ఇద్దరు మనుషులు ప్రేమతో చేయగలిగిన పనులన్నిటిలోకీ, అత్యంత సాన్నిహిత్యాన్ని పెంచేది, చేతిలో చెయ్యి వెయ్యడం. ఎందుకు? ప్రాథమికంగా, చేతులకీ, పాదాలకీ ఉన్న సహజ లక్షణం వల్ల, ఆ రెండు అవయవాల నుండీ శక్తి  వ్యవస్థ ప్రత్యేకమైన రీతిలో ప్రకటితమౌతుంటుంది. శరీరంలోని ఏ రెండు భాగాల కలయికకంటే, చేతుల  కలయికలో ఎక్కువ ఆత్మీయత ఉంటుంది.

ఇది మీరు ప్రయత్నించి చూడవచ్చు. ఈ ప్రయోగానికి మీకు మరొక వ్యక్తి అవసరం లేదు. మీరు రెండు చేతులూ జోడించినపుడు, మీ లోని రెండు శక్తి ప్రమాణాలూ (ఎడమ-కుడి, స్త్రీ-పురుష, సూర్య- చంద్ర, చైనా సంప్రదాయంలో సమస్త  ప్రాణి శక్తినీ సూచించే తెలుపూ-నలుపూ మొదలైనవి.) ఒక పద్ధతిలో ఒకదానితో ఒకటి ముడివడి ఉంటాయి. మీరు  మీ మనసులో ఒక విధమైన ఏకీభావము అనుభూతి చెందుతారు. భారతదేశంలో నమస్కారం పెట్టే సంప్రదాయం వెనుక ఉన్న ఆలోచన ఇదే. అది వ్యవస్థని ఒక సమన్వయంలోకి తీసుకువచ్చే మార్గం.

కనుక, ఈ సంయోగ స్థితిని అనుభూతి చెందాలంటే సరళమైన నమస్కార యోగాని ప్రయత్నించి చూడండి. రెండు చేతులూ దగ్గరగా జోడించి మీరు ఉపయోగిస్తున్న వస్తువును గాని, తింటున్న వస్తువును గాని, లేదా మీకు ఎదురైన ఏ  ప్రాణినిగాని ఎంతో ప్రేమ పూర్వకంగా శ్రద్ధతో తిలకించండి. ఈ రకమైన స్పృహని మీరు చేసే ప్రతి చిన్న పనిలోనూ  తీసుకురాగలిగితే, మీ జీవితం పూర్వంలా ఉండమన్నా ఉండదు. మీరు రెండు చేతులనూ దగ్గరగా జోడించడం ద్వారా  ప్రపంచమంతటినీ ఏకీకృతంచేయగల సంభావ్యత కూడా ఉంది.