ఎటువంటి యోగా మాట్ వాడాలి?

yoga-mat

ప్రశ్న: యోగా చేసేటప్పుడు మేము మేజోళ్లు(socks) వాడాలా? యోగాకు మేము ఎటువంటి చాప(Yoga Mat) వాడాలి?

సద్గురు: మీరు యోగాభ్యాసం చేసేటప్పుడు మేజోళ్లు అవసరం లేదు. మీరు హఠయోగ సరిగ్గా చేసినట్లయితే అది మీ వ్యవస్థలో విపరీతమైన వేడి ఉత్పన్నం చేస్తుంది. ఈ ఉష్ణం కణజాలపు స్థాయిలో పుడుతుంది. ఒకసారి అది జరిగిన తర్వాత, ఎంత చలిదేశంలో మీరున్నా సరే మీకు చలి ఉండదు. మీ శరీరంలోని నిర్దిష్ట భాగాలు ఒకదాన్నొకటి తాకినప్పుడు కొన్ని విషయాలు జరుగుతాయి. హఠయోగంలో అనేక భంగిమల్లో మీ కాలి మడమలు, బొటనవేళ్లు తగలవలసిన అవసరం ఉంది. అక్కడొక పెద్ద ‘ఆవృత్తి’ (circuit) ఉంటుంది. మీరు మేజోళ్లు వేసుకుంటే దానికి నిరోధం కలుగుతుంది.

నేలతో కలిసిపోండి

మీరు యోగా చేసేటప్పుడు మీరు నేలతో ఐక్యం కావడం ముఖ్యం. నేలతో స్పర్శలో ఉండడం చాలా ముఖ్యం. మీరిది చేయగలిగితే, హఠయోగంలో ఎక్కువ ప్రయోజనం కోసం మట్టి మీద లేదా ఎండబెట్టిన బురద మీద చేయాలి. ముడి పట్టువస్త్రం లేదా ముడి నూలువస్త్రం ఉపయోగించాలి. దానిమీద యోగా చేయాలి.

మీరు మరచిపోయి ఉండవచ్చు కాని మీ శరీరం మాత్రం, అది ఈ భూమిలో ఒక భాగమని గుర్తు పెట్టుకుంటుంది. మీరు యోగాభ్యాసం చేసినప్పుడు మీరది స్పృహతో కూడిన, సజీవ ప్రక్రియగా ఉండాలని కోరుకుంటారు. ఆ విధంగా మీరు ఏ నేలమీద నివసిస్తున్నారో ఆ నేలతో ఒకటి అయిన అనుభూతి పొందుతారు. మీ ఆరోగ్యంలో 80% మీరు ఈ నేలతో ఎంత సమన్వయంగా ఉన్నారనేదానిమీద ఆధారపడి ఉంటుంది. మీరు ఈ నేలతో మంచి సంబంధం నెలకొల్పుకుంటే మీ దీర్ఘరోగాలు 80% వరకు మాయమైపోతాయి.

రబ్బరు యోగా చాపలు మంచివేనా?

ఇక రబ్బరు చాపల గురించి. నాకు తెలుసు ఈశా బ్రాండు రబ్బరు చాపలున్నాయని. వాళ్లేమంటారంటే, “సద్గురు, నూలుచాపలు త్వరగా మురికి అవుతాయి, వాటి నెవరు ఉతుకుతారు? అందుకే రబ్బరు చాపలు తయారుచేశాం.” “సద్గురు, ఇదొక ప్రత్యేకమైన పదార్థం, ఇది నిజంగా మిమ్మల్ని వేడెక్కకుండా చేస్తుంది.” నేను మిమ్మల్ని ఏమడగాలనుకుంటున్నానంటే – మీరిక్కడ జీవితాన్ని అనుభూతి  చెందాలనుకుంటున్నారా, దాన్నుండి తప్పించుకోవాలనుకుంటున్నారా? తెలియకుండానే మీరు అనేకవిధాలుగా జీవితం నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకుంటున్నారు.

మీకీ విషయం ఇప్పటికే తెలిసి ఉండవచ్చు, కాని మీలో అధికంగా ఉన్నది బాక్టీరియా కదా. మైక్రోబులు లోపలికీ, బయటికీ తిరుగుతూ ఉంటాయి. శరీరంలో స్థిరంగా ఉండవు. మిగిలిన ప్రపంచం నుంచి మీరు మిమ్మల్ని వేరు చేసుకుంటే, అదే జబ్బు. మీరు తక్కిన ప్రపంచం నుండి మిమ్మల్ని వేరుచేసుకుంటే, మీ సామర్థ్యం నిరంతరం తగ్గిపోతూ ఉంటుంది.

మీరు ఇంట్లోనే ఉండే మనిషయితే అంటే ప్రతిరోజూ ఉదయం ఒకేచోట మేలుకునేటట్లయితే ఒక నూలు వస్త్రాన్నో, ముడి పట్టువస్త్రాన్నో మీ యోగాకోసం చాపగా వాడండి, మీరు ఈ నేలతో స్పర్శ కలిగి ఉండాలి. వేరు పరిచే అడ్డుతెర లేకుండా సహజమైన ప్రాకృతిక పదార్థాలు మీకు ఉపయోగపడతాయి.

ప్రేమాశీస్సులతో,
సద్గురుఅనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *