ఆఫీసులో రకరకాల మనుషులు పని చేస్తూ ఉంటారు. అందరూ నిబద్దతో చేయరు. కొందరు సామర్ధ్యం, నిబద్ధత లేకుండా ఉంటారు. అటువంటి వారిని ఎం చేయాలి అనే ప్రశ్నకి సద్గురు సమాధానం ఇస్తున్నారు..

ప్రశ్న: గురూజీ.. ఒక సంస్థ విజయవంతంగా నడవాలీ అంటే..అందుకు ఎంతో నిబద్ధతతో పని చేసే మనుషులుండాలి. ఇక్కడ ఈశా లో అటువంటి వాలంటీర్స్ ఉన్నారు. నేను ఒక వాణిజ్య సంస్థ గురించి మాట్లాడుతున్నాను. మా దగ్గర కొంతమంది పని చేసేవారున్నారు. ఇందులో 70 నుంచి 80 శాతంవారు ఎంతో నిబద్ధతతో పని చేస్తారు. కానీ, ఒక 20 శాతం మంది అంత సామర్ధ్యంతో లేదా అంత నిబద్ధతతో లేనివారు. వారిని మేము ఏమి చెయ్యాలి..?

సద్గురు:  వారిని తీసెయ్యండి.

సాధకుడు:  కానీ, ఇది ఎవరైతే నిబద్ధతతో ఉన్నారో వారిలో కూడా ఒక విధమైన అస్థిరత్వాన్ని తీసుకు వస్తుంది కదా..?

సద్గురు:  లేదు. వారిని దశలవారిగా తీసెయ్యండి.  మీరు 30% మందిని ఒకేసారి తీసేయ్యాలంటే సమస్య వస్తుంది. కానీ, ఒక్కొక్కసారి 5% మందిని తీసెయ్యండి.

సద్గురు: ఒకరు ఒక ఉద్యోగాన్ని చెయ్యడం కోసం వచ్చారు. వారు ఆ పనిని చేయడానికి సిద్ధంగా లేనప్పుడు వారు అక్కడ ఉండడంలో అర్థం ఏముంది..? ఎవరైనా ఒక పని చేస్తానని తీసుకొని ఆ పని చెయ్యడానికి సుముఖంగా లేకపోతే  అతడు అక్కడ ఉండవలసిన అవసరం ఏముంది..? అతని జీవితం ఎలా సాగుతుంది - అని ఆలోచించకండి. అతను మరో మార్గం వెతుక్కుంటాడు. లేదా అతనికి ఇంతకంటే తేలికైన ఉద్యోగం చేయాలని ఉందేమో..! అది తక్కువ జీతాన్ని ఇస్తుంది. అతన్ని వెళ్ళి అదే చెయ్యనివ్వండి. ఇది మీకు ఎంతో కరకుగా అనిపిస్తోంది కదా..? కానీ, జీవితమన్నది ఈ విధంగానే ఉంది. ఇది కరకుగానూ లేదు సున్నితంగానూ లేదు. ఏదో ఒక విధంగా అతను ఎలానూ తీసివేయబడతాడు.  మీరు 30% మందిని తీసేయ్యాల్సిన అవసరం కూడా లేదు.  ఒక 5% మందిని తీసేశారనుకోండి, మిగతా 25% మంది బాగా పని చెయ్యడం మొదలు పెడతారు.

మీరు వారికొక అవకాశం ఇవ్వండి. వారిని "చూడండి మీరు ఈ పనులు చెయ్యకపోతే, మీరు 3 నెలల కాలంలో ఇక్కడనుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది - అని వారికి చెప్పండి. వారు అది చేయకపోతే వారినీ తీసెయ్యండి. ఎందుకంటే, ఎవరైనా ఒక ఉద్యోగంలో చేరిన తరువాత వారికి అది చెయ్యాలి అన్న ఉద్దేశ్యం ఉండాలి. వారికి అటువంటి ఉద్దేశ్యం లేనప్పుడు వారక్కడ ఉండకూడదు. లేకపోతే అది అతనికీ, చుట్టూరా ఉన్న వారికి కూడా బాధనే కలిగిస్తుంది.

లేకపోతే వారిని వేరే పనికి పెట్టండి. ఇప్పుడు నేనిక్కడికి వచ్చి యోగా ప్రోగ్రాం చేద్దాం అనుకుంటున్నాను. కానీ, నాకు దీనిని ఎలా నిర్వహించాలో తెలియదు. అప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఈ పని చేయకూడదు. వెళ్ళి,  మరొకటి ఏదో శుభ్రంగా  చేసుకోవాలి. నాకేదైతే బాగా వచ్చో, అది చెయ్యాలి. వెళ్ళి దేనినో సరిగ్గా చెయ్యాలి. అంతేకానీ, ఇక్కడకి వచ్చి కూర్చొని యోగా బోధించాలని ప్రయత్నం చేయకూడదు. నేను దేనినైనా శుభ్రంగా చెయ్యడం అన్నది తక్కువ విషయంగా చెప్పడం లేదు. అది మరొక విధమైన పని, అంతే..! నేను ఏదైతే బాగా చేయగలనో, అది చెయ్యాలి. నేను ఏదైనా సరిగ్గా చెయ్యలేకపోయాననుకోండి అప్పుడు, నేను ఏదైనా మరొక పని వెతుక్కోవాలి. దీనికి ఇంత పెద్ద భావోద్వేగపరమైన నాటకం ఎందుకూ..? ఇవన్నీ అక్కర్లేదు. బహుశా ఇలా చెయ్యడం ద్వారా అతను కూడా సంతోషంగా ఉంటాడేమో..!  ఎందుకంటే అతనికి ఎందులో సామర్ధ్యం ఉందో, ఆ పని చేస్తూ ఉంటాడు కాబట్టి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

startupstockphotos.com