాంతాలుగా తీర్చిదిద్దాలి. అలాగే సాగుభూములు ఉన్నట్లైతే బహుళస్థాయి వృక్ష-ఆధారిత వ్యవసాయాన్ని మాత్రమే అనుసరించాలి. భూగర్భజలాలు, అడవులు, సహజ వనరులు, పశువులు, మట్టి, తోటలు, సూక్ష్మ-నీటిపారుదల తదితర శాఖల నుండి నిపుణులు, రైతు మరియు వ్యవసాయ సంబంధిత ఆర్థిక, వాణిజ్య, వ్యాపార సంఘాల నుండి నాయకులు, ఆయా మంత్రిత్వ, ప్రభుత్వ శాఖల నుండి  ఉన్నతాధికారులు, ఆరోగ్య, పోషణ, ఆహార భద్రతా ప్రమాణాల అధికారులు కూడా ఈ ప్రతిపాదనలోని సాంకేతికతకు ఆమోద ముద్ర వేశారు. వీరందరి సమీక్షణలో వెలువడిన వివరాలన్నింటినీ కూడా ముసాయిదా తుది ప్రతిలో పొందుపరచడం జరిగింది. క్లుప్తంగా చెప్పాలంటే, అన్ని రంగాల వారూ, అన్ని స్థాయిల్లోని అధికారులూ చెట్ల పెంపకంతోనే నదుల పునరుధ్ధరీకరణ సాధ్యమని ఏకీభవించారు.

సాంకేతికతనే కాకుండా వాస్తవికతను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ ముసాయిదాలో నదులను పరిరక్షించుకోడానికి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, క్షేత్ర స్థాయిలో అవసరమయ్యే విధి-విధానాలను – వాటిని వివిధ కార్యక్రమాలుగా ఎలా అమలు జరపవచ్చో వివరిస్తూ ఒక కార్యాచరణ పథకానికి రూపకల్పన చేయడం జరిగింది.

ఈ ముసాయిదా, అనుబంధిత ఉపభాగాలతో సహా నాలుగు అధ్యాయాలుగా ఉంటుంది.

1వ అధ్యాయం – నదుల ప్రస్తుత పరిస్థితిపై నివేదిక, సమస్యావలోకనం

2వ అధ్యాయం – పరిష్కార ప్రతిపాదన, సాంకేతిక అధ్యయనం

3వ అధ్యాయం – ప్రభుత్వ మరియు ఇతర సాగు భూముల్లో చెట్లు పెంచడానికి ఒక ఆర్థిక ప్రణాళిక

4వ అధ్యాయం – సాంకేతిక, ఆర్థిక, వాస్తవిక, నియంత్రణకు అనుగుణమైన కార్యాచరణ పథకం
అనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *