కర్మ అంటే ఏంటో, దానికి మూలం ఏంటో, మన జీవన విధానం ద్వారానే కర్మను ఎలా కరిగించుకోవచ్చో సద్గురు వివరిస్తున్నారు.

మీరు ఏమి చేసినా, చేయకపోయినా కర్మ అనేది మీ జీవితంలోని ప్రతి క్షణం కరిగిపోతూనే ఉంటుంది. అసలు జీవన ప్రక్రియ అంటేనే కర్మ కరిగిపోవడం. మీకు కొంత కర్మ కేటాయించబడి ఉంటుంది. దాన్నే ప్రారబ్ధ కర్మ అంటారు. ప్రారబ్ధం క్రమంగా దాన్ని అదే తొలగించుకుంటుంది. కాని సమస్య ఏమిటంటే మీలో ఉన్న కర్మను ఉత్పత్తి చేసే కర్మాగారం అవసరానికి మించి పనిచేస్తూ కొత్త కర్మను ఉత్పత్తి చేసి వేగంగా రాశిపోస్తూ ఉంటుంది. కరిగిపోవడమన్నది ఎప్పుడూ ఒక నిర్దిష్ట వేగంలో జరుగుతుంది. కాని మనుషులు కర్మను ఉత్పత్తి చేయడంలో సిద్ధహస్తులు. ఉదాహరణకు మీరు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకూ చేసే పనికంటే మీరు ఆలోచించేది యాభైరెట్లు ఉంటుంది. యాభై అనడంలో పోగొట్టుకుంటున్న కర్మకంటే సంపాదించుకుంటున్న కర్మ యాభైరెట్లు ఎక్కువన్నమాట. ఇది కాలరీల(Calorie) వంటిది. ఆరువేల కాలరీల ఆహారం తిని ఆరువందల కాలరీలు కరిగిస్తే తక్కిన కాలరీలు ఎక్కడో ఒక చోట పేరుకు పోవలసిందే కదా!

మీ కర్మ కర్మాగారాన్ని మూసివేయండి

సరే, మీరే కర్మా చేయరనుకుందాం - నిష్కర్మ - ఊరికే కూర్చుంటారు. అంటే కర్మ తన వేగంలో తను పనిచేస్తూనే ఉంటుంది. కాని మరింత ఉత్పత్తి కాదు. అందుకే ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పరిచేటప్పుడు మీరు ఎప్పుడు తినాలో మీరు నిర్ణయించరు. గంట మోగుతుంది. అప్పుడు మీరు తినడానికి వెళతారు. మీకేం పెట్టారో అది సంతోషంగా తింటారు. మీరు ఎంపిక చేసుకోరు. ఆహారాన్ని ఆస్వాదించడానికి మనం వ్యతిరేకం కాదు కాని ఆ చిన్న దానికోసం ఒక ఆహారాన్ని కోరుకొని, దానికోసం ఆలోచించి, ఆలోచించి అనేక రెట్లు కర్మను ఉత్పత్తి చేస్తారు. మీరు ఎంత ఆలోచన చేసినా తినగలిగినంతే తింటారు. ఆహారం రుచికరంగా ఉండి మీకు బాగా నచ్చితే మరో 5% ఎక్కువ తింటారు. 10% కన్నా ఎక్కువకుపోతే ఇబ్బందుల్లో పడతారు.

ఈ సాధారణ విషయం కోసం మనుషుల బుర్రల్లో ఎన్నెన్ని ఆలోచనలు. ఆహారాన్ని మీరందరూ ఎంత ఆస్వాదిస్తారో నేనూ అంత ఆస్వాదిస్తాను. ఆ ఆహారం తినడం నాలుకతో, అది వెళ్లేది కడుపులోకి. వండాలంటే అది గిన్నెలో వండాలి. నాకు వండాలనిపిస్తే గిన్నె తీసికొని  అందులో వండుతాను. మీకు వండాలనిపించినా గిన్నెలో వండాలి. అట్లాగే తినాలంటే అది నాలుకతో, కడుపుతో. కాని మీరు తలతో(ఎక్కువ ఆలోచనల ద్వారా) ఇవన్నీ చేస్తున్నారు - అది ఆహారానికి చోటు కాదు. బుర్రకి, ఆహారానికి జోడీ కుదరదు - ఇలా మీరు కర్మను ఉత్పత్తి చేస్తున్నారు.

ఆధ్మాత్మిక పథం అంటే మీ కర్మ ప్రక్రియను త్వరగా ముందుకు తీసికొనిపోయే ప్రయత్నం. 

జీవితంలోని ప్రతి అంశం గురించి ఇలాగే చూడండి. మీరు రోజూ చేస్తున్న పనిలో దానికి 50 నుండి 100 రెట్ల కర్మ సృష్టిస్తున్నారు. మీరు వంట వండినప్పుడు లేదా హాయిగా తిన్నప్పుడు, దాన్ని జీర్ణం చేసుకోండి, మీలో భాగం చేసుకోండి, మీ కర్మను కరిగించుకుంటున్నారు. జీవన ప్రక్రియ అతిసాధారణంగా జరగడంలోనే కర్మ కరుగుతుంది. ఆధ్మాత్మిక పథం అంటే మీ కర్మ ప్రక్రియను త్వరగా ముందుకు తీసికొనిపోయే ప్రయత్నం. మనకు కేటాయించిన కర్మ కంటే ఎక్కువ కర్మను కరిగించే ప్రయత్నం చేస్తాం మనం, ఎందుకంటే దీనికోసం మళ్లీ, మళ్లీ పుట్టడం మనకిష్టం ఉండదు కదా. దాన్నిక్కడే ఇప్పుడే ముగించుకోవాలి. చైతన్యంతో స్పృహతో ఎంపిక చేసుకోవాలి - మెల్లగా ప్రారబ్ధ కర్మను దాని పద్ధతిలో ముగించుకుందామా,  లేదా సాధ్యమైనంత త్వరగా ముగించుకొనే ప్రయత్నం చేద్దామా.

మీరు ఏదైనా ఆధ్యాత్మిక ప్రక్రియలో క్రియాశీలంగా ప్రవేశించినప్పుడు జీవితం ఆశ్చర్యకరమైన వేగంతో నడుస్తున్నట్లనిపిస్తుంది. మీరు ఎన్నడూ లేనంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నట్లనిపిస్తుంది. అంతకుముందు మీకెప్పుడో ఆర్నెలలకొకసారి సమస్యలొచ్చినట్లనిపిస్తే, మీ కర్మ ప్రక్రియను వేగవంతం చేయడం వల్ల ఇప్పుడు 6 గంటల కొకసారి సమస్య వచ్చినట్లనిపిస్తుంది. జీవితం నుంచి తమను వేరుపరచుకున్న మూర్ఖులకు మాత్రమే ఆధ్యాత్మికత ప్రశాంతంగా అనిపిస్తుంది. కాదు. ఆధ్యాత్మికంగా ఉండడమంటే తీక్షణతతో రగులుతూ  ఉండడం - లోపల, బయట, అన్నిచోట్ల. శాంతి కేవలం మరణించిన తర్వాతే. ఇప్పుడు జీవితం ఉజ్జ్వలంగా ఉండవలసిందే.

కర్మ సంబంధమైన తీగచుట్ట

దురదృష్టవశాత్తు నేటికాలంలో మనుషులు జీవితాన్ని గాఢం చేసుకోవడానికి బదులు, సాగదీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంతోమంది ఒక దశ దాటిన తర్వాత తమ స్మృతినీ, మానసిక సామర్థ్యాలనూ కోల్పోతున్నారు. ఈ రోగాల్లో కర్మ కారణం స్పష్టంగానే ఉంటుంది. కర్మ అన్నది మీరు దాని పట్ల స్పృహ లేకుండా సృష్టించిన ఒక సాఫ్ట్‌వేర్. మీరింకా పుట్టకముందే మీరు గర్భంలో చేరిన 40-48 రోజుల మధ్య ఈ కర్మ ఒక ఇనుపతీగ చుట్టలాగా గట్టిగా చుట్టుకొంటుంది. గత సమాచారం మీద ఆధారపడి, మీ శరీర శక్తి, మీ తల్లిదండ్రుల స్వభావం, గర్భధారణ రీతి వంటి అనేక ఆధారాలను బట్టి ఒక చుట్టగా చుట్టుకోవడానికి అది ఒక నిర్దిష్ట ప్రమాణపు సమాచారాన్ని ఎంచుకుంటుంది. అది ఒక ఇనుపతీగ చుట్టవంటిది.

మీరు మెదలకుండా కూర్చుంటే చుట్ట మెల్లగా విడుచుకుంటుంది. మీరెంత స్తిరంగా కూర్చుంటే అదంత వేగంగా విడుచుకుంటుంది. కాని మీరు కార్య కలాపంలో ఉండి మరిన్ని కొత్త అంశాలను కలుపుతూ పోతే అది ఒక నిర్దిష్ట వేగంలోనే విచ్చుకుంటుంది. ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఈ కర్మ బంధం ఎంత గట్టిగా ఉందో నేను చూసినట్లయితే ఆ శిశువు ఎంతకాలం జీవిస్తాడో ఉజ్జాయింపుగా చెప్పగలను - ఒక తాగుబోతు డ్రైవరు ఢీ కొడితేనో, లేకపోతే ఎవరైనా ఆధ్యాత్మిక గురువు పరిచయమయితేనో తప్ప. అతను ఒక ప్రామాణిక జీవనాన్ని గడిపితే ఎంతకాలం జీవిస్తాడో చెప్పవచ్చు. తీగచుట్ట ఎంత వేగంతో తనంతతాను విడిపోతుందో మనకు తెలుస్తుంది.

భారతదేశంలో ఒక సాధారణమైన విషయమేమంటే శిశువు జన్మించగానే ఎవరైనా యోగినో, సాధువునో ఇంటికి ఆహ్వానించి శిశువును వారిచేతుల్లో పెడతారు. ఈ రోజుల్లో కూడా ఈ ఆచారం ఉంది. కాని ఈ స్థానంలో పుట్టినరోజు పండుగలు వంటివి ముఖ్యమవుతున్నాయి. లేకపోతే ఇది చాలా ముఖ్యమైన విషయం. మీరు మీ శిశువును ఇలాంటి వారి  వద్దకు ఎందుకు తీసుకుపోతారంటే, ఈ తీగ చుట్ట మరీ గట్టిగా ఉందేమో చూడడానికి, శిశువు శ్రేయస్సు కోసం ఏమైనా చేయవచ్చునేమో చూడడానికి. అయినా ఎవడో తాగుబోతు డ్రైవరు ఢీ కొట్టవచ్చు లేదా ఒక గురువు వచ్చి వేగంగా తీగచుట్టను విప్పవచ్చు లేదా వారికి ప్రస్తుతమున్న కర్మభారానికి మరెన్నో రెట్లు జత చేయవచ్చు. అందువల్ల కర్మ తన పద్ధతిలో తాను పనిచేస్తుంది - ఏదో జరిగి అది అత్యంత వేగంగా విడిపోవడమో, మళ్లీ పూర్తిగా చుట్టుకోవడమో జరిగితే తప్ప. కొన్ని పరిస్థితుల వల్ల ఇటువంటివి జరుగుతాయి.

ప్రస్తుతం మనం మన కర్మ రజ్జువును పట్టించుకోకుండా మనిషి భౌతిక జీవితాన్ని సాగదీసే ప్రయత్నం చేస్తున్నాం. మనకు జీవరసాయన శాస్త్రం మీద కొంత అధికారం ఉంది కాబట్టి అలా చేస్తున్నాం. ఔషధ చికిత్సనూ, శస్త్ర చికిత్సనూ ఉపయోగించి ఆయుష్షును పొడిగించే ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది ఒక దశ తర్వాత తమ స్మృతినీ, మానసిక సామర్థ్యాలనూ కోల్పోవడంలో ఇది ప్రధానపాత్ర పోషిస్తుంది. మీరేం కోరినా వారు గుడ్లప్పగించి మీవైపు చూస్తారు, ఎందుకంటే సాఫ్ట్‌వేర్ అయిపోయినా గుండెనో, కిడ్నీలో మార్చి హార్డ్‌వేర్‌ను ఇంకా నడిపిస్తూనే ఉన్నాం గనుక.

వాళ్లు తమ జీవితపు మరోకోణాన్ని కూడా పెంపొందించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించినట్లయితే, కాస్త ఆధ్యాత్మిక కృషి సాగించినట్లయితే - భౌతికతను అధిగమించి - మీరొక వేయి సంవత్సరాలు జీవించినప్పటికీ అవసరమైన సాఫ్ట్‌వేర్ ఉత్పత్తి చేయగలిగేవాళ్లు, ఎందుకంటే మరోచోట బోలెడంత విషయం ఉంది. మనం ఇప్పటిదాకా తెరవని సంచిత కర్మ గిడ్డంగి ఒకటుంది. లేకపోతే మీరు మీ సాఫ్ట్‌వేర్ పోయినప్పుడే మీ హార్డ్‌వేర్ కూడా పోయేటట్లు ప్రోగ్రాం చేసుకునే స్వేచ్ఛ ఉండాలి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు