Sadhguruఈశా యోగ కేంద్రంలో మహాశివరాత్రి ఎల్లప్పుడూ మనకో గొప్ప వేడుకే. కానీ వచ్చే 24వ తారీఖున జరుగబోయే శివరాత్రి రోజున మనం 112 అడుగుల “ఆదియోగి ముఖాన్ని” ప్రాణప్రతిష్ట చేయబోతున్నాము. ఇది అన్నింటిల్లోకి ఎంతో విశేషంగా ఉంటుంది. నిజంగా! ఇంకా ప్రాణప్రతిష్టకు ఐదు వారాలు ఉండగానే, ఈ అద్భుతమైన  వదనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సహజంగానే ఒక ప్రశ్న ఉత్పన్నమౌతుంది. ఇంత పెద్ద ముఖాన్ని సృజించడం ఎందుకు? ఇది సౌందర్యం కోసమా? మీరు ఆదియోగి ముఖాన్ని చూసినట్లైతే దానిలో జామితి పరమైన సౌందర్యం ఉంది. ఏదయినాసరే జామితిపరంగా పరిపూర్ణంగా లేకపోతే మనకు సౌందర్యవంతంగా అనిపించదు. “ఆదియోగి” కేవలం సౌందర్యం కోసం కాదు, దీనికి జామితి పరమైన ప్రాముఖ్యత ఉంది.

“ఆదియోగి” పక్కన “యోగేశ్వర లింగం” కూడా ప్రాణ ప్రతిష్ట చేస్తాం. ఇది మహాశివరాత్రికి ముందు రోజుల్లో చేస్తాం. ఈ యోగేశ్వర లింగం సాన్నిధ్యంలో “ఆదియోగి” రోజురోజుకి మరింత శక్తివంతం అవుతుంది. ఈయనకు జామితి పరంగా సరైన పోలికలు ఉండడం వలన అన్నిటిల్లోకి ఉన్నతమైన శక్తిని కూడగట్టుకుంటారు. మీరు కూడా జామితిపరంగా సరైన భంగిమల్లో ఉంటే ఉన్నతమైన దాన్ని పొందవచ్చు. “యోగా” అంతా దీని గురించే. ఆదియోగి ముఖం ఒక ‘సారూప సాన్నిధ్యం’. ఇది ఈ ప్రపంచాన్ని ముక్తివైపుగా మళ్ళిస్తుంది. మానవాళిని మతం వైపు నుంచి, బాధ్యత వైపుకు నడిపించేందుకు ఆదియోగి ఒక మేల్కొలుపు. మనం బాహ్యప్రపంచానికి వచ్చేసరికే అన్ని సరైన రీతిలో చేయాలనుకుంటాం. శాస్త్రీయంగా చేయాలనుకుంటాం. మనకు అర్ధమైనంతవరకు సాంకేతికతని, సాధనాలను వాడాలనుకుంటాం. కానీ అంతర్ముఖ శ్రేయస్సుకు వచ్చేసరికే అన్ని స్వర్గంలో ఉన్నాయని అనుకుంటాం. ఇది మన వ్యక్తిగతమైన జీవితాల్లో ఎన్నో అంశాల్లో కనిపిస్తుంది.

అంతర్ముఖ శ్రేయస్సుకు సంబంధించిన ఈ శాస్త్ర, సాంకేతికతలకు ఆదియోగి సుందర వదనం ప్రతీకగా నిలుస్తుంది.

చాలాకాలం వరకు ప్రజలు వివాహాలు స్వర్గంలో చేయబడతాయి అని అనుకునేవాళ్లు లేదా వివాహానికి సంబంధించి -  వివాహం అనుకూలంగా ఉంటుందా? లేదా? అనేది జాతకాలు చెప్తాయని అనుకునేవాళ్లు. ఈ మధ్యే వారు అనుబంధాలు సరిగ్గా  ఉండాలి అనుకుంటే, మీరు బాధ్యతాయుతంగా, వివేకంతో ప్రవర్తించాలి అన్న విషయాన్ని  తెలుసుకున్నారు. అది ఆరోగ్యమైనా సరే, మీ ప్రశాంతతైనా సరే, లేదా ఆనందమైనా సరే, ఏది స్వర్గంలో లేదు, అది మీలోనే ఉంది. మీరు సరైన అవగాహనతో సమీపిస్తే, దాన్నే మనం 'శాస్త్రం' అంటాం. మీరు దాన్ని మీకు అనుకూలంగా మలుచుకునేందుకు సాధనాలను తయారు చేస్తే దాన్ని 'సాంకేతికత' అంటాం. ఇదే  "ఇన్నర్ ఇంజనీరింగ్'. ఈ ఆదియోగి  మహత్తరమైన ముఖం దీనికి ప్రతీకగా  నిలుస్తుంది.  అంతర్ముఖ శ్రేయస్సుకు సంబంధించిన ఈ శాస్త్ర, సాంకేతికతలకు ఆదియోగి సుందర వదనం ప్రతీకగా నిలుస్తుంది.

మనం “ఆదియోగి” మీద ఒక పుస్తకం విడుదల చేయబోతున్నాము. అందులో ఆయన ఈ శాస్త్రాన్ని ప్రపంచానికి ఎలా అందించారు, దాని ప్రాముఖ్యత ఏవిటి - అన్నవి వివరిస్తాం. వచ్చే 10 ,15 సంవత్సరాల లోపు, ఈ ప్రపంచం అంతా కూడా శ్రేయస్సుకోసం పైకి చూడడం మానేసి, అంతర్ముఖంగా చూసేలాగా చేయాలన్నదే మా ధ్యేయం. ఎందుకంటే అంతర్ముఖంలోనే మీరు మీ శ్రేయస్సుని పొందగలరు. మీరు అందరూ కూడా, మీ సామర్థ్యం మేరకు ఇందులో పాలు పంచుకోవాలని  నేను కోరుకుంటున్నాను. ఈ రోజున మనం పెద్ద సమూహాల్లో ప్రజలను చేరుకునేందుకు సాంకేతికత ఆవశ్యకత ఉంది. బాహ్యంగా ఎటువంటి ఊతం అవసరం లేదు, అంతర్ముఖంగా తిరిగే, మీరు మీ శ్రేయస్సుని చేకూర్చుకోగలరు. ఇది మనం ఇప్పుడు బోధించగలుగుతాం. ఈ నెల 20-23 తారీఖుల్లో “యోగేశ్వర లింగాన్ని” ప్రాణ ప్రతిష్ట చేస్తాం. ఆ తరువాత “ఆదియోగి ముఖాన్ని” మహాశివరాత్రి రోజున ప్రాణ ప్రతిష్ట చేస్తాం. మనం ఈ లింగాన్ని ఏ విధంగా శక్తివంతం  చేస్తాం అంటే కేవలం ఒక పదార్థపు గుట్టగా ఉన్నది ఒక, మూడు నాలుగు రోజుల్లో ఎంతో విశేషంగా ప్రకంపిస్తుంది. ఇది మీరు అనుభూతి చెందడానికి, దీనికి అవసరమైన సున్నితత్వం మీకు ఏర్పడ్డం కోసం  కొన్ని ప్రక్రియలను ఏర్పాటు చేస్తాం. ఒక ప్రతిష్ట తన చుట్టూ ఉన్న పరిసరాల్ని ఎంతలాగా మార్చేయగలదు అన్నదాన్ని  మీరు స్పష్టంగా చూడగలుగుతారు.

శివడు ఒక నాట్యకారుడు, వైద్యుడు, గురువైన దక్షిణామూర్తి, భయాన్ని తొలగించే భైరవుడు.

ఈ  ఆవశ్యకతను మూలం చేసుకునే మన సంస్కృతిలో అన్ని దేవతలను తయారు చేశారు. అందుకే మనకు 33 కోట్ల దేవుళ్ళు, దేవతలు భారతదేశంలో ఉన్నారు. ఎందుకంటే మనకు దేవతలను ఎలా తయారుచేయాలి అన్న  సాంకేతికత తెలుసు. ఒక రూపాన్ని జామితిపరంగా, పరిపూర్ణంగా  ఉండేలాగా సృజించి, దాన్ని ఒక నిర్దిష్టమైన విధానంలో, శక్తివంతం చేసి, దాన్ని మనం అనుసంధానం చేసుకొని, ఉపయోగించగలిగేలా  కొన్ని పద్ధతులను తయారుచేశాం. ఏ శక్తినైతే మనం శివ అంటున్నామో, లేదా ఏ శక్తికి  ఆకారం లేదో  - “శివ” అంటే అర్ధం, ఏదైతే లేదో, ఏది నిరాకారమైనదో అది అని – ఈ శక్తి ఎన్నో విధాలుగా అభివ్యక్తమవ్వగలదు. భారతీయ సంప్రదాయంలో దీనిని ఇలా అర్ధం చేసుకోవటం సర్వ సాధారణం. శివడు ఒక నాట్యకారుడు, వైద్యుడు, గురువైన దక్షిణామూర్తి, భయాన్ని తొలగించే భైరవుడు. ఇలా వేల పేర్లతో, పలు విధాలుగా అవిష్క్రుతమవుతున్న ఒకే శక్తి.  ప్రజల నిర్దిష్ట అవసరాలు నేరవేర్చటం కొసం, విభిన్న  ప్రయోజనాల కోసం  ప్రతిష్టాపనలు చేసారు.

ఆదియోగి, మిమల్ని  మీ వ్యాధుల నుంచి విముక్తి చేసేందుకు, ఇబ్బందుల నుంచి విముక్తి చేసేందుకు, నిరాశ్రత నుంచి విముక్తి చేసేందుకు, పేదరికం నుంచి విముక్తి చేసేందుకు -  అన్నిటికీ మించి జీవన్మరణాల ప్రక్రియ నుంచి కూడా మీకు విముక్తి కల్పించేందుకు, ఇక్కడ ఉంటారు. యోగేశ్వరుడు, ప్రధానంగా ముక్తి కల్పించేందుకే. అందుచేతనే మనం ఆయనను యోగా కేంద్రానికి కొద్దిగా అవతల ఏర్పాటు చేస్తున్నాం. దానివల్ల ఈశా ఫౌండేషన్ నియమ నిబంధనల్లో కాకుండా ఆయన చేయదలచుకున్నది చేసే వెసులుబాటు ఆయనకు ఉంటుంది..! ఆయన చేయదలచుకుంది ఆయన చేసేందుకు వీలుగా ఆయనకు స్వేచ్ఛ కల్పిస్తున్నాం. ఆయనకు ఎలా కావాలంటే అలా పని చేసుకోవచ్చు. ఆదియోగి ముఖారవిందం మీ చైతన్యంలో ముద్రించుకుపోతుంది. మీరు ఎక్కడికి వెళ్లినాసరే, ఆయన ముఖం మీతోనే ఉండి, మిమల్ని అంతర్ముఖులని చేస్తుంది. ఈ పరిణామం, మీ ఆలోచనలకు భావాలకంటే పై స్థాయిలోనిది.

అంతకముందు చేసినవాటన్నిటికంటే ఈ ప్రతిష్ట ఎంతో విభిన్నంగా  ఉండబోతుంది. ధ్యానలింగ ప్రాణప్రతిష్ఠ కూడా దీని లాగానే ఉన్నా, అది  దీనికంటే  మరింత సంక్లిష్టమైన.ది దానితో పోలిస్తే ఈ ప్రాణప్రతిష్ఠ చాలా సరళమైనది, కానీ ఇది ధ్యానలింగంతో పోలి ఉంటుంది  ఎందుకంటే ,ధ్యానలింగం, యోగేశ్వరుడు ఇద్దరూ కూడా ముక్తి కోసమే కేంద్రీకృతమైనవారు.

మీకు  స్థిరత్వం లేనప్పుడే దేనినైనా పట్టుకోవలసిన అవసరం వస్తుంది. మీలో స్థిరత్వం ఉన్నప్పుడు , మీకు దేన్నీ పట్టుకోవాలని అనిపించదు.

మీరు అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటంటే మామూలుగా చాలా మంది ముక్తి కోసమే తపిస్తున్నప్పటికీ, తమంతట తామే రకరకాల బంధనాల్లో చిక్కుకుపోతున్నారు.  ఏదో ఒకదానితో ముడిపడి ఉండటంలోనే క్షేమం ఉంది అన్న మానసిక స్థితి వల్లో, సమాజంలోని వారు ఇలా  ప్రభావితం చేయడం వల్లనో,  ఇలాజరుగుతుంది.  మేము  ప్రపంచంలో దీనిని మార్చాలనుకుంటున్నాo. క్షేమం అనేది బంధనల వలన కలగదు, మీరు స్వేచ్ఛగా ఉన్నప్పుడే  క్షేమంగా ఉండగలిగేది. కాని, భీతి చెందే మనసుకు  స్వేచ్చ భయంకరంగా కనిపిస్తుంది. “నేను దేనిని పట్టుకుని ఉండాలి” అన్నది ప్రశ్న. మీకు  స్థిరత్వం లేనప్పుడే దేనినైనా పట్టుకోవలసిన అవసరం వస్తుంది. మీలో స్థిరత్వం ఉన్నప్పుడు , మీకు దేన్నీ పట్టుకోవాలని అనిపించదు. చురుకుగా   ఉన్నవారు గోడల సహాయంతో నడవరు. స్థిరత్వం లేని వారు మాత్రమే గోడలను పట్టుకుని నడుస్తారు. చురుకైన, నిలకడతో నిండిన , స్థిరమైన ప్రపంచాన్ని సృష్టించాలని మేము అనుకుంటున్నాం. ఇక్కడ ప్రజల మనస్సులో,  ఏదో ఒక దాన్నిపట్టుకోవాలన్న ఆలోచనే తలెత్తదు. దేనినైనా పట్టుకోవాల్సిన అవసరాన్ని, బంధనాలు ఏర్పరచుకోవాల్సిన అవసరాన్ని  మీరు అధిగమిస్తే, మీ  సహజమైన ఆకాంక్ష ముక్తి అవుతుంది.

మనం భవిష్యత్తు కొసం సంసిద్ధమవుతున్నాం. రాబోయే దశాబ్దాలలో, మనలో నిర్మించుకుని, మనం పట్టుకు వేళ్ళాడుతున్న  ఎన్నో పాత అవరోధాలు కూలిపోతున్న కొద్దీ, మనలో ముక్తి కొసం తపన కలగడాన్ని మీరు చూస్తారు. ఈ తపన పెరిగి, ముక్తికోసం కృషి  చేసేవారికి ఆదియోగి ఇంకా యోగేశ్వర లింగం ఎంతో ముఖ్యమైన సాధనాలు అవుతాయి. దీనికొసం ఎన్నో విధానాలు ఉండి ఉండవచ్చు, కానీ ఈ సారూప సనిధ్యాన్ని - ప్రపంచంలోకెల్లా పెద్దదైన, ఈ గొప్ప ముఖాన్ని ప్రజలు విస్మరించలేరు.  నేను దీని గురించి గొప్ప ముఖం అని చెప్పినప్పుడు వేరే దేనితోనూ దీనినీ పోల్చటం లేదు. గొప్ప ముఖం అని ఎందుకన్నానంటే ముక్తి సాధనకు తపించే సాధకులకు ఇది ఒక గొప్ప అవకాశానికి తలుపు తెరుస్తుంది. ఇది దేని నుంచైనా ముక్తిని కల్పిస్తుంది. మిమ్మల్ని బంధిస్తున్న దేనినుంచైనా సరే, మీకు ముక్తిని కల్పిస్తుంది. ఈ లింగానికి సహజ గుణమే ముక్తిని ప్రసాదించటం. దీని సారూప సానిధ్యం.

మీ అంతిమ తత్వాన్ని చేరుకో గలిగిన 112 మార్గాలను, ఇక్కడ మానవాళికి అందించాలని మా కోరిక. ఇది కనక మేము విజయవంతంగా పూర్తి చేస్తే, మనం ఇంకా మెరుగైన ప్రపంచాన్ని చూస్తాం. కేవలం ఒక భౌతిక పదార్ధం ఓ సజీవ శక్తిగా ఎలా మారుతుందో మీరు ప్రాణ ప్రతిష్టలో చూస్తారు.

ఇది జీవితంలో కేవలం ఒక్కసారి మాత్రమే జరిగేది – కేవలం ఈ ప్రతిష్టను అనుభూతిచెండడం మాత్రమే కాదు, అది జరిగేలా చేయడంలో కూడా మీరందరూ పాలుపంచుకోవాలని నా ఆకాంక్ష.

ప్రేమాశిస్సులతో,
సద్గురు