ఆదియోగి సతీదేవిని ఎందుకు వివాహం చేసుకోవలసి వచ్చిందో దానికి సంబంధించిన కారణాలను ఈ వ్యాసం ద్వారా తెలుసుకోండి.

అవి భూగ్రహానికి చీకటిరోజులు. నియంతలైన నిరంకుశ పాలకులెందరో వివేకవంతులైన శాసనకర్తల నుండి పాలనాధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. తమ ఇష్టానుసారం సొంత చట్టాలను ప్రజలపై రుద్దారు. ఉదార స్వభావులైన రాజులు కొందరున్నా వారి సంఖ్య చాలా తక్కువ. ముఖ్యంగా తారకుడనే చక్రవర్తి మితిమీరిన అధికార దాహం, అత్యాశల ముందు వారు శక్తిహీనులైపోయారు. ఇలా ముక్క చెక్కలుగా చీలిపోయిన భూలోకంలోకి సామరస్యం, సమతుల్యత తీసుకురాగలవాడు హిమాలయాల్లో కఠోర తపస్సులో మునిగిన ఆదియోగి ఒక్కడే. కాని ఆదియోగి ఏకాంతవాసి, సన్యాసి. అతణ్ణి యుద్ధానికి ప్రేరేపించడం సాధ్యం కాదు. ఆ రాజులు, ఇతరులెవరి దగ్గరా లేని శక్తులెన్నిటినో ఆదియోగి సొంతం చేసుకున్నాడని గ్రహించారు.

ఆ అద్భుత జ్ఞానాన్ని అతడి నుంచి పొందాలంటే, దాన్నతడు తనంత తానై ఇష్టపూర్వకంగా ఇస్తే తప్ప సాధ్యం కాదు.

నిస్సహాయంగా, గింగిరాలు తిరుగుతూ విధ్వంసం దిశగా దూసుకుపోతున్న ప్రపంచం, ఎవరి ప్రమేయం వల్లనైనా రక్షించబడే అవకాశం ఉందంటే అది ఒక్క ఆదియోగి వల్లే. కానీ ఎవరికీ అతడిని సమీపించే ధైర్యం లేదు. ఎందుకంటే అతడు తీవ్రంగా జ్వలిస్తున్న అగ్నిశిఖలా ఉన్నాడు. అతడినుండి ఆ నిగూఢ శక్తులను చేజిక్కుంచుకోగల దారేదైనా ఉందా? భక్త సులభుడైన విష్ణుమూర్తిని వేడుకోవాలని వాళ్లు నిశ్చయించుకున్నారు. ‘ఆదియోగిని సమీపించడం నాకైనా సాధ్యం కాదు. అతడి యోగశక్తి ఎంత అపారమంటే అంతర్గతంగా అతడిలో ఏం జరుగుతోందో కూడా నేనూహించలేను. ఆ అద్భుత జ్ఞానాన్ని అతడి నుంచి పొందాలంటే, దాన్నతడు తనంత తానై ఇష్టపూర్వకంగా ఇస్తే తప్ప సాధ్యం కాదు. ఎవ్వరూ ఆ శక్తుల్ని అతడినుంచి సంగ్రహించలేరు. ఇప్పుడు మనకతడు దొరకడు. ముందు మనమతని దృష్టినాకట్టుకోవాలి. అతని ఉగ్రతని ఉపశమింపజేయాలి. ఎలాగోలా మన మాట వినేలా చేసుకోగలగాలి’ అన్నాడు విష్ణుమూర్తి.

ఎలా అన్నదే ప్రశ్న. లెక్కలేనన్ని ప్రణాళికలూ, వ్యూహాలూ యోచించారు గాని ఏ ఒక్కటీ పనిచేసేలా కనబడలేదు. అతడేమో చిన్న చిన్న ప్రలోభాలతో ఆకట్టుకుని అందుకుందుకు వీలుకాని మహా పురుషుడు. చివరికి వాళ్లకు మిగిలిన ఒకే ఒక్క ఆశ, ఆదియోగికి జన్మించిన శిశువు మాత్రమే అని వాళ్లు తీర్మానించుకున్నారు. అతడి సంతానం మాత్రమే ఈ అవినీతిపరుల ఆట కట్టించి సమస్యల్లో చిక్కుకున్న భూగ్రహానికి స్వస్థత చేకూర్చగలదని నమ్మారు. అది జరగాలంటే ఆదియోగి ఒక కుటుంబీకుడవడానికి ఒప్పుకోవాలి. సన్యాసి గృహస్థుగా మారాలి. అంతా కలిసి భయంతో కంపిస్తూ ఆదియోగి దగ్గరకు వెళ్లారు. తపోభంగమైన ఆదియోగి ఆగ్రహించాడు. 'నా ధ్యానాన్ని భగ్నం చెసిన కారణమేమి'టని అడిగాడు.

అతడి సంతానం మాత్రమే ఈ అవినీతిపరుల ఆట కట్టించి సమస్యల్లో చిక్కుకున్న భూగ్రహానికి స్వస్థత చేకూర్చగలదని నమ్మారు.

వాళ్లు తమ కష్టాలన్నీఅతడి ముందు ఏకరువు పెట్టారు. ‘నీ చుట్టూ ఉన్న గొడవలన్నిటినీ పూర్తిగా విస్మరించి, ఎప్పుడూ కళ్ళుమూసుకుని బ్రహ్మానందంలో మునిగి ఉంటావు’ అంటూ  విలపించారు. ‘ నీ చుట్టూ ఉన్న జనమంతా చెప్పనలవికాని దురవస్థలో మునిగి ఉన్నారన్న విషయం నీకెంత మాత్రమూ తెలిసినట్టు లేదు. వారి దుస్థితి పట్ల కాస్తైనా కనికారం చూపక్కర్లేదా? వాళ్లకోసం నువ్వేం చెయ్యక్కర్లేదా?' అన్నారు. దానికి ఆయన ‘ఏం చెయ్యమంటారు నన్ను?’ ఆదియోగి అడిగాడు.

వాళ్లు ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్న ప్రశ్న అదే. అపుడు వాళ్లు యజ్ఞాలకు మూలపురుషుడైన దక్ష ప్రజాపతి కుమార్తె, సౌందర్యవతి అయిన సతీదేవిని ఆదియోగి సమక్షానికి తీసుకువచ్చారు. ఈమె స్వయానా శక్తి యొక్క అవతారమే అని చెప్పి, 'ఈమె కేవలం నీకు సహచరి కావడం కోసమే జన్మనెత్తింది. ఈమెని నీ భార్యగా స్వీకరించావంటే, నీ సంతతి లోకరక్షణ చేయగలుగుతుంది. కావాలనుకుంటే నువ్వు నీ ధ్యాన పారవశ్యంలోనే ఉండిపోవచ్చు' అన్నారు ఆదియోగి ఒప్పుకున్నాడు. అతడు తన సన్యాసాన్నివదిలేసి, సతిని పరిణయమాడాడు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు