సర్పం తన కుబుసాన్ని విడిచినట్లుగా, ప్రతిక్షణం గతాన్ని విడిచి ముందుకు సాగినప్పుడే మనలో ఎదుగుదల సాధ్యమవుతుంది. గతమనే కళేబరాన్ని ఎల్లప్పుడూ మోసుకుంటూ తిరిగి అలసిపోకుండా, ఈ క్షణంలో జీవించడమే జీవన సారమని సద్గురు మనకు ఈ ఆర్టికల్ లో చెప్తున్నారు.

మీరు ప్రస్తుతం ‘’నేను’’ అని భావిస్తున్నదంతా, మీ మనసు సేకరించిన ఒక రకమైన రూపకల్పనలు మాత్రమే. గత అనుభవాలనుంచి మీ మనసు సేకరించిన కొంత సమాచారం అది. ‘’నేను మంచి మనిషిని!’’, ‘’నేను చెడ్డవాడిని!’’ ‘’నేను చాలా చిలిపి!’’, ‘’నేను దీనుణ్ణి!’’ ఈ రకంగా మీపై మీకున్న అభిప్రాయాలన్నీ మీరు నిర్మించుకున్నవే. క్లుప్తంగా చెప్పాలంటే అవన్నీ మీ గతం నుంచి పోగైనవే. మీరింకా గతాన్ని పట్టుకొని వేలాడుతూనే ఉన్నారు. మీరు ఇంకా గతం ద్వారా మాత్రమే జీవిస్తున్నారు. గతాన్ని తొలగిస్తే, మనుష్యుల్లో చాలామంది దిక్కుతోచని వారైపోతారు. చాలామందికి, వర్తమానంపై గతప్రభావం చాలా ఎక్కువగా ఉంటోంది. వారికి ప్రతిదీ గతం మీదనే ఆధారపడుతోంది. వాళ్ళ దృష్టిలో గడచిన క్షణమే అన్నింటినీ శాసిస్తోంది. వర్తమానంలో మీరు ఇప్పుడు ఉన్న ఈ క్షణం మీకు ముఖ్యంగా కనిపించడం లేదు. మీ వ్యక్తిత్వానికి మీరు ప్రాధాన్యం ఇస్తున్నప్పుడు, మీకు ప్రస్తుతానికన్నా గడచిన కాలమే ముఖ్యమన్నమాట. ఎందుకంటే మీ వ్యక్తిత్వం అన్నది  మీ గతం నుంచి ఉద్భవించిందే కాని ప్రస్తుతం నుంచి కాదు కదా.

నిజానికి, మీకు ఈ క్షణంలో ఏ వ్యక్తిత్వమూ లేదు, ఇది మీరు అర్థం చేసుకోండి. మీరు మోస్తున్న వ్యక్తిత్వం ఒక మరణించిన వస్తువు అని గుర్తించండి.

నిజానికి, మీకు ఈ క్షణంలో ఏ వ్యక్తిత్వమూ లేదు, ఇది మీరు అర్థం చేసుకోండి. మీరు మోస్తున్న వ్యక్తిత్వం ఒక మరణించిన వస్తువు అని గుర్తించండి. ఒక శవాన్ని మీరు మీ భుజాన మోస్తున్నప్పుడు, మీరు ఎక్కువ దూరం నడవలేరు కదా. అసలు ఒక శవంతో, మీరు ఎటువైపు వెళ్ళగలరు? శ్మశానానికి మాత్రమే, అవునా? శవాన్ని మీరు అలా చాలాసేపు మోస్తున్నట్లయితే, భరించలేని దుర్వాసనలను అనుభవించవలసి ఉంటుంది. మీ వ్యక్తిత్వం, ఎంత బలమైనదైతే దుర్వాసన అంత ఎక్కువగా వస్తుంది. మీరు గతాన్ని వదిలేసినప్పుడు మాత్రమే, జీవితంలో ముందుకు వెళ్ళగలరు. సర్పం తన కుబుసాన్ని విడిచిపెట్టినట్లుగా మీరు మీ గతాన్ని వదిలేయాలి. సర్పం తన చర్మాన్ని ఎలా విడిచివేస్తుందో, మీకు తెలుసా? ఒక క్షణం క్రితం వరకు అది తన శరీరంలోని భాగమే. అయినా, ఒకసారి వదిలేసిన తర్వాత కనీసం వెనక్కి తిరిగి కూడా చూడకుండా అక్కడి నుంచి ముందుకు సాగుతుంది. సర్పం తన కుబుసాన్ని విడిచినట్లుగా, ప్రతిక్షణం గతాన్ని విడిచి ముందుకు సాగినప్పుడే వ్యక్తిలో ఎదుగుదల సాధ్యం అవుతుంది.

గడిచిన క్షణాన్ని వర్తమానంలోకి మోసుకురాని వ్యక్తి మాత్రమే అన్నిటి నుంచీ స్వేచ్ఛగా ఉండగలుగుతాడు.

గడిచిన క్షణాన్ని వర్తమానంలోకి మోసుకురాని వ్యక్తి మాత్రమే అన్నిటి నుంచీ స్వేచ్ఛగా ఉండగలుగుతాడు. ఈ సుగుణమే అన్నిచోట్లా స్ఫురిస్తుంది. అతనితో మాట్లాడిన కొన్ని క్షణాల్లోనే, ఇతరులు తమ తల్లితండ్రులనో, భార్యనో, భర్తనో కూడా విశ్వసించనంతగా అతడిని విశ్వసిస్తారు; ఇందుకు కారణం అతను ‘గతం’ అనే భారాన్ని మోసుకుంటూ తిరగడం లేదు కాబట్టే. ప్రపంచం మొత్తం వ్యక్తిత్వం అనే దుర్వాసనతో నిండి ఉన్నది. ప్రతి ఒక్కరికీ తమ తమ బలమైన వ్యక్తిత్వం, వాసనలు ఉన్నాయి. ఇలా ప్రపంచంలో ఉన్న రకరకాల దుర్గంధాలు అస్తమానం తమలో తాము విరోధించుకుంటూ ఉంటాయి. ఎవరైతే ఈ వాసనలను (వ్యక్తిత్వాలను) అంటించుకోకుండా ఉంటారో, అతడు ఈ భౌతిక పరిమితులను దాటిపోగలడు. అతనికి ఈ సంసార సాగరాన్ని ఈదడమే కాదు, జనన మరణచక్రాల నుంచి తప్పించుకోవడం కూడా సులువు అవుతుంది. ఇలాంటి మనిషి ఈ సంసార సాగరాన్ని అలవోకగా దాటివేయగలడు. ఇతరులకు ఎంతో కష్టమనిపించేవన్నీ ఇతనికి మాత్రం సునాయాసంగా జరిగిపోతాయి.

జీవితంలో, ఒక వస్తువుపైన గాని లేదా ఒక వ్యక్తి పైన గాని మీకు నిజమైన కారుణ్యం కనీసం కొన్నిక్షణాల పాటైనా కలిగి ఉండవచ్చు. ఆ క్షణాలలో మీరెవరో, మీరేంచేస్తుంటారో, మీ వ్యక్తిత్వం, అస్తిత్వం - ఇలాంటివి అన్నీ వాటంతట అవే కరిగిపోతాయి. అప్పుడు ఆ క్షణంలో మీరు తప్ప ఇంకేమీ ఉండవు. కేవలం ఆ క్షణంలోనే మీరుంటారు. అవునా?

ప్రేమాశిస్సులతో,
సద్గురు