నాకు ప్రకృతితో ఉన్న సంబంధం ఒక పర్యావరణవేత్తగా కాదు. నేను ఏ శాస్త్ర కారుణ్ణీ కాదు. నాకు ప్రకృతితో ఉన్న అనుబంధం కేవలం జీవ సంబంధమైనది. నా చిన్నతనం నుండీ, నేను ఇంటిలో కంటే బయటే ఎక్కువ కాలం గడిపాను. నేను 12 నుండి 17 ఏళ్ళ వరకు  కావేరి నదిలో ఈత కొట్టాను.  నాకు 17 ఏళ్ళు వచ్చిన తర్వాత, భాగమండల నుండి మైసూరు వరకు కావేరి నదిలో 12 వెదురు బద్దలూ, 4 గొట్టాలతో చేసిన తెప్పమీద ప్రయాణం చేశాను. ఇప్పటికీ  నాకు నాలుగు గోడల మధ్య నిలకడగా ఉండడం కష్టం. నదుల గురించీ, నీటి గురించీ, ప్రకృతి గురించీ నాకున్న అనుభవం - వాటి గురించి నేను చేసిన పరిశోధనవల్ల వచ్చింది కాదు, నేను దగ్గర నుండి పరిశీలించడం వలన వచ్చింది.

నేలా, నీరూ వస్తువులు కావు

మీ శరీరం మట్టీ, నీరూ పోసిన కుప్ప. చాలా మందికి ఈ సత్యం వాళ్ళని ఖననం చేసేదాకా తెలీదు.  మనని ఖననం చేసిన తర్వాత మనకి ఈ మట్టిలో మనమూ ఒక భాగమని అర్థం అవుతుంది. ఇప్పుడు మనకి కొంత కదలగల శక్తి ఉంది గనుక మట్టిలో మనం ఒక భాగం అంటే అంత నమ్మశక్యంగా కనిపించదు. మనం చెట్టులాగ నేలలోకి పాతుకుపోయి ఉంటే, ఈ సత్యం చాలా స్పష్టంగా తెలిసి ఉండేది. నేలలాగే, నీరు కూడా ఒక సరుకు కాదు. అది కూడా జీవపదార్థమే. మనిషి శరీరంలో 72 శాతం నీరే.  మీరు కూడా ఒక నీటి మడుగే. ఈ భూమి మీద నీటితో నిండిన నదులతో మనకి అత్యంత సన్నిహితమైన సంబంధం ఉంది.

కానీ, ఇప్పుడు మీరు నదుల్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే, అవి బాగా కృశించిపోతున్నాయని మీకు అవగాహన అవుతుంది. చాలా నదులు కొన్ని వేల సంవత్సరాలుగా జీవనదులుగా ప్రవహించాయి. కానీ, కేవలం రెండు తరాల్లో అవి కొన్ని ఋతువులలో మత్రమే ప్రవహించే నదులుగా మారిపోయాయి. రాబోయే రోజుల్లో అవి మరింతగా కృశించిపోనున్నాయి. కొన్ని ముఖ్యమైన నదులు 60 శాతం దాకా కృశించిపోయాయి. కృష్ణా, కావేరి నదులు సంవత్సరంలో 3 నెలలపాటు సముద్రంలో కలవనే కలవవు. ఈ సమస్య ఏవో కొన్ని నదులకి చెందింది కాదు.  దేశమంతటా, అన్ని నదులలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

 ఒకసారి గ్రామాల్లో ఎప్పుడైతే నీరు దొరకడం తగ్గిపోతుందో, అప్పుడు మూకుమ్మడి వలసలు ప్రారంభమవుతాయి.

చాలామంది మనుషులకి ఇప్పుడున్న స్థితిని కొనసాగించడమే సమస్యకి సమధానంగా కనిపిస్తుంది. కానీ యధాస్థితి కొనసాగించడం సమాధానం కాదు. యధాస్థితి కొనసాగించడమంటే, మీరు ఇప్పుడున్న పరిస్థితికి, అదెలాంటిదైనా, రాజీపడిపోవడమన్నమాట. నదుల విషయంలోనూ, చెరువులూ, సరస్సులూ వంటి  జలరాశులు, నేల విషయంలో మీరు యధాస్థితి కొనసాగించడమే మీకు సమస్యకి సమాధానంగా కనిపించవచ్చు గాని ప్రకృతి అలా అనుకోదు. ప్రకృతికి సంబంధించినంతవరకు, నేలా, నీరూ, ఇతర జీవ ప్రదాతలైన వనరుల విషయంలో చెప్పుకోదగ్గస్థాయిలో అవి అంతరించిపోతున్నాయి.

1950 కి ముందు ఈ దేశంలో సంభవించిన కరువులకి ఎన్నో లక్షల మంది మరణించారు. అడోల్ఫ్ హిట్లరు యూరోపులో 6-7 సంవత్సరాల వ్యవధిలో 20-30 లక్షల మంది యూదుల్ని ఊతకోచకోసినపుడు, 1943లో వచ్చిన బెంగాలు క్షామంలో 35 లక్షల మంది చనిపోయారు. 50 సంవత్సరాల పాటు మళ్ళీ అటువంటి కరువు రాకుండా మనం నిలువరించగలిగాము. కానీ మళ్ళీ మనం ఆ దిక్కులోనే ప్రయాణం చేస్తున్నాము. మనుషులు అంత పెద్ద సంఖ్యలో ఇప్పుడు చనిపోకపోవచ్చు. కానీ, తప్పనిసరిగా ప్రమాద స్థాయిలోనే ప్రాణనష్టం సంభవిస్తుంది. ఒకసారి గ్రామాల్లో ఎప్పుడైతే నీరు దొరకడం తగ్గిపోతుందో, అప్పుడు మూకుమ్మడి వలసలు ప్రారంభమవుతాయి. అప్పుడు నగరాల నిండా, వీధుల నిండా, ఎక్కడ పడితే అక్కడ మనుషులు నిండిపోతారు. మీరు వాళ్ళని ఏం చేద్దామన్నా వాళ్ళు హింసకి దిగుతారు. రాబోయే 30-40 సంవత్సరాలలో మనం ఎదురు చూడబోయే ప్రజల మధ్య కలహాలు చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయి.

ఇదేదో కేవలం ప్రపంచం అంతరించుపోతుందన్న భయాన్ని కలిగించడానికి కాదు.  ఇప్పుడు మనం నడుస్తున్న మార్గాన్ని మార్చుకోకపోతే, మనం తప్పని సరిగా అటువంటి దిశలో ప్రయాణం చేస్తాం. గత 4 సంవత్సరాల్లో మన పప్పు ధాన్యాల దిగుమతులు 4 రెట్లు పెరిగాయి. మనకి నీరు దొరకడం లెదుకనక మనం వాటిని పండించగల స్థితిలో లేము. మన పంటలలో అధిక భాగం వర్షాధార పంటలు. కానీ, ఎప్పుడు వర్షం వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. పూర్వం ఒకప్పుడు, ఏ వాతావరణ పరికరాలూ లేని రోజుల్లో రైతులకు ఎప్పుడు వర్షం వస్తుందో గ్రహించే పరిజ్ఞానం ఉండేది. కానీ ఇప్పుడు ఆ స్థితి లేదు. కనుక, ఎప్పుడు వర్షం పడుతుందని నేల దున్ని పంటవెయ్యడం?

నదుల పునరుద్ధరణ

నదులు కృశించిపోడానికి అతిముఖ్యమైన కారణం నేల మీద తగినంతగా వృక్షసంపద లేకపోవడం. నదులలోకి నీరు ప్రవహించాలంటే, దానిచుట్టూ ఉన్న మట్టిలో తగినంత తడి ఉండాలి. మన నదులన్నీ చాలా వరకు అడవిలోని సెలయేటి నీటివల్ల ప్రవహిస్తున్నవి. నేల మీద అడవులు సమృద్ధిగా  ఉన్నప్పుడు, నేలలోకి నీరు ఇంకి,  అది సెలయేళ్ళకీ నదులకీ ప్రవహించేది. ఎప్పుడైతే అడవులు అంతరించిపోతున్నాయో, కొన్నాళ్ళకి అప్పుడు సెలయేళ్ళూ ఉండవు నదులూ ఉండవు. ఈ విషయం ప్రజలకి స్పష్టంగా అవగాహన కావాలి. నీరున్నది కాబట్టి చెట్లున్నాయని ప్రజలు భావిస్తున్నారు. అది తప్పు. చెట్లున్నాయి కాబట్టి నీరుంది. కనుక మన నదుల పరీవాహక ప్రాంతం మెరా ఆకుపచ్చని తొడుగు అవసరం.

కానీ మనం మరో 10- 15 సంవత్సరాలు ఎదురుచూసి కార్యాచరణకు పూనుకుంటే,  మనకి సమస్యకి సమధానం దొరకడానికి 100-150 సంవత్సరాలు పడుతుంది.

కానీ, ఇది ఏ కొద్దిమంది స్వయంసేవకుల ఉత్సాహంవల్లనో నెరవేరగల విషయం కాదు. మీరూ నేనూ కొన్ని లక్షల చెట్లు పాతితే సమస్య తొలగే సమయం మించిపోయింది. ఆ పని మనం 40 ఏళ్ళ క్రిందట చేసి ఉండాల్సింది. మన నీటి వనరుల చుట్టూ ఎం చెయ్యొచ్చో, ఎం చెయ్యకూడదో విధాన పరమైన నిర్ణయాలు తీసుకుని వాటిని కఠినంగా అమలుపరచవలసిన సమయం వచ్చింది. దానికోసమై, మేము ఒక విధాన పరమైన సలహా / ప్రతిపాదనతో ముందుకి వచ్చాము. దానికి ఒక అనుభవజ్ఞులైన నిపుణుల, శాస్త్రజ్ఞుల కమిటీ తుదిరూపం ఇస్తోంది. వారి సలహా, ముఖ్యమైన నదుల పరీవాహక ప్రాంతం పొడవునా రెండు వైపులా 1 కిలోమీటరు మేరా, ఉపనదులైతే అర కిలోమీటరు మేరా, చెట్లు నాటాలి. అక్కడ ప్రభుత్వ భూమి ఉంటే, ఆ ప్రాంతంలో అడవి మొక్కలూ, వ్యక్తిగత భూములుంటే రైతులకు పండ్ల చెట్లూ వేసేలా ప్రోత్సహించాలి. దానివల్ల రైతులకు ఆదాయం కూడా రెండురెట్లు అధికంగా వస్తుంది.

రాబోయే 8-10 సంవత్సరాల్లో ఇది మనం సరిగ్గా అమలు చెయ్యగలిగితే, రాబోయే 10-15 సంవత్సరాల్లో నదులలో 15 నుండి 25 శాతం మేర నీటి ప్రవాహం వృద్ధి చెందుతుంది. కానీ మనం మరో 10- 15 సంవత్సరాలు ఎదురుచూసి కార్యాచరణకు పూనుకుంటే, మనకి సమస్యకి సమధానం దొరకడానికి 100-150 సంవత్సరాలు పడుతుంది. ఇది కేవలం ఎదో చెప్పే మాటలు కాదు, ఇది శాస్త్ర పరిజ్ఞానంతో అంటున్నది. ఇది మన భావితరాలపై మనకున్న గురుతర బాధ్యత. ఒక తరం ప్రజలుగా మనం ఇప్పటికే ప్రకృతి వనరులకి చాలా నష్టం కలిగించాము. ఇప్పటికే కలిగిన అన్ని విధాలైన నష్టాల్నీ మనం సరిదిద్దలేకపోయినా, మనం ఏమి చెయ్యాలో ఆ దిశలోనైనా కార్యాచరణ అమలు చెయ్యాలి.

ఆ దిక్కులో తొలి అడుగుగా, సెప్టెంబరు 3 నుండి అక్టోబరు 2 వరకు, 30 రోజుల పాటు, మేము "నదుల రక్షణ – భారత సంరక్షణ" అన్న ఉద్యమాన్ని చేపడుతున్నాము. నేను స్వయంగా 16 రాష్ట్రాలగుండా 7 వేల కిలోమీటర్లు కార్ డీవే చేస్తాను. 23 ముఖ్యమైన నగరాల్లో నదుల పరిరక్షణకి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వానికి నదుల పునరుజ్జీవన ప్రణాళిక సమర్పించడంతో ఈ చైతన్య ఉద్యమం పరిసమాప్తం అవుతుంది. దేశంలో ప్రతి ఒక్కరికీ ఈ ఉద్యమ స్ఫూర్తిని అందించగలిగితే, అందరం ఒక కనీస ప్రణాళికకి రాగలిగితే, దానిని ఆచరణలో పెట్టగలిగితే, అది మన దేశ ఉజ్జ్వల భవిష్యత్తుకీ, భావితరాల సంక్షేమానికీ గొప్ప సమర్థవంతమైన ఆచరణ కాగలదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

pexels.com