Sadhguruఎదుటివారు ఎంత దగ్గరివారైతే, వారిని అర్థం చేసుకోవడానికి మీరు అంత ఎక్కువ కృషి చెయ్యాలి. మీరు ఈ ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు అనేక రకాలైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. మీ వ్యవహార పరిధులు విస్తరిస్తున్న కొద్దీ, మీరు ఎదురుకోవలసిన పరిస్థితుల సంక్లిష్టత కూడా పెరుగుతుంటుంది. మీరు ఓ చిన్నగదిలో కూర్చుని మీ కంప్యూటర్‌ మీద కేవలం మరొకరితో కలిసి పనిచేస్తున్నట్లైతే మీకు కొద్దిపాటి అవగాహన ఉంటే సరిపోతుంది. కానీ మీరు వేలమందితో కలిసి పనిచేస్తున్నట్లయితే వారందరినీ అర్థం చేసుకోవడానికి మీలో చాలా అవగాహన ఉండాలి.

వేలాదిమంది నిర్వహణ బాధ్యత మీపై ఉందనుకోండి, వారే మిమ్మల్ని అర్థం చేసుకోవాలని మీరు భావిస్తే మీరు ఏమీ నియంత్రించలేరు. ఆ వేలాది మంది శక్తిసామర్థ్యాలు ఏమిటో, వారి పరిమితులు ఏమిటో మీరు తెలుసుకోగలిగి, మీరు చేయగలిగినదేదో మీరు చేస్తేనే పరిస్థితిని కావలసిన విధంగా మలచుకోగలరు. ఈ వేలమందీ మిమ్మల్ని అర్థం చేసుకోవాలని, వారు మీకు అనుకూలంగా ప్రవర్తించాలని మీరు ఎదురు చూస్తున్నట్లయితే, అది కేవలం ఓ కలే అవుతుంది. అలాంటి కల ఎప్పటికీ సాకారం కాదు.

దురదృష్టవశాత్తు ప్రపంచంలో శత్రువుల మధ్య కన్నా అత్యంత సన్నిహితమైన అనుబంధాలలోనే ఎక్కువ సంఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.

మీకు ఒకరితో సాన్నిహిత్యం పెరిగేకొద్దీ, వారిని అర్థం చేసుకోవడానికి మీరు మరింత  కృషి చేయవలసి ఉంటుంది. అవతలి వ్యక్తిని మీరు బాగా అర్థం చేసుకుంటున్నకొద్దీ, ఆవ్యక్తి మీకు సన్నిహితునిగా, ఆత్మీయునిగా మారతాడు. ఒకవేళ అవతలి వ్యక్తి మీకన్నా ఎక్కువ అర్థంచేసుకుంటే మీ బంధంలోని ఆనందాన్ని మీకన్నా ఎక్కువ అతనే అనుభూతి చెందుతాడు. మీరు ఎక్కువగా అర్థం చేసుకుంటే ఆ సాన్నిహిత్యాన్ని మీరు మరింతగా అనుభూతి చెందుతారు. అవతలి వ్యక్తి పూర్తిగా అవగాహనరహితుడు కాదు. మీకున్న అవగాహనతో వారు మిమ్ములను మరింత బాగా అర్థం చేసుకునే పరిస్థితుల్ని మీరు సృష్టించగలరు.

మీరు ఇతరుల పరిమితులు, అవసరాలు, సామర్థ్యాలను అర్థం చేసుకోకుండా, వారే మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని, వారే మీతో కలసి నడవాలని కోరుకుంటే, మీ మధ్య కేవలం స్పర్ధలు మాత్రమే వస్తాయి; అదే జరుగుతుంది. దురదృష్టవశాత్తు ప్రపంచంలో శత్రువుల మధ్య కన్నా అత్యంత సన్నిహితమైన అనుబంధాలలోనే ఎక్కువ సంఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.

మీకు అయినవరితోనే మీరు ఎక్కువ గొడవ పడుతుంటారు, అవునా? దీనికి కారణం మీ అవగాహన స్థాయి, వారి అవగాహన స్థాయి వేర్వేరుగా ఉండడమే. మీ ఇరువురి మధ్య ఉన్న నియంత్రణ రేఖను, ఒకవేళ  మీరు దాటితే, వారికి ఆగ్రహం కలుగుతుంది. అదే వారు ఈ నియంత్రణ రేఖను దాటితే, మీకు ఆగ్రహం కలుగుతుంది. మీ అవగాహనను వారి అవగాహన స్థాయికన్నా మరింత పెంపొందించుకుంటే, వారి అవగాహన కూడా మీ అవగాహనలో భాగమైపోతుంది. అప్పుడు వారి పరిమితులు, సామర్థ్యాలను మీరు అంగీకరించగలుగుతారు. ప్రతి ఒక్కరిలోనూ కొన్ని అనుకూల లక్షణాలు, కొన్ని  ప్రతికూల లక్షణాలు ఉంటాయి. వాటినన్నిటినీ మీ అవగాహనలో భాగంగా చేసుకోగలిగితే, మీరు కోరుకుంటున్న విధంగా మీ అనుబంధాన్ని నిర్వహించుకోగలుగుతారు. అదే ఈ అవగాహన మీరు వారికే వదిలివేస్తే, అంతా యాదృచ్ఛికమవుతుంది. వారు ఉదార స్వభావులయితే మీకు అనుకూలంగా పనులు జరుగుతాయి; కాకపోతే మీ అనుబంధం అక్కడితో తెగిపోతుంది.

జీవితం ఎప్పుడూ సజావుగా సాగదు, జీవితం సాగటానికి మీరు ఎన్నో పనులు చేయవలసి ఉంటుంది.

నేను మిమల్ని ఒకటి అడుగుతున్నాను: మీ జీవితం ఎలా ఉండాలో మీరే నిర్ణయించాలనుకుంటున్నారా? మీ సంబంధాలు ఆంతరంగికమైనవైనా, వృత్తి పరమైనవైనా, రాజకీయ పరమైనవైనా, ఇంకా ఏవైనా కావచ్చు. అవి ఏవైనా మీ జీవితం ఎలా ఉండాలో నిర్ణయించే శక్తిని మీరే కావాలనుకుంటున్నారా, లేదా? అలా కావాలనుకుంటే అన్నిటినీ, అందరినీ మీ అవగాహనలో భాగంగా మార్చుకోండి. మీ అవగాహన స్థాయిని ప్రజల మూర్ఖత్వాలను దాటి గమనించగలిగేంతగా పెంచుకోండి.

మీ చుట్టూ ఉన్నవారంతా అద్భుతమైనవారే. అయినా ఒకోసారి వారూ విచిత్రంగా ప్రవర్తించవచ్చు. అది మీరు అర్థం చేసుకోలేకపోతే, వాళ్ల సాహచర్యాన్ని మీరు కోల్పోతారు. వారి అర్థరాహిత్యాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతే వారిని మీరు ఖచ్చితంగా కోల్పోతారు. అలాకాక వారిని అర్థం చేసుకుంటే, వారితో కావలసిన విధంగా మసలుకుంటారు. జీవితం ఎప్పుడూ సజావుగా సాగదు, జీవితం సాగటానికి మీరు ఎన్నో పనులు చేయవలసి ఉంటుంది. మీ అవగాహనని వదిలివేశారా మీ సామర్థ్యం పోతుంది. వ్యక్తిగత సంబంధాలైనా, వృత్తిపరమైన సంబంధాలైనా, రెంటిలోనూ మీకు అవగాహన అవసరం, అది లేకపోతే సంబంధాలు సఫలం కావు.

ఇప్పుడు మీరు బాంధవ్యాలను ఎలా నిర్వహిస్తున్నారనే దానిపై మీరున్న స్థితి, మీ బాగోగులు ఆధారపడి ఉంటాయి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి తగిన కృషి చెయ్యండి.

ప్రేమాశిస్సులతో,
సద్గురు