సాధారణంగా ప్రజలు ఏదైనా తమ జీవితంలో విజయాన్ని సాధిస్తే అది వారి శ్రమ, దీక్ష వల్ల అని దానికి వారే కారణమని గొప్పగా చెప్పుకుంటారు, అదే ఒకవేళ అది సఫలం కాకపొతే "విధి" అని దాటేస్తారు. ఇక్కడ మనతో మనం సూటిగా ఉండడం ఎంత ముఖ్యమో సద్గురు వివరిస్తున్నారు..

ప్రపంచంలో ఇది ఒక రకమైన ఫాషన్ గా తాయారయ్యింది. అదేమిటంటే, మీరు గనుక ఎందులోనైనా సాఫల్యం సంపాదించితే - అది మీరు చేసారు. ఎప్పుడైతే మీరు సాఫల్యం పొందలేకపోయారో అప్పుడు అది - విధి రాత. మీకు ఎందులోనైనా విజయం కలిగితే, మీరు మీ విజయాన్ని చూసి గర్వపడతారు. అంటే ఒక విధంగా మీ విజయానికి కారకులుగా మిమ్మల్ని మీరు ఆపాదించుకుంటున్నారు. మీరెప్పుడైతే విజయం సాధించలేకపోయారో అది భగవంతుడి లీల. అంతే కదూ..? ఎన్నో విషయాలను, మనం కొద్ది సంవత్సరాల క్రితం విధి లిఖితం అనుకున్నాము. కాని ఇప్పుడు వాటిని మన చేతుల్లో తెచ్చుకున్నాం.

మీ విధిని మీ చేతుల్లోకి ఎంతవరకూ తీసుకోగలరంటే జీవన్మరణ ప్రక్రియ కూడా మీ అధీనంలో ఉంచుకోవచ్చు.

ఉదాహరణకు ఒక వంద సంవత్సరాలక్రితం మీరు యవ్వనంలో ఉండి, అకస్మాత్తుగా 30 ఏళ్ళకు చనిపోయారనుకోండి, దానిని విధిరాత అనుకునేవారు. కానీ ఈ రోజున మీరు 30 సంవత్సరాలకు చనిపోతే, దీనికి కారణమేమిటో మనకి తెలుసు. మీరు అతిగా తాగడంవల్లో, సరిగ్గా తినకపోవడం వల్లో, ధూమపానం చెయ్యడం వల్లో, మరేదో చెయ్యడం వల్లో  మీకు మీరే హాని కలిగించుకున్నారు. మీరు అది మొదలు పెట్టినప్పుడే, అది మీకు హానికరం అన్న విషయం తెలుసు.  ఇప్పుడు అది విధి లిఖితం కాదు. వంద సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో ప్రజలకి తాగటానికి నీళ్ళు లేవంటే అది విధి అనుకునేవారు. కానీ, ఇప్పుడు ఎవరివల్లో మనకి తెలుసు. ఇలా ఎన్నో విషయాలు, మనం అంతకుముందు విధి అనుకున్నవాటిని  నేడు విధి గా మనం భావించడం లేదు.

ఎందుకంటే, మన అవగాహన, మనం అర్థం చేసుకొనే పరిధి ఎంతగానో పెంపొందించబడ్డాయి కాబట్టి. ఒకసారి మన అవగాహనా పరిధి పెంపొందించబడినప్పుడు, విధి అనే ఖాతాలో నుంచి ఎన్నో విషయాలు క్రిందకి పడిపోతాయి. అవి మీ బాధ్యతగా మారుతున్నాయి. మనం యోగా అన్న పదం ఉచ్చరించినప్పుడు మనం దేనిగురించి మాట్లాడుతున్నామంటే, మీ విధికి మీరే కర్తగా ఉండడం గురించి. మీ విధిని మీ చేతుల్లోకి ఎంతవరకూ తీసుకోగలరంటే జీవన్మరణ ప్రక్రియ కూడా మీ అధీనంలో ఉంచుకోవచ్చు. మీరు ఎటువంటి గర్భంలో పుట్టాలి అన్నది కూడా మీ ఎంపిక కావచ్చు. ఆ స్థాయికి మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోవచ్చు.

మీ అవగాహనా పరిధి పెరుగుతున్న కొద్దీ, జీవితానికి సంబంధించిన ప్రతీదీ మీ చేతుల్లోకి మీరు తీసుకోగలుగుతారు. మీ జీవితాన్ని గురించిన మీ అవగాహన, కేవలం పైపైనే ఉన్నప్పుడు, ప్రతీదీ కూడా మరెక్కడినుంచో జరుగుతోంది అన్నట్లుగా అనిపిస్తుంది. ఉదాహరణకి, ఇప్పుడిక్కడ  లైట్లు పోయాయనుకోండి..అయ్యో.. శివా ! అనుకుంటారు. ఈ రోజుకి కూడా కొన్ని పల్లెటూళ్లలో ఇది ఆ విధంగానే ఉంది.  లైట్లు పోతే అది భగవంతుడు చేశాడని అనుకుంటారు. ఇప్పుడు మనకు ఎవరు చేస్తున్నారో తెలుసు.

మీరు ప్రతీ దానినీ ఎరుక లేకుండా సృష్టించినప్పుడు, అది మీకు విధి లిఖితం లా కనిపిస్తుంది.

అందుకని మన అవగాహన పరిమితంగా ఉన్నప్పుడు, మనం ప్రతీ దానినీ కూడా విధిలిఖితం అనుకున్నాం. మీరు దేనినైతే విధి అని అంటున్నారో అవి జీవితానికి ఉన్న ఎన్నో కోణాలు. వీటన్నింటినీ కూడా మీరు అచేతనంగా సృష్టించారు. మీరు ఏవైతే అచేతనంగా సృష్టించారో, వాటిని మీరు చైతన్యంతో కూడా సృష్టించుకోవచ్చు. మీరు ప్రతీదీ చైతన్యంతో సృష్టించుకున్నారనుకోండి, ఇక అప్పుడు అది విధిరాత అవ్వదు. మీరు ప్రతీ దానినీ ఎరుక లేకుండా సృష్టించినప్పుడు, అది మీకు విధిలిఖితం లా కనిపిస్తుంది. కానీ, అది మీరు చేసుకున్నదే..! విధి అన్న పదం మరెక్కడినుంచో వచ్చింది. మన దేశంలో ఎప్పుడూ కూడా, మీ జీవితంలో ఏమి జరిగినా సరే, అది మీ కర్మ అని చెప్పారు. కర్మ అంటే “మీరు చేసే పని”.

ఇక్కడ ఎం చెప్తున్నారంటే మీరు ఏమి చేసినప్పటికీ; మీరు జీవించినా.. మరణించినా - అది మీ కర్మే అని. మీరు సరిగ్గా జీవించినా, మీరు సరిగ్గా జీవించక పోయినా అది మీ కర్మే..! దీనర్థం మీరు చేసే పనులే వీటన్నింటినీ సృష్టిస్తున్నాయి. చాలావరకూ ఇది మీరు ఎరుక లేకుండా చేసుకుంటూ ఉండిఉండవచ్చు. ఏదేమైనా, చివరికి ఇది మీరు చేసుకున్నదే..!

ప్రేమాశీస్సులతో,
సద్గురు