త్రాగేనీరు ఏ ఉష్ణోగ్రతలో ఉండాలి..? చలికాలంలో వేడి వేడిగా ఒక కప్పు ‘టీ’ గానీ లేదా ఎండాకాలంలో చల్లగా ఒక గ్లాసు మంచినీళ్లు త్రాగడం అన్నది - మనల్ని ఎంతో ఉత్తేజపరచే విషయంగా అనిపిస్తుంది. నిజానికి ఈ వేడి పదార్థాలూ చల్లని పదార్థాలూ మనమీద ఎలాంటి ప్రభావం కలిగి ఉంటాయి..? సద్గురు మన శరీరానికి ఏది సరైన ఉష్ణోగ్రతో, ఎలాంటి పదార్థాలను మనం తీసుకోవాలో, వాటిని వేడి చేసే విధానాలు ఎలా ఉండాలో ఈ వ్యాసంలో చెబుతున్నారు.

ప్రశ్న : సద్గురూ..! మీరు నీటిని ఎలా శుద్ధి చెయ్యాలో ఇంకా దాని ప్రభావం ఎటువంటిదో మీరు చెప్పారు. ఒక మైక్రోవేవ్ లో, నీటిని లేదా నీరు కలిగి ఉన్న పదార్థాలని మనం వేడి చేసినప్పుడు మీరు చెప్పింది వాటికి వర్తిస్తాయా..? మనం నీటిని ఉత్తమంగా వేడి చేసే పద్ధతి ఏది..?

సద్గురు : నేను అమెరికాలో ఏమి గమనించానంటే, సాధారణంగా అందరూ గ్లాసులో మూడువంతులు ఐసు ముక్కలు వేసుకుని త్రాగుతూ ఉంటారు. సాధారణంగా అమెరికా దేశంలో నీరు ఇలానే ఇవ్వబడుతుంది. కానీ భారతదేశంలో ఎప్పుడైనా సరే, హోటలుకు వెళ్లినప్పుడు కూడా.. ఐస్ లేకుండా నీళ్ళు కావాలి - అని చెప్తారు. దీని గురించి ఎన్నో హాస్యాలున్నాయి. యోగ సాంప్రదాయంలో మీరు గనక అంతర్ముఖ సాధనలో ఉంటే మీరు మీ వ్యవస్థను పరిణామం చెందించుకోవాలి, దీనినొక ఆవశ్యకతగా మలచుకోవాలి - అని అనుకుంటారు. ఇదే కనుక నిజమైతే, మీరు త్రాగే నీరు.. మీ శరీర ఉష్ణోగ్రతకు నాలుగు సెంటిగ్రేడ్లు అటూ-ఇటూగా ఉండాలి. అంటే, ఇది 32 నుంచి 40 సెంటిగ్రేడ్ల లోపల ఉండాలి. ఇదే మీరు త్రాగే నీటికి ఉండవలసిన సరైన ఉష్ణోగ్రత..!

మీ శరీర ఉష్ణోగ్రతకంటే ఎంతో ఎక్కువగానూ లేదా తక్కువగానూ ఉన్న నీటిని మీరు స్వీకరించడంవల్ల మీలోపల ఉన్న నీరు సహజంగా పని చేసే విధానమంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోతుంది.

మీరు గనుక ఒకవేళ విద్యార్థి అయితే, కేవలం జ్ఞానాన్ని సంపాయించుకోవాలనే అనుకుంటున్నారు. అంతేకాని, పరివర్తన చెందాలని అనుకోవడం లేదు అనుకోండి, అప్పుడు మీరు మీ శరీర ఉష్ణోగ్రతకు 8 సెంటీగ్రేడ్ల లోపుగా ఉన్న నీటిని త్రాగవచ్చు. అంటే, నీటి ఉష్ణోగ్రత 28 నుంచి 44 డిగ్రీల సెంటీగ్రేడ్లలో ఉండొచ్చు. మీరు గనక ఒక గృహస్థుగా ఉన్నారనుకోండి అంటే, మీకు పరివర్తనలోనూ ఆసక్తి లేదు.. దేనినైనా నేర్చుకోవాలన్న ఆసక్తీ లేదు. కేవలం, మీ పిల్లలూ, మీ భార్యా లేదా మీ భర్తలను నియంత్రించగలిగితే చాలనుకున్నారనుకోండి, అప్పుడు మీరు త్రాగే నీరు మీ శరీర ఉష్ణోగ్రతకు 12 డిగ్రీలు అటూ ఇటూగా ఉండవచ్చు. అంటే నీటి ఉష్ణోగ్రత 24 నుంచి 48 డిగ్రీల సెంటిగ్రేడ్లలో ఉండవచ్చు.  ఇంతకు మించిన నీటి ఉష్ణోగ్రత శరీరానికి అనుకూలమైనది కాదు.

నేను ఈ మాట చెబితే మీకు అంతగా నచ్చకపోవచ్చు. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు నీటిని త్రాగుతున్నప్పుడు శరీర ఉష్ణోగ్రతకు మరీ దూరంగా ఉండకూడదు. మీ శరీర ఉష్ణోగ్రతకంటే ఎంతో ఎక్కువగానూ లేదా తక్కువగానూ ఉన్న నీటిని మీరు స్వీకరించడంవల్ల మీలోపల ఉన్న నీరు సహజంగా పని చేసే విధానమంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోతుంది. ఇది ఐస్ క్రీమ్ తినేవారికీ, ఐస్ క్రీమ్ కంపెనీ వారికీ.. అంతగా నచ్చకపోవచ్చు. కానీ నేనిప్పుడు ఏవి ఉత్తమమైన పరిస్థితులో వాటిని గురించి చెబుతున్నాను. మీరు దీనిపట్ల కొంత ఎరుకతో ఉంటే, సాధ్యమైనంత వరకు చేయవచ్చు.

కానీ మైక్రోవేవ్ వాడడమన్నది అసలు క్షేమకరమైన పద్ధతి కాదు.

మీ ప్రశ్నలోని రెండో భాగం ఏమిటంటే.. నీటిని ఎలా వేడి చేయాలి..? - అన్నది. మనం సూర్యరశ్మితో నీటిని వేడి చేయగలిగితే, అది అన్నిటికంటే ఉత్తమమైన పద్ధతి. ఒక చిన్న సోలార్-పానెల్ ని మీ ఇంట్లో అమార్చుకోవడం అన్నది తేలికైన పద్ధతి. సోలార్ హీటర్లు కూడా మనకి ఈ మధ్యకాలంలో దొరుకుతున్నాయి. అవి కనక కుదరకపోతే, కట్టె-పుల్లలతో వేడి చెయ్యడం అన్నది మనకున్న తరువాతి అవకాశం. అది కూడా కుదరదు అంటే, మీరు ఏవైనా పెట్రోలియం పదార్థాలను వాడవచ్చు. కానీ మైక్రోవేవ్ వాడడమన్నది అసలు క్షేమకరమైన పద్ధతి కాదు.

మీరొక మైక్రోవేవ్ లో నీటిని వేడి చేసినప్పుడు అది సమానంగా వేడెక్కదు. మీరు గనక, మైక్రోవేవ్ వాడి దేనినైనా వేడి చేసినట్లైతే దానిని కనీసం 15 నుండి 20 నిమిషాలు బయట పెట్టవలసిన అవసరం ఉంది. అప్పుడే, మీరు వేడి చేసిన ఆహార పదార్థంలోని నీరు దానికది సామాన్యమైన క్రమంలోకి సర్దుకుపోగలుగుతుంది. మరొక అంశం ఏమిటంటే మీరు మైక్రోవేవ్ లో వాడే కప్పులుగానీ, గిన్నెలుగానీ ఎంతో నున్నగా ఉంటాయి. సాధారణంగా ఇవి గ్లాస్ తో గానీ, చైనా-క్లే తో గానీ చేయబడి ఉంటాయి. అందువల్ల ఇవి ఎంతో నున్నగా ఉంటాయి. ఈ విధంగా ఉన్నప్పుడు నీరు బాగా వేడెక్కిపోయే అవకాశం ఉంది. 100 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటినప్పటికీ కూడా నీరు ఆవిరిగా మారదు. ఎందుకంటే ఇటువంటి గిన్నెలలో గాలి బుడగలు ఏర్పడవు కాబట్టి..! ఇటువంటి గిన్నెల ఉపరితలం ఎంతో నున్నగా ఉంటుంది. ఇక్కడ గాలి బుడగలు ఏర్పడలేవు. అందువల్ల మీరు నీటిని 100 డిగ్రీల ఉష్ణోగ్రతకంటే కూడా ఎక్కువ వేడి చేయవచ్చు. ఇది ఎంతో ప్రమాదకరంగా కూడా మారుతుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు