గత కొన్ని దశాబ్దాలలో భారత దేశంలోని ప్రధానమైన నదులన్నీ గణనీయంగా ఎండిపోయాయి. ఇప్పటి దాకా మనం చేసింది నదులను వీలైనంతగా దోచుకోవడమే. కాని వాటిని సుసంపన్నం చేసే ప్రయత్నం చేయలేదు. నీటి వనరులు, భూమీ ఎంతగా వినాశనం అవుతున్నాయంటే మరో పదిహేను, ఇరవై ఏళ్ళలో ఇక మనం, ఈ 130 కోట్ల జనాభాని పోషించలేం, వారి దాహం తీర్చలేం! దీనికి అతి సులువైన పరిష్కారం ఏమిటంటే నీటి వనరుల చుట్టూ చెట్లను పెంచడం. ఇప్పుడు మనం దీని గురించిన అవగాహన ప్రజల్లో కలిగించి, ప్రభుత్వ విధానం తీసుకురావాలి ~ సద్గురు.

ఈశా ఫౌండేషన్ చేసే నదుల రక్షణ ఉద్యమంలో భాగస్వామ్యం కోరుతూ విన్నపం:

  • 2017 సం. సెప్టెంబర్ 3వ తేది నుంచి అక్టోబర్ 2 వ తేది దాకా సద్గురుతో పాటు ర్యాలీలో కొంత దూరం అయినా లేదా పుర్తిగానైనా పాల్గొనవచ్చు.
  • సోషల్ మీడియా ద్వారా ఈ ఉద్యమానికి మీ సహకారం అందించవచ్చు లేదా ప్రచారం చేయవచ్చు.
  • ఆర్థిక సహాయం లేదా ఏ ఇతర సహాయమైనా అందించవచ్చు.

నదులను రక్షించడం ఎందుకు?

నదులు మానవ సంస్కృతికి పట్టుకొమ్మలు - తాగడానికి, వ్యవసాయానికి, పరిశుభ్రతకు ఇంకా అనేక జీవనావసరాలకు అతి ముఖ్యమైన, అందుబాటులో ఉన్న నీటి వనరులు నదులు. ప్రస్తుతం వంద కోట్ల పైగా జనాభా ఉన్న భారత దేశంలో కోట్లాది మందికి జీవాధారమైన నదుల మీద, ఇతర జల వనరుల మీద కొనసాగుతున్న విధ్వంసం మన జీవితంలో రాబోయే అతి ఘోరమైన ప్రమాదానికి నాంది పలుకుతోంది.

రాబోయే కొన్ని ముఖ్యమైన  సమస్యలు:

ఉపరితలంలో నీటి వనరులు తగ్గిపోవడం

  • జీవ నదులు కేవలం కొన్ని ఋతువుల్లో మాత్రమే పారే నదులైపోతున్నాయి. భారతదేశంలోని ఎన్నో చిన్న చిన్న నదులు అదృశ్యమైపోయాయి.
  • ప్రభుత్వ రికార్డుల ప్రకారం భారత దేశంలోని 91 జలాశయాల్లో గత దశాబ్దం సరాసరి నీటిమట్టాలతో పోలిస్తే 2016 సం. మే లో నీటిమట్టం 30% తక్కువ ఉన్నది.
  • హిమాలయేతర నదులలో అతి పెద్దదైన గోదావరి నదిలో జల ప్రవాహం 20% తగ్గిపోయింది. ఇతర ప్రముఖ నదులైన కృష్ణ, నర్మద నదులలో జల ప్రవాహం 60% పడిపోయింది. ఇంకా కావేరి లాంటి కొన్ని నదుల్లో 40% శాతం పడిపోయింది.
  • ఉత్తర భారతం ఎడారిగా మారడానికి ఎంతో సమయం పట్టదు. 2050 నాటికి గోధుమ ఉత్పత్తి 50 శాతానికి పడిపోయి నేటి వ్యవసాయ క్షేత్రాల నుంచి కోట్లాది జనాభా వలస వెళ్ళే ప్రమాదానికి దారి తీస్తుంది.

నీటి అందుబాటు

  • భారత దేశంలోని 32 పెద్ద నగరాలను తీసుకుంటే, దాదాపు 22 నగరాల్లో నీటి కొరత ఉన్నది.
  • ఢిల్లీ, కలకత్తా, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలు వచ్చే 35 ఏళ్ళలో పూర్తిగా నీటి కొరతని ఎదుర్కోబోతున్నాయి.
  • ఒకప్పుడు అడవులు ఉండడం వల్ల నిండిన నదులు, ఇప్పుడు ఆ ప్రాంతాలలో మెట్ట వ్యవసాయం జరగడం వల్ల, మెల్ల మెల్లగా క్షీణించి పోతున్నాయి.

గంగ

  • ప్రపంచంలో అంతరించిపోతున్న 10 ప్రధానమైన నదుల్లో గంగా నది ఒకటి.
  • గంగానది ఉపనదులపై  ఆనకట్టలు కట్టి దాదాపు నదిలోని 60% నీరు సాగు నీటికి మళ్ళించడం జరుగుతోంది.  చాలా ఎక్కువ నీటిని మళ్ళించడం వల్ల గంగా నది ప్రమాద పరిస్థితిని ఎదుర్కొంటోంది
  • గంగా, బ్రహ్మపుత్ర ప్రాంతపు భూగర్భ జలం ప్రతి ఏటా 15-20mm కిందికి పోతున్నది.

సింధూ నది

  • ప్రపంచంలో అంతరించిపోతున్న 10 నదుల్లో మరొక నది సింధూ .
  • సింధూ నదికి 70% వరకు నీరు హిమాలయ మంచు గడ్డల నుంచి వస్తుంది. వాతావరణంలోని మార్పుల వల్ల సింధూ నది ప్రమాదానికి గురవుతోంది. సింధూ నది పరీవాహక ప్రాంతం ఇప్పటికే 90% వరకు అడవులను కోల్పోయింది.
  • ఈ ప్రాంతలోని భూగర్భజలం ప్రతి ఏటా 4-6 మి.మీ కిందికి పోతున్నది. ప్రపంచంలో ఇంత ఒత్తిడికి గురౌతున్న ప్రాంతాల్లో సింధూ నది పరీవాహక ప్రాంతం రెండవది..
  • సింధూ, గంగా పరీవాహక ప్రాంతం, 21 లక్షల చదరపు కి.మీ ప్రాంతం 75 కోట్ల ప్రజానికానికి జీవనాధారం.

కావేరి

  • పది సంవత్సరాల క్రితంతో పోల్చుకుంటే తమిళనాడులోని జలాశయాల్లో నీటిమట్టం 49%, కర్ణాటకలో 30% పడిపోయాయి.
  • 1977 - 1997 సం. మధ్య, కావేరి పరీవాహక ప్రాంతంలోని అడవులు 35%అంతరించి పోయాయి.

కృష్ణ

  • 1901 - 1960 సం. మధ్య సాగునీటి ప్రాంతం అభివృద్ధి చేయక ముందు సగటున సముద్రంలో కలిసే నీటి పరిమాణం సంవత్సరానికి  5700 కోట్ల ఘ.మీ నుంచి  1990 -2000 సం. కి 210 కోట్ల ఘ.మీ కు పడిపోయింది. 2001-2014 సం. మధ్య అనావృష్టి కాలంలో అది కేవలం 75 కోట్ల ఘ.మీ కు పడిపోయింది.

గోదావరి

  • దేశంలోని రెండవ అతి పెద్ద నది గోదావరి; మహారాష్ట్ర, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ మూడు రాష్టాలకు నీరు అందించే ఈ నది 139 సం. లలో మొట్టమొదటి సారిగా నాశిక్ దగ్గర 2016లో ఎండిపోయింది.

మరిన్ని వివరాల కోసం చూడండి: RallyForRivers