Sadhguruపతంజలి, ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి. ఈయన మరొకరికంటే ఎక్కువ జ్ఞానోదయం పొందారా? అని అడిగితే – అలాంటిది ఏమీ ఉండదు... ఆత్మసాక్షాత్కారం పొందడం అంటే ఆత్మసాక్షాత్కారం పొందడం - అంతే...!  కానీ ఒక మనిషిగా చూస్తే, ఈయనకు వున్న తెలివితేటలు, వివేకం మరెవ్వరికీ ఉండి ఉండవు. ఈరోజున గొప్ప శాస్త్రవేత్తలని ఈయనతో పోల్చి చూస్తే, ఈయన ముందు వారు చిన్న పిల్లల్లా అనిపిస్తారు. ఈయన జీవితం పట్ల అవగాహన ఎంత నిశితమైనదంటే, మీకు ఈయన ఒక మానవుడే అన్న విషయం నమ్మశక్యం కాదు. ఈయన భాషా పరిజ్ఞానం కానీ, గణితం కానీ, ఖగోళశాస్త్ర జ్ఞానం కానీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ రోజున పండితులు ఇది ఒక మనిషి చేసిన పనే అయి ఉండకపోవచ్చును – అని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇది అంత పెద్దది. ఇది ఒక మనిషి వివేకంలో ఎలా ఇమడగలదు?... అన్నది వారి అనుమానం. నిజానికి ఇది ఈయన ఒక్కడు చేసిన పనే...!యోగా

బహుశ ఇది ఈ భూమ్మీద ఉన్న అతి గొప్పదైన రచన అయ్యి ఉండవచ్చు. ఈయనను నవీన యోగానికి పితామహుడు అని అంటారు. ఈయన యోగాని కనిపెట్టలేదు. యోగా అప్పటికే ఎన్నో రూపాలలో ఉంది. ఈయన వాటన్నింటినీ సమీకరణం చేశారు. ఆదియోగి శివుడు, యోగాన్ని సప్త ఋషులకు ప్రసరింపచేశారు. సప్త ఋషులు ఎన్నో వేల సంవత్సరాల క్రితం వారు. మానవ తత్త్వాన్ని గురించిన అవగాహన, అతి గొప్ప స్థాయిలో ఆదియోగికి ఉంది. కానీ ఆయన దేనినీ రాయలేదు. ఆయన ఒక పండితుడు అవడానికి కొంచెం మొరటైన మనిషి. ఆయనకి తెలిసినదంతా కూడా కేవలం ఒక మనిషికే ప్రసరింపచేయటం కష్టమని, ఆయన ఏడుగురిని ఎంచుకున్నారు. ఈ ఏడుగురికి  యోగాలోని విభిన్నమైన అంశాలను ప్రసరింపచేశారు. అందుకే మౌలికంగా ఏడు రూపాలలో మనకి యోగా వుంది. ఈరోజుకి ఇది వందలకొలదీ వ్యవస్థలుగా ఉన్నప్పటికీ, యోగా ఇంకా ఈ ఏడు రూపాలుగానే చూడబడుతోంది.

యోగ సూత్రాలు

ఎంతోకాలం తరువాత పతంజలి వచ్చారు. ఈయన వీటన్నిటినీ ఒక్కటిగా సమీకరణ చేశారు. ఇది ఎంతో వైవిధ్యం కలది, ఎంతో సంక్లిష్టమైనది – అని ఆయన తెలుసుకుని ప్రజలు దీనిని అర్థం చేసుకునే విధంగా ఈయన యోగాలోని అన్ని అంశాలను ఒక విధంగా సమకూర్చి ఓ సమాహారంగా చేసారు. వీటినే మనం యోగసూత్రాలు అంటాము. సూత్రం అనేది ఒక దారం వంటిది. నవీన పరిభాషలో చెప్పాలంటే దీనిని ఒక ఫార్ములా లేదా సిద్ధాంతం అనవచ్చు. ఇప్పుడు ఒక కిండర్గార్డెన్ పిల్లవాడుకూడా E=mc2 అనగలడు. కానీ దీని వెనకాల ఎంతో గొప్ప విజ్ఞానం వుంది. ఇది ఒక చిన్న ఫార్ములా అయ్యి ఉండవచ్చు. కానీ ఎంతోమందికి అర్థం కాదు. సూత్రాలు అనేవి ఇలాంటివే.

ఈయన మీకు ఇందులో ఏ విధమైన సాధనము నేర్పించరు. ఈయన ఇది ఉద్దేశ్యపూర్వకంగానే ఈ విధంగా చేశారు.

కాకపోతే అజ్ఞానం వల్ల  ప్రజలు ఈ సూత్రాలనే ఆచరణలో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఒక సూత్రంగా దానితో మనమేమీ చేయలేము. ఒక సూత్రం లేకుండా ఒక హారం ఉండదు. కానీ, ఎవరూ సూత్రం కోసం హారాన్ని ధరించరు... కదా? ఈ సూత్రాన్ని ఎందుకిచ్చారంటే, ప్రతి గురువుకూడా ఆయనకి నచ్చిన విధంగా హారాన్ని చేసుకోవడానికి వీలుగా ఈ సూత్రాన్ని ఆయన మనకి అందించారు. మీరు దానిమీద పూవులైనా పెట్టవచ్చు, దానిమీద మీకు నచ్చిన పూసలైనా గుచ్చవచ్చు. అందులో ముత్యాలైనా పెట్టవచ్చు, వజ్రాలైనా పెట్టవచ్చు. కానీ, ఏది పెట్టడానికైనా - ఈ సూత్రం అన్నది ఎంతో ముఖ్యం అయినది. కానీ, సూత్రం తనకి తానుగా హారం అవ్వలేదు. మీరు, ఈ సంస్కృతి గురించి తెలుసుకుంటే తప్ప; మీకిది  అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైన విషయం. పతంజలి ఎటువంటివారో అర్థం చేసుకోవాలంటే మీకు కొంచెం కష్టమైన విషయం. వేదాలు, ఉపనిషత్తులు వంటి భారతీయ గ్రంథాలు వాటికవే ఎంతో అద్భుతమైనవి. భాషాపరంగా గానీ, సాహిత్యపరంగా కానీ ఎంతో అద్భుతమైనవి. యోగ సూత్రాలను ఏ గ్రంథాలతో పోల్చినప్పటికీ ఇవే ఎంతో గొప్ప రచన అని చెప్పవచ్చు. ఈ భూమి మీద ఉన్న జీవం గురించి; ఆ తరువాత ఉన్న జీవం గురించి అవి మాట్లాడతాయి.

ఇది జీవితం గురించిన ఒక గొప్ప గ్రంథం. కానీ, ఇది భూమ్మీద ఉన్న గ్రంధాలోకెల్లా చాలా అనాసక్తంగా ఉంటుంది. మీకు ఇందులో గొప్ప పాండిత్యమేమీ కనబడదు. ఈయన మీకు ఇందులో ఏ విధమైన సాధనము నేర్పించరు. ఈయన ఇది ఉద్దేశ్యపూర్వకంగానే ఈ విధంగా చేశారు. ఆయనకి భాషపట్ల అవగాహన ఎంత గొప్పదంటే, మరి ఏ పండితుడూ దీనిపట్ల ఆసక్తి చూపించడు. ఇక్కడ ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే, ఇది, మీ జీవితాన్ని తెరవడానికి ఒక సూత్రం లాంటిది. ఇది ఒక కవిత్వంలానో, ఒక సాహిత్యంలానో ఉంచితే ప్రజల్లో విభిన్న వర్గాల వారు, పండితులు దీనిని చదువుతారు. ఒకసారి వాళ్ళు దీనిని చదివిన తరువాత, దీనికి వంద రకాల అర్థాలు తీస్తారు. ఒక సూత్రం అంటే ఎవరికైతే కొంత అవగాహనతో కూడిన అనుభవం ఉంటుందో, వారికే ఇది అర్థమౌతుంది. లేకపోతే, అవి కేవలం కొన్ని పదాలు. వాటికి ఎటువంటి అర్థం ఉండదు. ఎవరైతే వారి చైతన్యాన్ని శోధిస్తున్నారో వారికి ఒక నిర్దిష్ట స్థాయి, అనుభవం ఉంటుంది. వారు ఒక సూత్రం చదివినా సరే, అది వారికి ఒక విస్ఫోటనంలా మారిపోతుంది. వీరు పుస్తకమంతా చదవనవసరం లేదు. ఒక్క సూత్రం చదివి, దానిని మీ జీవితంలో నిజం చేసుకుంటే; అది సరిపోతుంది. దానితో మీరు జ్ఞానోదయం పొందవచ్చు.

ఇక, ఇప్పుడు యోగ...

ఈయన ఎలాంటివారో మీరు అర్థం చేసుకోవడానికి – ఒక విషయం చెపుతాను. ఈయన ఇంత గొప్ప గ్రంథాన్ని ఒక సగం వాక్యంతో మొదలు పెడతారు. ఇది ఎంతో విచిత్రంగా వుంటుంది. కనీసం ఒక పూర్తి వాక్యంతో కూడా ఈయన దీన్ని మొదలు పెట్టలేదు.... ఒక సగం వాక్యంతో...!  “ఇక ఇప్పుడు యోగా...”  దీనిని  మీరు ఏమి అర్థం చేసకుంటారు..? భాషాపరంగా అయితే దీనికి ఎటువంటి అర్థం లేదు. కానీ అనుభవపూర్వకంగా ఆయన ఏమి చెపుతున్నారంటే...మీరు ఇంకా ఒక కొత్త ఇల్లు కట్టుకోవడం తోనో, లేక మరొకరిని వివాహం చేసుకోవడం వల్లో, లేకపోతే మీ కూతురు వివాహమైతేనో - మీ జీవితం మెరుగుపడుతుంది అనుకుంటే మీకు ఇంకా యోగాకు సమయం రాలేదని అర్థం.

మీరు జీవితంలో ధనాన్ని, శక్తిని, డబ్బుని, సుఖాలనీ – అన్నీ రుచి చూసిన తరువాత ... మీరు ఇవన్నీ మీకు మోక్షాన్ని కలిగించవు అన్న విషయాన్ని మీరు తెలుసుకుంటే - అప్పుడు మీకు యోగానికి సమయం. అంటే పతంజలి – ఈ ప్రపంచం అంతా దేని వెంట అయితే పడుతుందో, దానంతటినీ ఒక అర వాక్యంతో తీసి పారేశారు. ఆయన మొదటి సూత్రం ఇదే – “ ఇక ఇప్పుడు యోగా...” అంటే, మీకు మరేదీ పనిచేయదు అనీ, ఇదంతా ఏమిటి అన్నది మీకు అవగాహన కాలేదు అని తెలియటం. ఈ అజ్ఞానం మిమ్మల్ని బాధ పెడుతోందని అర్థం.  అప్పుడు మీకు యోగా – అంటే,  జ్ఞానానికి ఒక మార్గం దొరుకుతుంది.

పతంజలి యోగ సూత్రాలను ఒక పుస్తకం అనడం సరికాదు. ఎందుకంటే, ఇది ఒక సంక్లిష్టమైన సాధనల సమాహారం.

పతంజలి యోగ సూత్రాలను ఒక పుస్తకం అనడం సరికాదు. ఎందుకంటే, ఇది ఒక సంక్లిష్టమైన సాధనల సమాహారం. ఇవి ఎంతో అద్భుతమైన సాధనాలు. ఎంతో గొప్పగా వీటన్నిటినీ కూర్చారు.  ఇటువంటిదీ, కనీసం దీనికి దగ్గరలో ఉన్నటువంటిది; మళ్ళీ ఎప్పుడైనా జరుగుతుందా అన్నది – ఒక ప్రశ్న. ఎందుకంటే, ఈ రకమైన అంతర్ముఖ అనుభవం ఉన్నవారు సాధారణంగా ఇలా గ్రంథాలు రాయాలని అనుకోరు. ఎవరైతే ఇలా గ్రంథాలు రాయాలని అనుకుంటారో వారు పాండిత్యంలో ఎంతగా మునిగిపోతారంటే; వారికి ఇటువంటి అంతర్ముఖ అనుభూతి కలుగదు. ఇంతకుమునుపెన్నడూ,   ఇటువంటి వ్యక్తి ఇంత అంతర్ముఖ జ్ఞానం - అనుభూతి, రెండూ కలిగిన వ్యక్తి,  భాషపట్ల ఇటువంటి పరిజ్ఞానం, పాండిత్యం ఉన్నవారు లేరు. ఈయన మానవత్వాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నారు.  కేవలం,  మనుషులుగానే కాదు, ఒక పూర్తి విజ్ఞానంగా - మానవ దేహాన్ని, మానవ మనస్సునీ, మానవ చైతన్యాన్ని – ప్రతీదాన్నీ ఎంతో క్షుణ్ణంగా పరిపూర్ణంగా అర్థం చేసుకున్నారు.

ఇంతకంటే సరళంగా, ఇంతకంటే మెరుగ్గా చూసే విధానమే లేదు. ఇది ఎలాంటిదంటే – మీరేం  చెప్పాలని చూసినా సరే ఈయన దానిని ఇంతకుమునుపే చెప్పేశారు. ఇది ఎంతో గొప్ప ఆలోచన అనుకుని మీరు ఏదైనా చెప్పబోతే, ఆయన అది అంతకు ముందే చెప్పేశారు. మీకు జీవితం గురించి చెప్పడానికి ఈయన ఏమీ మిగల్చలేదు. ఒక గొప్ప సంగీతకారుడు. ఈయన ఎన్నో రకాల వాయిద్యాలను వాయించేవారని ఒక గొప్ప సంగీతకారుడని  చెపుతారు. అన్నిటిలోకి వీణ ఈయనకి ఎంతో ప్రియమైనది. ఈయన ఎన్నో రాగాలను చేశారు. ఈయన తెలివి తేటలు ఎంత గొప్పవంటే – ఈయన దేనినైనా నేర్చుకోగలరు. ఈయన అన్నిటినీ ఎంత గొప్పగా చేశారంటే – మళ్ళీ ఈ విధంగా ఎవరూ చేయలేరేమో అన్న విధంగా చేసేవారు.

ప్రేమాశిస్సులతో,
సద్గురు