ధూమపానం చెయ్యడం, ఇంకా వ్యసనాలకి బానిసలవ్వడంలో మన మానసిక, శారీరిక మూలం ఉందా? దాన్ని మనం ఎలా నియంత్రించవచ్చు..? ఈ విషయాల్ని సద్గురు మనకు ఈ ఆర్టికల్ లో చెబుతున్నారు.

ప్రశ్న :  నేను ధూమపానం ఎంతో ఎక్కువగా చేస్తాను. నేను దీనిని ఎలా నియంత్రించుకోవాలి..?

సద్గురు : మత్తు పదార్థాలపట్ల, ఉత్ప్రేరకాలపట్ల, అవి కలిగించే ప్రభావాలపట్ల, ఈ రోజున మనకు తగినంత ఎరుక ఉంది. ఇదివరకు రోజుల్లో వారు సిగరెట్ ప్యాకెట్ మీద చిన్న అక్షరాలతో "పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం" అని ముద్రించేవారు. ఈ రోజుల్లో, పొగ త్రాగడం మరణానికి హేతువు అవుతుంది అని లేదా పొగ త్రాగడం క్యాన్సర్ ని కల్గిస్తుంది అని వారు పెద్ద బొమ్మనే వేస్తున్నారు. క్యాన్సర్ రావడం ఏమీ నేరం కాదు. మీరు గనక క్యాన్సర్ ను  ఆస్వాదించగలిగితే, మీరు పోగత్రాగవచ్చు. మీకు ఈ ఆధునిక జీవితంలో ఏమి కావాలో అది చేయవచ్చు. కానీ మీరొక విషయం అర్థం చేసుకోవాలి. ప్రతీ చర్యకీ కూడా ఒక పర్యవసానం ఉంటుంది. ఆ పర్యవసానం వచ్చినప్పుడు, మీరు ఆ పర్యవసానాన్ని ఆనందంగా స్వీకరించగలిగితే, మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. కానీ ఆ పర్యవసానం వచ్చినప్పుడు, మీరు దానిని బాధపడుతూ, ఏడుస్తూ కనక తీసుకునేటట్లైతే, అప్పుడు ముందుగానే మీరు చేసే చర్య పట్ల కొంత ఎరుకతో ఉండాలి. జీవితం ఇంత సరళమైనది. ఇది నీతి బోధగా చెప్పడం లేదు. ఎవరైనా సరే తెలిసో తెలీకో ఏదైనా పని చేస్తే, అటువంటి మూర్ఖులు దాని పర్యవసానాన్ని అనుభవిస్తారు.

పర్యావరణానికి నేస్తమైనటువంటి యంత్రం

మానవ వ్యవస్థ అనేది పర్యావరణానికి అనుకూలమైన, స్నేహపూర్వకమైన యంత్రం. ధూమపానం చెయ్యడం కోసమై ఈ వ్యవస్థ నిర్మించబడలేదు. అందుకని  ధూమపానం చెయ్యడమనేది - ఒక మూర్ఖమైన పని. ఇప్పుడు మన కార్లకు ఉండే ఇంజిన్లు పొగ వదలకుండా ఉండేలా ఎటువంటి ఇంధనం వాడాలి లేదా అవి తక్కువ పొగను వదిలేటట్లు చేయడం ఎలా అన్న విషయం పట్ల ఎంతగానో పరిశోధనలు చేస్తున్నారు. పొగ వదిలే యంత్రాన్ని కూడా పొగ వదలకుండా ఉండేలా చెయ్యాలని మీరు అనుకుంటున్నప్పుడు - ఇది మూర్ఖమైన పనే కదా..? ఇది కనక మీరు తెలుసుకోగలిగితే, మీరు క్రమంగా ఈ అలవాటుని మానేసుకొగలుగుతారు.

మీ రసాయనికతే మీకు ఎంతో పారవశ్యాన్ని కలిగిస్తుంది

దీనిలో రసాయనికతకు సంబంధించిన అంశం కూడా ఉంది. మీ రసాయనికత నికోటిన్ లేదా కెఫీన్ – వీటిమీద ఆధారపడుతోంది. దీనిని మనం మార్చుకోవచ్చు. మీరు గనక శాంభవీ మహాముద్ర చేసినట్లైతే, మీ వ్యవస్థ అంతా కూడా ఎంత ఉత్తేజితం అవుతుంది. అంటే, మీకు ధూమపానం చేయవలసిన అవసరం గానీ, కాఫీ త్రాగవలసిన అవసరం గానీ, టీ త్రాగవలసిన అవసరంగానీ - ఇటువంటివి ఏవీ ఉండవు. మీరు, అది ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఆనందం కోసం చెయ్యడం అన్నది వేరే విషయం. ఏదో ఒక రోజున మీకు కాఫీ త్రాగాలనిపిస్తేనో లేదా ధూమపానం చెయ్యాలనిపిస్తేనో, మీరు అలా చెయ్యవచ్చు. కానీ, అది మీకు ఒక నిర్బంధం కాకూడదు. మీరు గనక శాంభవీ మహాముద్ర చేసినట్లైతే, మీకు శారీరికంగా వాటి అవసరం ఉండదు..!

కేవలం మీ రసాయనికత వల్లే మీకు ఎంతో పారవశ్యంలో ఉండడం గనక తెలిస్తే, అప్పుడు మీరు ధూమపానం గానీ, మద్యపానం గానీ చేయాలని అనుకోరు.

నేను ఎవ్వరికీ కూడా ఇది వదిలేయ్యండి, అది వదిలేయ్యండి - అని చెప్పను. అలా చేస్తే, మీరు మీ సిగరెట్ ని రెండు నిమిషాలపాటు పక్కన పెడతారు. ఆ తర్వాత మీరు మళ్ళీ ఉఫ్.. ఉఫ్.. ఉఫ్.. అంటారు. ఎందుకంటే, మీ అనుభూతిలో ఇది అన్నిటికంటే పెద్దది కాబట్టి. మీకు అదే అన్నిటికన్నా అద్భుతమైన అనుభూతి. కానీ, నేను అంతకంటే పెద్ద అనుభూతిని మీకు కలిగించాననుకోండి, అప్పుడు మీ ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ ఇలాంటివన్నీ వదిలేయండి అని నేను చెప్పవలసిన అవసరం లేదు. అవి వాటంతట అవే, మిమ్మల్ని వదిలేస్తాయి. కేవలం మీ రసాయనికత వల్లే మీకు ఎంతో పారవశ్యంలో ఉండడం గనక తెలిస్తే, అప్పుడు మీరు ధూమపానం గానీ, మద్యపానం గానీ చేయాలని అనుకోరు. మీరు శాంభవీ మహాముద్రని మొట్టమొదటి రోజు మీరు అలా కూర్చొని దానిని చేసినప్పుడు, మీరు ఎంతో ఆనంద పారవశ్య స్థితుల్లోకి వెళ్తారు. ఆ తరువాత, నేను మీకు ఇది వదిలేయండి, అది వదిలేయండి అని చెప్పక్కర్లేదు. మీ జీవితం అలా గాడిలో పడిపోతుంది.. అంతే..!

దివ్యత్వాన్ని ఆస్వాదించండి 

నేను ఎప్పుడూ కూడా ఎటువంటి పదార్థామూ తీసుకోలేదు. కానీ నా కళ్ళు ఎప్పుడూ అలా మత్తులో ఉన్నట్లే ఉంటాయి. నేను 24 గంటలూ కూడా తాగినట్లు ఉండగలను. కానీ, దీనివల్ల ఎటువంటి హేంగోవరూ ఉండదు. దీనికి ఎటువంటి ఖర్చూ లేదు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడాను. మేము మద్యం కానీ, డ్రగ్స్ కానీ చూసినప్పుడు అవన్నీ కూడా చిన్నపిల్లల పదార్థాల్లాగా అనిపించేస్తాయి. ఎందుకంటే, మీరు అవి ఇచ్చే మత్తుకి వెయ్యి రెట్లు ఎక్కువ మత్తులో ఉండగలరు. అదీనూ ఎంతో సజీవంగా..! ఇటువంటి మత్తుపదార్థాలు ఎందుకు..? మీరు చక్కగా దివ్యత్వాన్ని ఆస్వాదించండి.

సంపాదకుడి గమనిక: మొట్టమొదటి సారిగా ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమాన్ని ప్రత్యక్ష తెలుగు అనువాదంతో నేర్చుకోనే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా అత్యంత ప్రాచీన ఇంకా శక్తివంతమైన శాంభవీ మహాముద్ర క్రియలో మీరు ఉపదేశం పొందుతారు. తిరుపతి, గుంటూరు ఇంకా హైదరాబాద్ లో వచ్చే జూన్ నెలలో ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి.

ప్రోగ్రాం వివరాల కోసం చూడండి : Inner Engineering