Sadhguruఎంతో దురదృష్టకరమైన ఒక విషయమేమిటంటే; మనం మానవజాతిని లింగభేదంతో విభజిస్తున్నాము. ఇది ఈ కాలంలో అవసరం అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే, ఎన్నో శతాబ్దాలుగా స్త్రీలని మనం విభిన్న రకాలుగా దోపిడీకి గురిచేస్తూనే ఉన్నాం. మానవ సమూహాలు ఈ విధంగా తయారయినప్పుడు సహజంగానే పురుషత్వం అన్నది రాజ్యం చేస్తుంది. మానవ జాతి ఇలా కలహాలే ముఖ్యం అనుకున్నప్పుడు, పురుషత్వమే రాజ్యం చేస్తుంది. ఎందుకంటే పురుషులకే అటువంటి శక్తి వుంది కాబట్టి.

ఒక సమూహాన్ని మనం సమానత్వం మీద ఎప్పుడు రూపొందించగలమంటే - మనం సామాజికంగా కొంత స్థిరత్వం తీసుకురాగలిగినప్పుడు. కేవలం మనుగడే జీవితంలో అత్యుత్తమం అనుకోనప్పుడు మాత్రమే ఇది చేయగలం. మనుగడ కేవలం జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే. నాగరికతల్లో మనం ఒక కళని, నృత్యాన్ని, సౌందర్యాన్ని కూడా ఎంతో ముఖ్యమైన విషయంగా భావించినప్పుడు మనకి ఎకనామిక్స్, సైన్యం... మిగతావి ఎంత ముఖ్యమైనవో – అంత ముఖ్యమైనవిగా వీటిని కూడా భావించినప్పుడే, స్త్రీ తనకు తగిన స్థానాన్ని సమాజంలో పొందగలదు.

మన జీవితాలు అందంగా ఉండాలంటే -  స్త్రీత్వం అనే అంశం  మన చుట్టూరా ఉండాలి.

పురుషత్వం ఎలా అయితే మన జీవితానికి ఒక విలువని తీసుకొస్తోందో – స్త్రీత్వం కూడా మన జీవితానికి ఒక విలువని తీసుకొస్తుంది. మనం, ఈ రెండు విలువలూ మన జీవితంలో ముఖ్యమైనవే అని గ్రహించగలిగితే తప్ప; నిజమైన సమానత్వంగానీ, న్యాయంగానీ, ఒక నాగరికతగానీ చేకురిందని మనం చెప్పలేం. మేధస్సు, సున్నితత్వం, అవగాహన – ఇవన్నీ కూడా జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయాలైనప్పుడు మాత్రమే లింగ భేదం అన్నది సమసిపోయి లింగ-సమానత్వం వస్తుంది. ఇప్పుడు మనము చేయవలసింది ఏమిటంటే, అందరిలోనూ ఈ ఎరుకను తీసుకుని రావాలి. స్త్రీత్వం మన జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం అన్నది పురుషత్వం ఎరుకలోకి తీసుకురావాలి. మీడియా ద్వారా, మన విద్యా వ్యవస్థ ద్వారా, మన సాంఘిక వ్యవస్థలద్వారా ఈ విషయాన్ని మనం అందరికీ తెలియబరచాలి.

మన జీవితాలు కేవలం డబ్బు సంపాదించడం ద్వారా అందంగా మారవు, కేవలం మనం ఎదో కట్టుకోడం వల్ల జీవితాలు అందంగా ఉండవు. మన జీవితాలు అందంగా ఉండాలంటే -  స్త్రీత్వం అనే అంశం మన చుట్టూరా ఉండాలి. అప్పుడు మాత్రమే అన్నీ ఎంతో అందంగా ఉంటాయి. మనం దేనిని పురుషత్వం, స్త్రీత్వం అని అంటున్నామో – అవి ప్రకృతిలో రెండు తత్త్వాలు, రెండు గుణాలు. వీటికి లింగంతో ఎటువంటి సంబంధం లేదు.

మీలో స్త్రీత్వం, పురుషత్వం రెండూ కూడా వుంటాయి. అందువల్ల; మన దేవుళ్ళు కూడా ఈ విధంగానే సూచించబడ్డారు కదా..?

పురుషులు – స్త్రీత్వాన్ని, స్త్రీ గుణాలని కలిగివున్నవారు ఎంతోమంది ఉండవచ్చు. అలానే, స్త్రీలు పురుషత్వాన్ని ఎంతోమంది మగవారి కంటే బాగా గ్రహించగలిగి ఉండవచ్చు. ఇది, ఈ సమాజం తెలుసుకోవాల్సి ఉంది. ఒకరి శరీరం స్త్రీగా గానీ, పురుషునిగా గాని ఉండవచ్చు. కానీ, వారి తత్వం – స్త్రీత్వంగా గానీ, పురుషత్వంగా గానీ, లేదా ఈ రెండిటి కలయికగా గానీ ఉండొచ్చు. మన సంస్కృతిలో, మన దేశంలో, అంతర్ముఖంగా చూడడం అన్నది ఎంతో ముఖ్యమైన అంశం. మన జీవితాల్లో ఎంతో ముఖ్యమైన అంశం. అంతర్ముఖులయ్యి, మీలోకి మీరు తగినంతగా చూసుకుంటే, మీరు, ప్రతివారూ కూడానూ, ఎటువంటి శరీరంలో ఉన్నా సరే – స్త్రీ శరీరంలో ఉన్నా, పురుష శరీరంలో ఉన్నా సరే ... మీలో స్త్రీత్వం, పురుషత్వం రెండూ కూడా వుంటాయి. మన దేవుళ్ళు కూడా ఈ విధంగానే సూచించబడ్డారు కదా..? శివుడు – అర్ధనారిగా ... ఈయన సగం పురుషుడు, సగం స్త్రీగా చూపించబడ్డారు.

మనం ఈ రోజుని “స్త్రీల దినోత్సవం” గా కాకుండా, మనం “స్త్రీత్వానికి ఇదొక దినోత్సవం” గా భావించాలి. స్త్రీత్వం అన్నది ముందుకు వచ్చి ఈ ప్రపంచంలో ఎన్నో చేయాలి. ఈ స్త్రీత్వాన్ని  వేడుక చేసుకుంటున్న రోజున, నేను దీనిని స్త్రీల రోజు అనకుండా; దీనిని స్త్రీత్వానికి సంబంధించిన రోజు అని అనాలనుకుంటున్నాను. మన సంస్కృతిలో మనం స్త్రీలను, స్త్రీత్వాన్ని – ఎన్నో వేల సంవత్సరాలుగా కొలుస్తున్నాము. మనం, ఆ రకమైన ఆధ్యాత్మికత మన సంస్కృతిలో తీసుకునిరావాలి. ప్రతివారి జీవితం, ప్రతివారి జీవితానుభూతి కేవలం శరీరానికి పరిమితం కాకూడదు. ప్రతీవారు కూడా శరీరానికి మించినదేదో చూడాలి; తానెవరు అన్నది తెలుసుకోవాలి. లింగభేదం అన్నది కేవలం శరీరానికి సంబంధించినది. మీరు భౌతికతను దాటి అనుభూతి చెందగలిగినప్పుడు; లింగభేదం అన్నది మీ జీవితంలో కేవలం ఒక చిన్న అంశం మాత్రమే అవుతుంది.

న్యాయం సరిగ్గా అమలు అవ్వాలంటే, దానికి అనుకూలమైన సామాజిక పరిస్థితులు రావాలి.

ఎన్నో స్థాయిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. మనం స్త్రీలని ఎన్నో విధాలుగా దోపిడీలకు గురిచేయడం మానేసేయాలి. మనం చట్టబద్ధంగా దీనిని మానేశామేమో..! కానీ, సామాజికంగా ఇది ఇంకా జరగడంలేదు. దీనికోసం మనం, రోడ్లమీద పడి పోట్లాడుకొనక్కర్లేదు. కానీ, మనం న్యాయాన్ని సరిగ్గా అమలు జరిగేలా చూడాలి. న్యాయం సరిగ్గా అమలు అవ్వాలంటే, దానికి అనుకూలమైన సామాజిక పరిస్థితులు రావాలి. అనుకూలమైన సామాజిక పరిస్థితులు రావడమన్నది జ్ఞానం వల్లే జరగాలి. ఇది విద్యాబోధన వల్ల, ఒక రకమైన ఆర్థిక వ్యవస్థ వల్ల జరగాలి. ఈ రెండూ గనక జరిగితే; అపుడు స్త్రీలు, వారి స్వేచ్చ గురించి పోరాడనక్కరలేదు. వారు స్వేచ్చగానే ఉంటారు.

ప్రేమాశిస్సులతో,
సద్గురు