ఇటీవల జరిగిన సాక్షి టీవీ ఇంటర్వ్యూలో, మన దేశంలోని ప్రభుత్వ పాఠశాలల గురించీ, విద్యా విధానాల గురించి సద్గురు సమాధానాలు ఇచ్చారు.  ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి వీడియోని చూడచ్చు.

సాక్షి ఇంటర్వ్యూ

ప్రశ్న: భారత ప్రభుత్వం ట్యాక్స్‌లు వసూలు చేస్తోంది. ఎంతో ముఖ్యమైన విద్య, ఆరోగ్యం వంటి అంశాలపైన శ్రద్ధ చూపడం లేదు. మీరు కొన్ని పాఠశాలలు నడిపిస్తున్నారు..కొన్ని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ చూస్తున్నారు. ఎంతో మంది పేదవారికి ఉన్నత విద్య అందటం లేదు. ఈ సమస్య గురించి మీరేమైనా చెప్పగలరా !

సద్గురు: ఇన్‌కమ్ ట్యాక్స్ విషయానికి వచ్చేసరికి కడుతోంది  నాలుగు శాతం మందే.  అంటే ప్రభుత్వం నిజంగా పన్ను వసూలు చేయడం లేదనే చెప్పాలి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో పాఠశాలల్లో మౌలిక వసతులు కొంత మెరుగ్గానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ విద్యావిధానం ఎంత నాణ్యంగా ఉన్నది..ఎంత ఉత్తమమైన ఉపాధ్యాయులు దొరుకుతున్నారన్నది ప్రశ్న.

నాణ్యమైన విద్య  కావాలనుకుంటే వాటిని ప్రైవేటుపరం చేయాలి. ఇలా జరిగినప్పుడు వీటి ధర పెరుగుతుంది. అలాంటప్పుడు పేదలు, సామాన్యులకు  అందుబాటులో ఉండదు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు సంస్థలకు గాని, ఇతరులకు  కాంట్రాక్ట్  పద్దతిలో ఇవ్వడం మంచి పద్దతి.  ఇలా చేయడం ద్వారా వాటిని సమర్ధవంతంగా నిర్వహించవచ్చు.  ప్రభుత్వం వీటిని పర్యవేక్షించవచ్చు. . సబ్సిడి అందించ వచ్చు. అప్పుడు తక్కవ ధరతోనే వీటిని గ్రామీణ ప్రాంతాల్లో నడిపించవచ్చు. మనకున్న ముఖ్య వనరు జనాభా. జనాభాను ఎంత సమర్ధవంతంగా తయారు చేసుకోగలిగితే  మనం వచ్చే తరంలో అద్భుతాలను చూడగలుగుతాం. అలా  చేయలేకపోతే అదో పెద్ద విపత్తవుతుంది.

మనం ఎంత ఎక్కువ మందిని పాఠశాలకు పంపుతున్నామన్నది ముఖ్యం కాదు. బహుశా ప్రపంచంలో అత్యధిక పిల్లలు చదువుకుంటున్న దేశం బహుశా మనదేనేమో. కాని మన దేశ శ్రేయస్సుకు నాణ్యమైన విద్యవిధానం అందించడం ముఖ్యం. ఎక్కడైతే సాధ్యమవుతుందో  అక్కడ నాణ్యమైన విద్య అందించాలి. నాణ్యత పెరిగినపుడు ధర కూడ పెరుగుతుంది.  ప్రైవేటు సంస్థలకు ఈ విద్యావిధానాన్ని నడిపించే బాధ్యత అప్పజెప్సినప్పుడు అవి  సమర్ధవంతంగా పనిచేస్తాయి. సిద్ధాంతాలు  రూపొందించడమే కాదూ వాటిని సరిగ్గా ఆచరణలో పెట్టేలా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. .ప్రభుత్వమే ఓ నాణ్యమైన విద్యా విధానం అందించగలగడం సాధ్యంకాదని నేననుకుంటున్నాను

ప్రశ్న: కాని యూఎస్, యూకె దేశాలు ఇలా చేస్తున్నాయి కదా ?

సద్గురు: పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులను ప్రభుత్వం  కల్పించి  వాటిని నిర్వహించే  అవకాశం ప్రైవేటు విద్యాసంస్థలకు ఇచ్చినప్పుడు నాణ్యమైన విద్యా విధానం అందుబాటులోకి వస్తుంది. మన దేశాన్ని యూఎస్, యూకే దేశాలతో పోల్చి చూడలేం. ఎందుకుంటే ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, పరిస్థితులు  భిన్నం. ఇక్కడ  పాతిక భాషలు ఉన్నాయి. వాటిని మనం పదిలపరుచుకోవాలనుకుంటున్నాం. అదేప్రయత్నంలో మన పిల్లలు ప్రపంచంలో ఏ చోటుకు వెళ్లిన ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాం. ఆ దేశాల్లో ఈ పరిస్థితి లేదు.

ప్రశ్న: ఆరోగ్యం విషయంలోనూ ఇలాగే జరుగుతుందని భావించవచ్చా?

సద్గురు: అవును, ఆరోగ్య రంగంలోనూ ఇంతే! ఒకానోక సందర్భంలో గ్రామీణ ప్రాంతంలోని ఆరోగ్య కేంద్రాలు నడిపించే అవకాశం ఇవ్వమని మేం కోరాం.