మనిషి సంఘజీవి నుండి వ్యక్తిగా మారగలిగినప్పుడే ఏదైనా మార్పు కలగడం సాధ్యమని, కేవలం శబ్దాలకే ప్రాధాన్యతనిచ్చే ఈరోజుల్లో, దాని విలువ ఎంత పరిమితమైందో సద్గురు వివరిస్తున్నారు.

భాష సమాజానికి చెందింది, పదాలు మనస్సుకు చెందినవి, ధ్వనులు లేదా శబ్దాలు ప్రకృతికి చెందినవి, నిశ్శబ్దం వీటన్నిటికీ అతీతమైంది. ఒక వ్యక్తి తన భాషతో మమేకమైపోతే అతను ఆ సమాజానికి చెందినవాడవుతాడు. తన పదాలతో మమేకమైతే మనస్సుకు చెందినవాడవుతాడు. శబ్దాలతో గుర్తింపబడితే ప్రకృతికి చెందినవాడవుతాడు. అతను శబ్దరహిత మౌనంలో కరిగిపోతే అప్పుడు మాత్రమే అతీతంలోని అన్ని క్షేత్రాలూ లొంగిపోతాయి.

మనం సమాజం అంటున్నది ఒక సంభాషణ మాత్రమే. అది కేవలం నిరంతర సంభాషణ ద్వారానే అంటే ఒక విధమైన భావవ్యక్తీకరణ, భావోద్వేగాలు, భావనలు. వీటి ద్వారానే మీరు సమాజాన్ని గుర్తించగలుగుతారు. ఎటువంటి సంభాషణా, సమాచారమూ, భాషా లేకపోయినట్లయితే సమాజమనేది ఉండదు. చాలా మందికి మౌనంగా ఉండడం చాలా కష్టం. మౌనం అంటే, సంఘ జీవి నుండి ఒకే వ్యక్తిగతంగా పరిణామం చెందడం. నిజానికి మీరొక "గుంపు"; కాకపొతే "సంఘ జీవి" అని మర్యాదతో చెప్తాం. సమాజం ఒక వాస్తవం కాదు, అది కేవలం ఒక సంభాషణ, రణగొణ ధ్వనుల భాష మాత్రమే. ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు మాత్రమే దేనినైనా అర్థం చేసుకోగలడు, అధిగమించగలడు, జ్ఞానోదయం పొందగలడు. ప్రతి వ్యక్తీ మాట్లాడడం మానివేస్తే ఇక సమాజమనేది ఉండదు.

మనం మనుషుల నుండి భాషను లాక్కొన్నట్లయితే మనుషులిక సంఘ జీవులు కారు, ఎందుకంటే మనుషులు కలిసి ఉన్నప్పుడే భాషకు అవసరం ఏర్పడుతుంది.

మీరు సంఘజీవిగా ఉండకపోవడం అంటే మీరు సంఘ వ్యతిరేకులని అర్ధం కాదు. సంఘజీవిగా ఉండడమంటే మీరొక జీవిగా కాకుండా ఒక రకమైన గోల అని అర్థం. మీరొక యువ సమాజ సభ్యులైతే ఒక విధమైన గోల చేస్తారు. మీరొక వర్తక సంఘ సభ్యులైతే మరో రకమైన గోల చేస్తారు. మీరొక మత సంఘంలో సభ్యులైతే ఇంకొక రకమైన గోల చేస్తారు. మీరు అలా గోల చేయకపోతే మీరా సంఘానికి చెందరు. మనం మనుషుల నుండి భాషను లాక్కొన్నట్లయితే మనుషులిక సంఘ జీవులు కారు, ఎందుకంటే మనుషులు కలిసి ఉన్నప్పుడే భాషకు అవసరం ఏర్పడుతుంది. అసలు మనుషులు కలుసుకునేదే మాట్లాడే అవసరం కోసం. మీకు తెలుసు చాలా చోట్ల కబుర్ల సంఘాలుంటాయి. అదొక్కటే విశ్వజనీన సమాజం. మీరెక్కడికైనా వెళ్లండి, అక్కడొక వర్తక సంఘమో, సామాజిక బృందమో, మత బృందమో, ఒక ఆధ్యాత్మిక బృందమో ఏదైనా కానివ్వండి పోచికోలు కబుర్ల సంఘం ఎల్లప్పుడూ ఉంటుంది. పోచికోలు కబుర్లు అంటే మాట్లాడకుండా ఉండలేకపోవడం – మీకేమైనా తెలిసినా, తెలియక పోయినా, మాట్లాడి తీరవలసిందే...!

శబ్దం వాస్తవం, మాటలు అబద్ధం

మానవ మేధస్సు పదాన్ని కనిపెట్టగలిగింది కాబట్టే సంభాషణ, ప్రసంగం, సాంఘిక వ్యవస్థలు ఏర్పడ్డాయి. పదాలు వాస్తవం కాదు. అలాగే మనస్సు కూడా. శబ్దం వాస్తవం. ప్రకృతిలో అన్ని రకాల ధ్వనులూ ఉన్నాయి. కాని పదం వాస్తవం కాదు. భారతదేశంలో మనకు 1300 కు పైగా భాషలూ, మాండలికాలూ ఉన్నాయి. ఒక భాషలో పవిత్రమైన వస్తువును సూచించే పదం మరో భాషలో అపవిత్రమైన వస్తువును సూచించవచ్చు. పదం అనేది కల్పితం. శబ్దం కల్పితం కాదు. శబ్దం ఒక నిర్దిష్ట వాస్తవం. ప్రకృతి స్వభావాన్నే చీల్చుకొని పోగల వాహనం శబ్దం. కాని పదాలు మిమ్మల్నెక్కడికీ తీసికొని వెళ్లలేవు, ఎందుకంటే అవి కేవలం మీ బుద్ధి తయారు చేసినవే.

శబ్దం అన్నది ఒక వాస్తవం, అది నిరంతరం మీ చుట్టూ ఉంటుంది. మీరు ‘రూపం’ అంటున్నది మరో స్థాయి శబ్దం మాత్రమే. శబ్దం ఒక ప్రతిధ్వని మాత్రమే, అదొక అస్తిత్వ వాస్తవం. నిరంతరం పదాల్ని వాడుతూ ఉండడం, వాక్యాలలో వాటిని రకరకాలుగా కూర్చడం, భాష, సంభాషణ, సాహిత్యం ఇన్ని విధాలుగా వాడుతూ ఉండడం వల్ల, మన మెదడు మాటలతో నిండిపోతుంది – అదెంత సంపూర్ణంగా నిండి ఉంటుందంటే అసలు అస్తిత్వ వాస్తవికతే మసకబారుతుంది.

మీరు మాటలపై స్వారీ చేస్తే ఎద్దులాగా తయారవుతారు. శబ్దాలపై స్వారీ చేస్తే ప్రకృతి భిన్న అంశాలను అన్వేషించగలుగుతారు.

క్రియాశీల సమాజాలలో నివసించేవారు కేవలం మాటలకే పరిమితమై ఉంటారు, రూపాలకు కాదు. పిల్లలు ప్రారంభంలో రూపాలతో పోల్చుకుంటూ ఉంటారు, కాని ఈ రోజుల్లో వాళ్లు చాలా వేగంగా మాటలు నేర్చుకుంటున్నారు. బహుశా నాలుగయిదేళ్ల వయస్సు వచ్చేసరికి వాళ్లు రూపాలు కోల్పోయి మాటలతో నిండిపోతారు. మీ సృష్టిలోనే మీరు మునిగిపోతే, మీరు గందరగోళంలో పడక తప్పదు, జీవితం పట్ల స్పష్టత ఉండదు, ఎందుకంటే మాట వాస్తవం కాదు, అబద్ధం. యోగా అంటే ‘చిత్తవృత్తి నిరోధం’ అని పతంజలి నిర్వచనం చేసారు. అంటే “మీ మనస్సు వికారాలన్నీ తొలగిపోతే, అదే యోగం.” మీ మనసులో కలిగే వికారాలు మీరు తయారు చేసిన మాటల వల్ల కలిగేవి. మాటలు సృష్టించడమంటే అర్థంలేని ధ్వనులకు మీరు అర్థం కల్పించడం.

మీరు మాటలపై స్వారీ చేస్తే దేనికి పనికి రాకుండా తయారవుతారు. శబ్దాలపై స్వారీ చేస్తే ప్రకృతి భిన్న అంశాలను అన్వేషించగలుగుతారు. అలా అని రూపాలతో నిండి ఉండడమే సర్వస్వం కాదు, కాని మాటల్లో తోవ తప్పడం కంటే ఒక అడుగు ముందుకు పోగలుగుతారు. మీరు పది భిన్న భాషలు నేర్చుకొని వాటిని సమాన నైపుణ్యంతో వాడగలిగితే, అప్పుడు మీకు కేవలం రూపాలే ఉంటాయి. ఎందుకంటే చెట్టు అనాలంటే దానికి నాకు పది మాటలుంటాయి. సంస్కృత భాష ఈ పని చేసింది. ప్రతి రూపానికీ కనీసం డజను పదాలు కల్పించింది. దీనివల్ల మీ బుర్రలో రూపం మాత్రమే ముద్రితమవుతుంది, పదంకాదు. మీరు మాట్లాడవలసి వచ్చినప్పుడు మీరొక రూపాన్ని సృష్టించుకొని, పరిస్థితిని బట్టి దానికి సముచితమైన పదాన్ని ఎంపిక చేసుకోవాలి. ఒక్కొక్క అడుగును మీరు జీవిస్తుండగా, మీ అసలైన జీవిత ప్రక్రియను ముందుకు నిశ్శబ్దత వైపు, సృష్టి మూలం వైపు, ముక్తి వైపు తీసికొని వెళ్లే పరికరాలివి. ప్రతిదీ దీనికనుగుణంగా నిర్మితమైంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

Pixabay.com