సమాధి గురించి, అందులోని వివిధ స్థితుల గురించి సద్గురు మనకు చెబుతున్నారు. అలాగే సమాధి వల్ల జ్ఞానోదయం కలుగుతుందా అనే ప్రశ్నకు కూడా సమాధానం ఇస్తున్నారు.

అది సమదృష్టిని కలిగించే ఒక మానసిక స్థితి. ఆ స్థితిలో బుద్ధి సహజమైన  వివేచనకు అతీతంగా పనిచేస్తుంది. ఇది మీకు మీ శరీరానికీ మధ్య కొంత దూరాన్ని తీసుకువస్తుంది. సమాధుల్లో అనేక రకాలున్నాయి. వాటిని అవగాహన కొరకు 8 రకాలుగా విభజించారు. ఈ ఎనిమిదింటినీ రెండు అతిముఖ్యమైన విభాగాలుగా విడదీసారు. సవికల్ప సమాధి స్థితులు (ఈ సమాధి స్థితిలో అనుభూతులు మనోహరంగా ఉంటూ, ఆనందాన్నీ, బ్రహ్మానందాన్నీ కలుగజేసేవి) నిర్వికల్ప సమాధి స్థితులు (అవి ఆనందానికీ, దుఃఖానికీ అతీతమై ఏ వికారాలూ లేని స్థితి). నిర్వికల్ప సమాధిలో శరీరంతో సంబంధం ఒకే ఒక బిందువుతో ఉంటుంది. తక్కిన శక్తి అంతా స్వేఛ్ఛగా భౌతికతతో ప్రమేయంలేకుండ చరిస్తుంది. తమకీ తమ శరీరాలకీ మధ్య తారతమ్యం ఉందని తెలియడానికి సాధకులు ఇటువంటి సమాధి స్థితిని సాధన చేస్తుంటారు.

మీరు జీవితంలో వివిధ స్థాయిల్లో వెరువేరు అనుభూతులకు లోనవుతుంటారు. సమాధి స్థితులు కూడా అటువంటివే

వ్యక్తి ఆధ్యాత్మిక పరిణామంలో సమాధి ఒక ముఖ్యమైన స్థితి. కానీ అదే అంతిమ స్థితి కాదు. మీరు ఒక సమాధి స్థితిని అనుభవించినంత మాత్రం చేత  మీ అస్తిత్వ పునరావృతుల నుండి మీకు విముక్తి లభించిందన్న హామీ లేదు. అది ఒక కొత్త స్థాయిలోని అనుభవం. అంతే! మీరు బాల్యంలో ఉన్నప్పుడు మీరు జీవితాన్ని ఒక స్థితిలో అనుభూతి చెందుతారు. మీరు యవ్వనంలోకి అడుగుపెట్టిన తర్వాత మీకు మరొక ప్రమాణంలో జీవితానుభూతి ఉంటుంది. మీరు జీవితంలో వివిధ స్థాయిల్లో వెరువేరు అనుభూతులకు లోనవుతుంటారు. సమాధి స్థితులు కూడా అటువంటివే.

కొందరు ఒకరకమైన సమాధి స్థితి చేరుకుని కొన్ని సంవత్సరాల పాటు అది అనుభవింప యోగ్యమైనదిగా ఉండడం వలన అక్కడే ఉంటారు.  ఈ స్థితిలో వాళ్లకి కాలంతో, స్థానంతో ఏ సంబంధం ఉండదు. వాళ్ళకి ఏ శారీరకమైన  సమస్యలూ ఉత్పన్నం కావు. ఇందుకు కారణం వాళ్లకి శరీర, మానసిక వ్యవస్థలతో కొంతమేరకు సరిహద్దులు చెరిగిపోవడమే. కానీ ఇది తాత్కాలికం. వాళ్లు ఈ స్థితి నుండి ఒకసారి బయటకి వచ్చిన తర్వాత శరీరానికి కావలసిన అవసరాలూ, మనసుకి పూర్వం ఉన్న అలవాట్లు తిరిగి వెనక్కి వస్తాయి.

సాధారణంగా, మాములుగా ఉన్నవాడి కంటే కొద్దిగా మత్తుపానీయాలు సేవించినవాడు వేరే స్థాయి అనుభూతిలో విజృంభిస్తూ ఉంటాడు. కానీ ఎప్పటికో ఒకప్పటికి ఆ స్థాయి నుండి క్రిందకు దిగిరావాలి. ఈ సమాధి స్థితులన్ని ఏ రసాయనిక పదార్థాలూ సేవించకుండా ఆ స్థితిని చేరుకునే మర్గాలు. మీరు ఈ స్థితిలోకి వెళ్ళినపుడు, మీకొక కొత్త ప్రమాణం తెరుచుకుంటుంది. కానీ అది మిమ్మల్ని శాశ్వతంగా మార్చలేదని గుర్తుంచుకోవలసిందే.  మీరు మరొక కొత్త వాస్తవంలోకి ప్రవేశించలేరు. మీ అనుభూతి సాంద్రమౌతుంది కానీ స్థూల దృష్టితో చూసినపుడు మీరు స్వతంత్రులు కాలేరు.

గౌతముడు ఇటువంటి స్థితులలో చేరుకున్నాక,"అది ఇది కాదు," అన్నాడు.

ఆత్మజ్ఞానం పొందినవారు సమాధి స్థితిలో ఎక్కువ కాలం ఉండలేదు. గౌతమ బుద్ధుడు తనకి ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత, కూచుని సంవత్సరాల తరబడి ధ్యానం చెయ్యలేదు. అతని శిష్యులు చాలామంది సుదీర్ఘమైన ధ్యానంలో గడిపారు. గౌతమ బుద్ధుడు మాత్రం అలా చేయలేదు. బహుశా ఆయనకు ఆ అవసరం కనిపించి ఉండకపోవచ్చు. అతను ఆ ఎనిమిది రకాల సమాధి స్థితులనీ ఆత్మజ్ఞానాన్ని పొందకముందు అనుభవించి, తర్వాత వాటిని విడిచిపెట్టాడు. గౌతముడు ఇటువంటి స్థితులలో చేరుకున్నాక,"అది ఇది కాదు," అన్నాడు. అంటే, ఆ స్థితి తనని ఆత్మజ్ఞానానికి తీసుకుపోదని అతను గ్రహించాడు. సమాధి ఒక ఉత్ప్రేరకమైన ఉన్నత చైతన్య స్థితి, ఒక రకంగా బయట నుండి సేవించే మత్తుపదార్థాల ద్వారా కాకుండా, శరీరంలో జరిగే రసాయనిక చర్యల ద్వారా కల్పించుకున్న ఉన్నత మానసిక చైతన్య స్థితి. అందులో ఉన్న ప్రమాదం ఏమిటంటే, అది ప్రస్తుత వాస్తవం కంటే అందంగా ఉంటుంది కనుక మీరు అక్కడే ఉండిపోవాలని భ్రమపడవచ్చు. కానీ, ఎంత అందమైన అనుభవమైనా కాలక్రమంలో దాని అనుభూతి సాంద్రత తిరోముఖం పడుతుందని మనకి తెలిసినదే.

మీ జీవితంలో ఆత్మజ్ఞానం అందుకోవడమే ముఖ్యం అని మీరు తీర్మానించుకునప్పుడు, దాని వైపున ఒక్క అడుగైనా దగ్గిరకి తీసుకుపోలేని ఏ ప్రక్రియ అయినా మీకు అర్థం లేనిదిగా కనిపిస్తుంది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు