Sadhguruనేను ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ఎంతోమంది మనుషులు బాధతో, దుఃఖంతో, విచారంతో ఉన్న మొహాలతో తిరుగుతూ ఉండడం నేను చూస్తాను. ఈ ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ ప్రతీ సమస్య ఒక ‘ఆవశ్యకతే’. మీరు కనక ప్రతీ సమస్యని దాని కొమ్ములతో పట్టుకుని తిప్పడం ఎలాగో  నేర్చుకున్నారంటే, మీలోని ఒక మేధస్సుకి మీరు తాళం తెరిచినట్టే. అలాంటప్పుడే మీరు మీలోని ‘అంతః మేధస్సుని’ సృజించగలుగుతారు. ఇది ప్రతీ మానవుడిలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ లోతైన మేధస్సు, ఈ కోణం మీలో తెరుచుకుంటుందో అప్పుడు మీరు సృష్టికర్తలాగా పని చేయగలుగుతారు. మీరు ఈ ప్రకృతి ధర్మాలను పాటిస్తూనే, ఏదైనా చేయగలుగుతారు. అదే దాన్ని కనక మీరు అడ్డుకుంటే అప్పుడు పరిణామానికి, ఎదుగుదలకి అవకాశమే లేదు.

ఏదైతే పరిణామం చెందదో, ఏదైతే మార్పు చెందదో అది చనిపోయిన దానితో సమానం.

ఏ విత్తనమైతే మొలకెత్తదో అది వృధా అయిపోయిన విత్తనమే. మొలకెత్తడం అంటే అది దానిలో ఉన్న పాతదనాన్ని వదిలేసి ఏదో కొత్తది అవడానికి సిద్ధంగా ఉన్నట్టే. ఒక విత్తనం గానే ఉండడంలో సురక్షితం ఉంది. ఎందుకంటే విత్తనంలో ఒక తొడుగు ఉంది కాబట్టి. ఒకసారి అది మొలకెత్తినప్పుడు సున్నితంగా మారుతుంది. మీరు కూడా పరిణామం చెందాలనుకున్నప్పుడు, కొంత సున్నితత్వం ఉంటుంది. ఈ సున్నితత్వానికి కనక మీరు సిద్ధంగా లేకపోతే మీరు పరిణామం చెందడానికి సిద్ధంగా లేనట్టే. ఏదైతే పరిణామం చెందదో, ఏదైతే మార్పు చెందదో అది చనిపోయిన దానితో సమానం. ఎందుకంటే సజీవంగా ఉన్నది ఎల్లప్పుడు మార్పు చెందుతూనే ఉంటుంది.

ఆధ్యాత్మిక పధంలో ఉంటూ కూడా మీ ధోరణుల వల్ల, తత్వాల వల్ల మిమ్మల్ని మీరు మిగతా సృష్టి నుంచి వేరు చేసుకుంటే,  మీ జీవితాన్ని వృధా చేసినట్టే. ఈ అనుగ్రహానికి పాత్రులవ్వడం ఎన్నో జన్మలకు ఒకేసారి కలిగే అవకాశం. మీరు ఈ అవకాశాన్ని ఇలా వృధా చేసేస్తే, అది నన్ను బాధపెడుతుంది. మీ జీవితాల చుట్టూరా, ప్రతిదాని చుట్టూరా గోడలు కట్టుకోకండి. ఏవైతే ‘స్వయం సంరక్షణ’ అనుకుంటున్నారో అవే ‘స్వయం నిర్బంధిత గోడలు’ కూడాను.

గోడలు 

కీచురాయి అరుపులు
హృదయవిదారకమైన
ప్రేమగీతి కావచ్చు. 
ఒక బెబ్బులి గాండ్రింపు
దాని క్రౌర్యం కంటే
ఒంటరితనాన్ని సూచించవచ్చు,
పెనుగాలుల ఈలలు
వాటి త్రోవపొడగునా వినాశముకంటే, 
వరప్రసాదంగా వర్షం కురిపించవచ్చు.
ఒక పాము బుస్సుమనడం
అన్నివేళలా విషం గ్రక్కడానికి కాకపోవచ్చు.
కొంపదీసి నువ్వు జీవితంచుట్టూ గోడలు కట్టుకుంటూ 
స్నేహానికై పిలుస్తున్న పిలుపులు 
తప్పిపోవడం లేదుగద!
 
ఆంగ్లంలో సద్గురు స్వయంగా రాసిన కవిత్వాన్ని ఇక్కడ చదవండి : Tear Down the Walls