అనుభవ పూర్వకంగా తెలుసుకున్న జ్ఞానమే నిజమైన జ్ఞానము…!!

buddha-2267012_1920

అనుభవంలో లేని జ్ఞానంతో కూడుకున్నప్పుడు అది మనసు ఆడే ఆటలకి బానిస అవుతుంది అని, ఏకత్వం అనేది ఊహ కాదని; అస్తిత్వ వాస్తవమని సద్గురు స్పష్టం చేస్తున్నారు..

శంకరన్ పిళ్ళై ఒకసారి వేదాంత తరగతికి వెళ్ళాడు. వేదాంతం అన్నది దేవుడు– మనమూ ఒక్కటే అని చెప్పే భారతీయ తత్త్వ చింతన. అక్కడి గురువు మంచి ఆవేశంతో ఇలా బోధిస్తున్నాడు: “మీరు ఇదనో, అదనో ఏదో ఒక వస్తువు కారు. మీరు అన్నిచోట్లా ఉన్నారు. అసలు “ఇది నాది”, “అది మీది” అన్నదే లేదు. అన్నీ మీరే,  అన్నీ మీవే. సంక్షిప్తంగా చెప్పాలంటే, అన్నీ ఒక్కటే. మీరు చూసేదీ, వినేదీ, వాసన చూసేదీ, రుచి చూసేదీ, తాకేదీ ఏదీ వాస్తవం కాదు; అదంతా మాయ, ఒక మిధ్య.”

ఈ వేదాంత పరిభాష శంకరన్ పిళ్ళై మెదడులో గిరగిరా తిరుగుతోంది. ఇంటికి వెళ్ళి దాని గురించే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. మాములుగా అయితే అతనికి పడుకోవడం ఇష్టం, కానీ మరునాడు ఉదయం తన ఆలోచనలిచ్చిన ఆవేశంతో  పక్కమీంచి నిద్రలేచాడు. అతనికి ముందుగా మనసులో తట్టిన భావన: “ఈ ప్రపంచంలో నాది కానిదంటూ ఏదీ లేదు. ప్రతీదీ నాదే. ప్రతీదీ నేనే. ఈ ప్రపంచంలో ఉన్నదంతా నేనే. అంతా మాయ.” మీ తాత్త్విక చింతన ఏదైనా, సమయానుసారం ఆకలి వెయ్యడం మానదని మనకు తెలిసిన విషయమే.  కనుక శంకరన్ పిళ్ళైకి ఆకలేసి ఒక రెస్టారెంట్ కి వెళ్ళి, తనకిష్టమైన వన్నీ తెమ్మని, “ఈ ఫలహారం నేను; దీన్ని తెచ్చిన వ్యక్తీ నేనే; ఆరగిస్తున్నదీ నేనే,” అని తనలో తాను అనుకుంటూ ఆరగించసాగాడు. వేదాంతం  జీవితంలో అమలుచేస్తూ!

మేధోపరమైన అవగాహన, తగిన అనుభవ పూర్వకమైన జ్ఞానంతో కూడుకొని ఉండనప్పుడు, అది మనసు ఆడే ఆటలకీ, తప్పు దారిపట్టించే పరిస్థితులకీ దారితీస్తుంది.

అతని ఫలహారం తినడం పూర్తయింది. అతని మనసు నిండా వేదాంతం నిండి చాలా ఉదాత్తమైన స్థితిలో ఉన్నప్పుడు, బిల్లు చెల్లించడం వంటి నీచమైన భౌతిక విషయాలు పట్టవు గదా. అందుకని లేచి బయటకు నడవడం ప్రారంభించాడు. అన్నీ మీవే అయినపుడు బిల్లు చెల్లించడమన్న ప్రశ్న ఎక్కడొస్తుంది? అతను గల్లాపెట్టి పక్కనుండి వెళ్తుంటే, యజమాని ఏదో పనిచేసుకుంటూ దృష్టి వేరేవైపుకి మరల్చాడు. గల్లాపెట్టె మీద పెద్ద నోట్లకట్ట కనిపించింది అతనికి. వెంటనే వేదాంతం చెప్పింది గుర్తుకొచ్చింది అతనికి, “అన్నీ మీవే; మీరు ఇదనీ అదనీ తేడా చూపించలేరు.” శంకరన్ పిళ్ళై జేబులు ఖాళీగా ఉన్నాయి. అందుకని గల్లా పెట్టెలో చెయ్యిపెట్టి  కొంత డబ్బుతీసి తన జేబులోకుక్కి, మెల్లిగా బయటకి నడిచాడు. అతను ఎవర్నీ దోపిడీ చేద్దామనుకోలేదు;  కేవలం వేదాంతాన్ని సాధన చేస్తున్నాడు. అంతే.

అకస్మాత్తుగా కొందరు రెస్టారెంటులోంచి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని పట్టుకున్నారు. శంకరన్ పిళ్ళై అన్నాడు: “మీరెవర్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు? పట్టుకున్నదీ మీరే. పట్టుబడిందీ మీరే. మీరు పట్టుకున్నది మిమ్మల్నే. మిమ్మల్ని పట్టుకున్నవారూ మీరే. మీరూ నేనూ అన్న భేదం లేనప్పుడు నేనెవరికి చెల్లించాలి?” యజమాని ఆశ్చర్యపోయాడు. అతనికి ఒకటిమాత్రం స్పష్టంగా తెలుస్తోంది “నా డబ్బులు మీ జేబులో ఉన్నాయి.”  శంకరన్ పిళ్లై. “నన్ను పట్టుకున్నదీ నేనే, పట్టుబడిందీ నేనే” అంటున్నాడు. ఇటువంటి ఖాతాదారుడితో ఏమి చెయ్యాలో  యజమానికి పాలుపోలేదు.  అతనికి ఓపిక నశించి న్యాయ స్థానానికి తీసుకుపోయాడు.

అక్కడా శంకరన్ పిళ్ళై తన వేదాంత ధోరణి కొనసాగించాడు. న్యాయాధికారి అతను దొంగతనం చేశాడన్న విషయం అతనికి బోధపరచడానికి శతవిధాలుగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. అతనికి విసుగెత్తి చివరకి, “అతనికి వీపుమీద పది కొరడా దెబ్బలు కొట్టండి అని ఆజ్ఞాపించాడు.”

మొదటి దెబ్బకి, శంకరన్ పిళ్ళై అరిచాడు. న్యాయాధికారి, “మీరు దాని గురించి విచారించకండి. అదంతా వట్టి మాయ. బాధా లేదు. సంతోషమూ లేదు. అంతా మాయే.” అన్నాడు.

రెండో దెబ్బ పడేసరికి, శంకరన్ పిళ్ళై, “చాలు.” అన్నాడు.

అప్పుడు న్యాయాధికారి, “మీమ్మల్ని కొట్టిందీ మీరే, దెబ్బ తిన్నదీ మీరే.” అన్నాడు.

మూడో దెబ్బ పడేసరికి శంకరన్ పిళ్ళై గట్టిగా అరిచాడు, “మహ ప్రభో ఆపండి!”  అని.

“అంతమూ లేదు. మొదలూ లేదు. అదంతా మాయ.” అన్నాడు న్యాయాధిపతి.

ఇలా పది కొరడాదెబ్బలూ పడేదాకా సాగింది వ్యవహారం. పదో దెబ్బ పడడం పూర్తయేసరికి శంకరన్ పిళ్ళై లోంచి వేదాంతం పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. మేధోపరమైన అవగాహన, తగిన అనుభవ పూర్వకమైన జ్ఞానంతో కూడుకొని ఉండనప్పుడు, అది మనసు ఆడే ఆటలకీ, తప్పు దారిపట్టించే పరిస్థితులకీ దారితీస్తుంది. ఈ ఏకత్వం అనుభవపూర్వకమైన సత్యం అయినప్పుడు, అది తెలివి తక్కువ పనులకు దారితియ్యదు. అది మిలో శాశ్వతంగా పరిణామం కలిగించే అద్భుతమైన అనుభవాలను కలుగజేస్తుంది.

సార్వజనీనత ఒక ఊహ కాదు; అస్తిత్వ వాస్తవం. వ్యక్తిత్వం అన్నది మాత్రమే ఒక ఊహ. యోగా అంటే “చిత్త వృత్తి నిరోధం.” అంటే, మీ మనసు నిశ్చలంగా ఉండి, మీరు పూర్తి ఎరుకతో ఉండగలిగితే, మీరు యోగాలో ఉన్నట్టే. కానీ బలవంతంగా ఈ చిత్త వృత్తిని ఆపడానికి ప్రయత్నించకండి. మీరు పిచ్చివారయ్యే అవకాశం ఉంది. మీ మనసనే వాహనానికి ఉన్న మూడు పెడల్స్ కూడా వేగాన్నిపెంచేవే, దీనికి బ్రేకులు, క్లచ్ లు ఉండవు . మీరు ఏది తొక్కినా, మనస్సు వేగం పెరుగుతుంది. మీరు దానిమీద దృష్టిపెట్టకపోతే, ఆలోచనలు కూడా వాటంతట అవే వెనక్కి తగ్గుతాయి. మిమ్మల్ని అద్భుతంగా స్పందించగల మౌనంలోకి విడిచిపెడతాయి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert